Wednesday, January 22, 2025

‘‘భరతమాత ముద్దుబిడ్డ నెహ్రూ:’’ అటల్ బిహారీ వాజపేయి

వాజపేయి, నెహ్రూ

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరణించినప్పుడు అటల్ బిహారీ వాజపేయి అర్పించిన నివాళి ఈ విధంగా ఉంది…

….                                                ….                               …..

‘ఒక కల విచలితమైంది. ఒక పాట మూగబోయింది. ఒక జ్వాల అనంతంలో కలిసిపోయింది. భయం, ఆకలి లేని ఒక ప్రపంచపు కల అది. ఇటు గీతాసారాన్ని ప్రతిధ్వనించే గీతం అది. అటు రోజా పువ్వు వెదజల్లే పరిమళం అది. ఎదురైన ప్రతి చీకటితో పోరాడుతూ, వెలుగులీనుతూ, ప్రతి రాత్రీ మేల్కొని మండుతూ ఉన్న దీపం అది. మాకు దారి చూపుతూనే ఒక నాటి ఉదయం నిర్యాణం చెందింది.

‘మరణం తప్పదు. భౌతిక శరీరం తాత్కాలికం. ఆ బంగరు శరీరం నిన్న గంధపు చెక్కల మధ్య మాయమైంది. కానీ, ఆ మృత్యువు ఎందుకంత తొందరపడిందీ? స్నేహితులంతా నిద్రలో  ఉన్నప్పుడు, పహరా కాస్తున్నవారు ఒకింత మగతగా ఉన్నప్పుడు జీవితంలో మాకు ఎంతో విలువైన ఆ బహుమతిని నిర్దాక్షిణ్యంగా లాక్కుపోయిందే?

‘భరతమాత విషాదంలో మునిగిపోయి ఉంది. తన ముద్దుల బిడ్డను. ప్రియతమ రాకుమారుణ్ణి ఆమె ఈ రోజు కోల్పోయింది. తన అనుచరుణ్ణి, తన సహచరుణ్ణి కోల్పోయానని మానవత్వం ఈ రోజు ఖిన్నవదనంతో ఉంది. తన పరిరక్షకుడు ఇక లేడని…శాంతి ఈ రోజు సహనం కోల్పోయింది. అణగారిన బతుకులకు అండలేకుండా పోయింది. సమాన్యుడి కళ్ళలో వెలుగులు ఆరిపొయ్యాయి. తెరపడిపోయింది. ప్రపంచ రంగస్థలం మీది నుంచి ముఖ్యమైన నటుడు తన చివరి పాత్ర పోషించి, ప్రేక్షకుల ముందు సెలవు తీసుకుని నిష్క్రమించాడు.’

Also read: ప్రకృతి శరణం గచ్ఛామి

….                                                         …..                                       …..

అటల్ బిహారీ వాజపేయి స్వయంగా కవి. భావోద్వేగంలో ఆయన చెప్పిన ఈ మాటలు కేవలం ఆనవాయితీగా చెప్పిన పొడిమాటలు కావు. గుండె లోతుల్లోంచి తన్నుకుని వచ్చినవని తెలుస్తూనే ఉంది. పార్టీలు వేరైనా, రాజకీయంగా భేదాభిప్రాయాలున్నా ఒక మహామనీషి కనుమరుగైనప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని నిజాయతీగా వ్యక్తీకరించాలి. ఆ పనిని బీజేపీ అగ్రనేత వాజపేయి చేశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు వాజపేయి విమర్శను ఆహ్వానించి ప్రోత్సహించారు. ఇందిరాగాంధీ తర్వాత వేర్వేరు వ్యక్తులు ప్రధానులయ్యారు. వాజపేయి విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు సౌత్ బ్లాక్ లోని కారిడార్ లో ఎప్పుడూ ఉండే నెహ్రూ ఫొటోను ఎవరో తొలగించారు. అది గమనించి వాజపేయి కలత చెందారు. ఏది ఏమైనా, దేశ తొలిప్రధానిగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందేనని గొడవ చేసి మళ్ళీ నెహ్రూ చిత్రపటాన్ని అక్కడ యథావిధిగా ఏర్పాటు చేయించారు.  ప్రధానిగా వాజపేయి పార్లమెంట్ లో చేసిన ఒక ఉపన్యాసంలో…ఆయనే స్వయంగా ఈ విషయం తెలియజేశారు. అందుకే రాజకీయాల్లో ఉన్నవారంతా రాజనీతిజ్ఞులు కారు. నేటి వాజపేయి వారసులు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో ఆలోచించుకోవాలి!

Also read: కరోనా నేర్పిన కొత్త పాఠాలు

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మీద ఆరెస్సెస్, బీజేపీ నేతలు తమ అక్కసు అన్ని విధాలా వెళ్ళగక్కుతున్నారు. ‘‘ఈ దేశానికి తొలిప్రధాని నెహ్రూ బదులు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయి ఉంటే కశ్మీరు పరిస్థితి, దేశ పరిస్థితి వేరుగా ఉండేదనీ, కశ్మీర్ లో కొంత భాగం పాకిస్థాన్  అధీనంలో ఉండేది కాదనీ – లోక్ సభలో స్వయంగా నేటి ప్రధాని మోదీ ప్రకటించారు. భారత తొలి హోమ్ మంత్రి సర్దార్ పటేల్ కు తామే నిజమైన వారసులమని ప్రతిచోటా పరకటించుకుంటున్నారు. పదవులున్నాయి –నోటికి పెదవులున్నాయి కదా అని తోచిందల్లా మాట్లాడితే దేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇంతో అంతో చరిత్ర, భూగోళం, సైన్సు, ప్రపంచజ్ఞానం పెంచుకుని, ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తున్న సామాన్యుల సంఖ్య పెరిగింది. వారు అన్నీ విశ్లేషించుకుంటున్నారు. ఎవరైనా సరే, ఆ కాలానికి, ఆ సమయానికి, ఆ సందర్భానికి తగిన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. జనానికి, దేశానికి మేలు చేసిన వారు చరిత్రలో నిలబడతారు. కీడు చేసినవారు చరిత్రహీనులవుతారు. స్వాతంత్ర్యం లభించిన నాటికి దేశంలో నెహ్రూ స్థాయి ఏమిటి? వల్లభాయ్ పటేల్ స్థాయి ఏమిటీ? అనేది కొన్ని పాత ఉత్తరాల వల్ల తెలుసుకోవచ్చు. వాజపేయి శ్రద్ధాంజలితో కొంత అర్థమౌతోంది కదా? దేశానికి స్వాతంత్ర్యం చేజిక్కే నాటికి జవహర్ లాల్ నెహ్రూ తిరుగులేని అగ్రనాయకుడు. ఆయన దార్శనికుడు గనక, దేశ అవసరాలకు కావల్సిన ప్రాజెక్టుల విషయంలో, వైజ్ఞానిక పరిశోధనాశాలల స్థాపన విషయంలో, వైజ్ఞానికుల్ని ప్రోత్సహించిన విషయంలో, ప్రభుత్వ విధానాలపై విమర్శల్ని ఆహ్వానించిన విషయంలో, లలిత కళల్ని, బాలల అవసరాల్ని గుర్తించిన విషయంలో ఆయనకు ఆయనే సాటి. పద్నాలుగేళ్ళు జైల్లో మగ్గినా, భార్య చనిపోయి ఒంటరివాడైనా, మొక్కవోని దీక్షతో తనను తాను దేశానికి అర్పించుకున్న ధీశాలి. ఇప్పటి బీజేపీ ప్రభుత్వం, ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు పనిగట్టుకుని నెహ్రూ కృషిని, నిర్ణయాల్ని తక్కువ చేసి మాట్లాడడం వారి సంస్కారహీనతను తెలియజేస్తుంది తప్ప తొలి ప్రధాని ముద్రను చెరిపేయలేవు. మహాత్మాగాంధీ నెహ్రూని అక్రమంగా, దొడ్డిదారిన ప్రధానిని చేశారని నేటి ప్రభుత్వ నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ఆ కాలంలో నెహ్రూ స్థాయి ఏమిటో, సర్దార్ పటేల్ స్థోమత ఏమిటో అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేరు.

Also read: దయ చేసి దిగిపోండి: అరుంధతీరాయ్

దేశంలో ఆకలి, పేదరికం రూపుమాపాలంటే దేశం వైజ్ఞానికంగా అభివృద్ధి సాధించాలని కలలుగన్నవాడు నెహ్రూ. విద్యావంతుల, అందులో వవేకవంతుల సంఖ్య పెంచడం, సంస్కృతీసంప్రదాయాల గుప్పిట్లో ఉన్న మూఢనమ్మకాల్ని తగ్గించడం తక్షణం చేయాల్సిన పనులని ఆయన ఉద్బోధించారు. హోమీ జె. భాభా, శాంతిస్వరూప్ భట్నాగర్, సర్.సి.వి. రామన్, సతీష్ ధవన్, జె.సి. ఘోష్, మేఘానంద్ సాహా, నళీనీ రాజన్ శంకర్ లాంటి వైజ్ఞానికుల్ని ఆయన స్వయంగా ప్రోత్సహించి వారిచేత ప్రపంచ స్థాయి పరిశోధనాశాలలకు రూపకల్పన చేయించడం సామాన్యమైన విషయం కాదు. ఎంతటి దార్శనికుడయితే నెహ్రూ ఆ పనులు చేయగలిగారూ? బ్రిటీష్ భౌతికశాస్త్రవేత్త, నొబెల్ గ్రహీత అయిన పాట్రిక్ బ్లాకెట్ ను తన వైజ్ఞానిక సలహాదారుగా చేసుకొని, భారతీయ రక్షణశాఖను బలోపేతం చేయగలిగారూ? అనేక రంగాలలో ఆయన వేసిన పునాది మీదే దేశం తర్వాతి కాలంలో పురోగతి సాధిస్తూ వస్తోంది కదా? ఇంత చేసిన ఆ దేశ నిర్మాతని చరిత్రపుటల్లోంచి తీసెయ్యాలని ప్రయత్నించడం, ఉపన్యాసాల్లో ఆయన పేరు రాకుండా విస్మరించడం ఏమి గొప్పదనం? బాబూరాజేంద్రప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నెహ్రూ కృషికి గుర్తింపుగా స్వయంగా ఆయనే ‘భారతరత్న’ ప్రకటించారు. ఆ విషయం దేశ ప్రజలకు కూడా తెలియజేశారు. ఆ విషయం పరిగణనలోకి తీసుకోకుండా నెహ్రూయే తనకు తాను భారతరత్న ప్రకటించుకున్నారని ఇప్పటి నీతిమాలిన పెద్దలు దుష్ప్రచారం చేస్తున్నారు. దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ పేరు  మార్చి నరేంద్రమోదీ పేరు పెట్టాలని కుటిలయత్నాలు జరగుతున్నాయట. విలువల వలువలు విడిచేసినవారికి సిగ్గూఎగ్గూ ఏముంటుంది?

Also read: ‘రే’ ను గూర్చి రేఖామాత్రంగా

తన తర్వాత తన భాష మాట్లాడేది నెహ్రూనే… అని గాంధీజీ అన్నారు. సర్దార్ పటేల్, నెహ్రూ కన్నా 14 ఏళ్ళు పెద్దవాడు. అయినా కూడా నెహ్రూకి తన జీవితకాలం విధేయుడినని ప్రకటించుకున్నారు. అలాగే రాజాజీ – సి. రాజగోపాలాచారి – నెహ్రూ కన్నా 11 ఏళ్ళు పెద్ద. అయినా కూడా తనకన్నా నెహ్రూ 11 వందల రెట్లు గొప్పవాడని రాజాజీ కితాబిచ్చారు. తొలి ప్రధాని అయ్యాక, తన మంత్రివర్గంలోచేరి, హోమ్ శాఖ నిర్వహించాల్సిందిగా నెహ్రూజీ సర్దార్ కు లేఖ రాశారు. దానికి వల్లభాయ్ ప్రత్యుత్తరం ఇలా ఉంది.

Also read: భారత్ లో మిగిలింది మనువాద మార్క్సిజమా?

….                                                         …..                              ….

‘ముప్పయ్యేళ్ళుగా కొనసాగుతున్న మన స్నేహబంధం, స్వాతంత్ర్యోద్యమంలో కార్యకర్తలుగా మన అనుబంధం చాలా గొప్పవి. వాటి ముందు ఈ ఆనవాయితీ అంగీకారాలు అవసరం లేదు. నా సేవలు మీరు ఎలా అంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఈ దేశం కోసం మీరు చేసిన త్యాగం గొప్పది. ఇలాంటిది మీరు కాక మరొకరెవరూ చేయలేదని నా విశ్వాసం. అందువల్ల, ఇక నా జీవితమంతా మీకు ఎదురు చెప్పని విశ్వాసపాత్రుడనై ఉంటూ అంకిత భావంతో పని చేస్తాను.’                                                                             …..                                          …… …..

‘‘నేను కశ్మీర్ కు చేయగలిగింది చేశాను. కశ్మీర్ కు సంబంధించి విధానపరమైన అభిప్రాయభేదాలు మీకూనాకూ లేవు. అయినా దురదృష్టవశాత్తు మన కింద ఉన్నవారు మీకూ నాకూ మధ్య పెద్ద అగాధాలు ఉన్నాయని భావిస్తున్నారు.’’ (సర్దార్ పటేల్ నెహ్రూకు రాసిన ఉత్తరం. అక్టోబర్ 8, 1947- నేషనల్ బుక్ ట్రస్ట్ (2010)పుస్తకం నుంచి) పండిట్ నెహ్రూ నాటి దేశ రాజకీయాలనే కాదు, ప్రపంచ రాజకీయాలనే శాసించారు. దేశానికి దిశానిర్దేశం చేస్తూ, దేశప్రజలకు వైజ్ఞానిక స్పృహను నూరిపోశారు. వాల్టర్ క్రూకర్ మాటల్లో – ‘‘నెహ్రూ ఒక అరుదైన వ్యక్తి! సర్వస్వతంత్రుడై ఉండి, తెలివి, శక్తిసామర్థ్యాలు ఉండి మంచివాడుగా, వినయశీలిగా ఉండడం అరుదు కదా?’’ చదువూ సంస్కారమూ లేక, వ్యక్తిత్వమూ లేక మందబలంతో బరితెగించిన నేతల్ని ఇప్పుడు మన కళ్ళముందు చూస్తున్నాం. ఈ మూర్ఖ ప్రభుత్వపు ఆగడాలు దేశాన్ని ఇంకా ఎంత అనాగరికతలోకి తీసుకువెళతాయో తెలియదు.

Also read: మహామానవతావాది – సర్ చార్లీ చాప్లిన్

(మే 27 పండిట్ జవహర్ లాల్ నెహ్రూ (14 నవంబర్ 1889 – 27 మే 1964) 57వ వర్థంతి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles