- ఎనిమిదో విడత చర్చలు విఫలం
- కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
- చట్టాల రద్దుపై వెనక్కి తగ్గని రైతు సంఘాలు
- రద్దు కుదరదన్న కేంద్ర మంత్రుల బృందం
- సుప్రీకోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇచ్చిన మంత్రులు
- జనవరి 15 న మళ్లీ భేటీ కానున్న ఇరు పక్షాలు
నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం రైతుల మధ్య నెలకొన ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. ఎనిమిదో సారి జరిగిన చర్చలు కూడా కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాల ప్రతినిధులకు మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనను వీడలేదు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. రద్దు మాత్రం కుదరదని కేవలం అవసరమైతే సవరణలు మాత్రం చేయగలమని కేంద్ర మంత్రులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఎనిమిదో విడత చర్చలు కూడా ఫలప్రదమవలేదు. మీరు చట్టాలు రద్దు చేయండి మేము ఇళ్లకు వెళతామంటూ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. దీంతో తదుపరి చర్చలు జనవరి 15వ తేదీకి వాయిదా వేశారు.
ఇది చదవండి: అన్నదాత ఆక్రందన పెడచెవిన పెట్టడం అనర్థం
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, సోం ప్రకాశ్ లు పాల్గొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర మంత్రుల బృందం రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అయింది. చర్చలు ప్రారంభమయిన కొద్ది సేపటికే ఇరు వర్గాలు తమ డిమాండ్లు నెరవేర్చాలని భీష్మించుకు కూర్చోవడంతో చర్చలు అసంపుర్తిగానే ముగిశాయి.
ఇది చదవండి:మెట్టుదిగని సర్కార్, రాజీపడని రైతు
దేశ ప్రయోజనాలు విస్మరించరాదని రైతులకు హితవు
వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలందరి ప్రయోజనం కోసం తీసుకొచ్చామని ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కావని మంత్రుల బృందం రైతులకు వివరించినట్లు తెలిసింది. వ్యవసాయ చట్టాలను దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు స్వాగతించారని దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని రైతు సంఘాల ప్రతినిధులకు సూచించారు. అయినా రైతు సంఘాల ప్రతినిధులు వెనక్కి తగ్గకపోవడంతో మంత్రుల బృందం చట్టాలను రద్దు చేయలేమని కావాలంటే మీరు సుప్రీంకోర్టులో తేల్చుకోండని చెప్పినట్లు సమాచారం. చట్టాలు అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం చెబితే ఉపసంహరించుకునేందుకు వెనుకాడం. ఒక వేళ చట్టబద్దమైనవేనని కోర్టు తీర్పు చెబితే రైతులు ఉద్యమాన్ని విరమించుకోవాలని మంత్రుల బృందం రైతులకు వివరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. దీనిపై రైతు సంఘాల ప్రతినిధులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. కోర్టు తీర్పులకు చాలా సమయం పడుతుందని రైతులు అభిప్రాయపడ్డారు.