- సీబీఐతో దర్యాప్తు చేయించాలని చంద్రబాబు డిమాండ్
- హిందూ దేవాలయలపై దాడులను సహించం
- ప్రత్యేకహోదాను అటకెక్కించారన్న చంద్రబాబు
ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆలయాలపై దాడులు చేస్తే ఉపేక్షించేంది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. సీఎం జగన్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏడాదిన్నర పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తిచేశారా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏ మసీదు, చర్చిపై దాడి జరగలేదన్నారు. రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం తల తీసినపుడే సిగ్గుతో సీఎం తలదించుకోవాలని చంద్రబాబు అన్నారు. రామతీర్థం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించకుండా ప్రతిపక్షాలను నిందిస్తూ కుంటి సాకులు చెబుతున్నారని జగన్ పై చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఇది చదవండి: ఉద్రిక్తంగా బీజేపీ, జనసేన ఛలో రామతీర్థం
ప్రత్యేక హోదాపై మాట్లాడే ధైర్యం ఎంపీలకు లేదు
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సీఎంను డిమాండ్ చేశారు. రామతీర్థం ఘటన అమానుషమని చంద్రబాబు మండిపడ్డారు. పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారని విమర్శించారు. ఘటన జరిగి ఐదు రోజులైనా పట్టించుకోకుండా ఏం గడ్డిపీకారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. కులమతాలకు అతీతంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్ ఇపుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. పాస్టర్లకు నెలకు 5 వేలు ఇవ్వడం చట్ట విరుద్ధమన్న చంద్రబాబు రాష్ట్రంలో హిందువులతో పాటు ముస్లింలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. జగన్ కు అమరావతి అంటే కంపరమని వాటికన్ సిటీ అంటే ఇష్టమని అన్నారు. ప్రత్యేక హోదాపై గతంలో రాగాలు తీసిన జగన్ 22 మంది ఎంపీలను ఇస్తే అడిగే ధైర్యం ఒక్కరికి కూడా లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఇది చదవండి: రాజకీయాల్లోకి దేవుడ్ని లాగుతారా-సీఎం జగన్ ఆవేదన