Tuesday, November 5, 2024

భారత్ కీర్తికిరీటంలో కలకితురాయి నీరజ్ చోప్డా

  • జావెలిన్ త్రో లో రజత పతకం గెలుచుకున్ననీరజ్ చోప్డా
  • అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో పతకం సాధించిన రెండో భారతీయుడు
  • అంజూ బాబీ జార్జికి 2003లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో కాంస్యం
Neeraj Chopra wins historic silver medal for India at World Athletics  C'ships - Hindustan Times
రజత పతకం చూసుకుంటున్న నీరజ్ చోప్డా

నీరజ్ చోప్డా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో జావెలిన్ త్రోలో రజత పతకం సాధించి చరిత్రకు ఎక్కాడు. భారత దేశాన్ని ప్రపంచ జావెలిన్ పటంలో సగర్వంగా నిలిపాడు. అమెరికా ఆరెగావ్ లోని యూజీన్ లో జరుగుతున్న అథ్లెటిక్స్ పోటీలలో జావెలిన్ ను 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకం సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ చరిత్రలో భారత్ తరఫున పతకం గెలిచిన ఇద్దరే ఇద్దరిలో చోప్డా ఒకరు. రెండో వ్యక్తి లాంగ్ జంప్ లోకాంస్య పతకం గెలుచుకున్న అంజూ బాబీ జార్జి. ఆమె 2003లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో పతకం సాధించింది.  ఆదివారం జరిగిన ఫైనల్ లో బంగారు పతకం ఇప్పటికే ప్రపంచ చాంపియన్ గా ఉన్న గ్రెనడావాసి యాండర్సన్ పీటర్స్ కు దక్కింది. జావెలిన్ త్రోలో చాంపియన్ షిప్ ను వరుసగా రెండో సంవత్సరం గెలుచుకొని టైటిల్ నిలబెట్టుకున్న రెండో  అథ్లెట్ గా యాండర్సన్ పీటర్స్ చరిత్ర సృష్టించాడు. పీటర్స్ జావెలిన్ ని 90.54 మీటర్ల దూరం విసిరాడు.

చోప్రా ప్రారంభం, ముగింపు వైఫల్యాల బాటలోనే సాగాయి. కానీ మధ్యలో బాగా రాణించాడు. మొదటి త్రో ఫౌల్ అయింది. రెండో త్రో లో 82.39 మీటర్లు విసిరాడు. మూడో త్రో లో 86.37 మీటర్ల దూరం జావనెల్ ను పంపించాడు. నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరాడు. ఐదవ, ఆరవ ప్రయత్నాలు విఫలమైనాయి. నాలుగో ప్రయత్నంలో  సాధించిన దూరంతోనే రజత పకతం సొంతం చేసుకున్నాడు. కాంస్య పతకం గెలుచుకున్న జెక్ రిపబ్లిక్ కు చెందిన జాకుబ్ వాడ్లేచ్ 88.09 మీటర్లు జావెలిన్ ను విసిరాడు. అంటే చోప్డాకంటే కేవలం 0.12 మీటర్లు తక్కువ. స్వర్ణం గెలుచుకున్న పీటర్స్ కంటే చోప్డా 2.41 మీటర్ల తక్కువ దూరం విసరగలిగాడు. అంటే పీటర్స్ ఎంత ఎత్తులో ఉన్నాడో అర్థం చేసుకోవాలి. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 86.86 మీటర్లు విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్ కే చెందిన మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ 80.21 మీటర్లు పంపించి పదో స్థానంలో నిలిచాడు. 21 సంవత్సరాల యాదవ్ జూన్ లో జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర చాంపియన్ షిప్స్ లో 82.54 మీటర్ల దూరం జావెలిన్ ను విసరగలిగాడు.

Anju Bobby George Height, Weight, Age, Husband, Biography & More »  StarsUnfolded
అంజూ బాబీ జార్జి

యాండర్సన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. మొదటి ప్రయత్నంలోనే జావెలిన్ ను 90.21 మీటర్లు విసిరితే, రెండో ప్రయత్నంలో 90.46 మీటర్ల దూరం పంపించాడు. ఆరో ప్రయతనంలో 90.54 మీటర్ల దూరం విసిరి అజేయంగా నిలిచాడు. జావెలిన్ త్రో లో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచిన ఖ్యాతి కూడా నీరజ్ చోప్డాకే దక్కింది. ఒలింపిక్స్ నిరుడు టోక్యోలో జరిగినప్పుడు నీరజ్ చోప్డా జావెలిన్ త్రోలో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో స్వర్ణ పతకం గెలుచుకున్న రెండో భారతీయ క్రీడాకారుడుగా చోప్డా పేరు నమోదు అయింది. మొదటి క్రీడాకారుడు షూటింగ్ ప్రవీణుడు అభినవ్ బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో షూటింగ్ రంగంలో స్వర్ణం సాధించాడు.  ఇప్పుడు చోప్డా వయస్సు 24 ఏళ్ళు. 2017 నాటి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో చోప్డా అర్హత సంపాదించలేకపోయాడు. గాయం కారణంగా 2019లో పోటీలలో పాల్గొనలేకపోయాడు. 2022లో అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో పతకం గెలుచుకున్న రెండవ భారతీయుడు, మొదటి భారత పురుషుడు అయ్యాడు. నీరజ్ చోప్డా భారత దేశ చరిత్రలో అగ్రగణ్యుడైన అథ్లెట్ అంటూ అంజూ బాబీ జార్జి ప్రశంసించారు. ‘నేను అత్యంత సంతోషంగా ఉన్నాను,’ అంటూ అంజూ ఆనందం వెలిబుచ్చారు.

హరియాణాలోని పానిపట్ లో నీరజ్ చోప్డా నివాసంలో అతని కుటుంబ సభ్యులు ఉల్లాసంగా మిఠాయిలు పంచుకొని సంబరం చేసుకున్నారు. కుటుంబంలోని మహిళలు తమ నివాసంలోనే విజయ నృత్యం చేశారు. ‘నా కుమారుడు పడిన శ్రమ సత్ఫలితం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది,’ అంటూ నీరజ్ తల్లి సరోజ్ చోప్డా ఆనందం వెలిబుచ్చారు. నీరజ్ తాతగారు ధరమ్ సింగ్ చోప్డా కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ‘‘మేము స్వర్ణపతకం వస్తుందని ఊహించాం. కానీ రజతపతకం గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంది,’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘అతడు ఎప్పుడూ చరిత్ర సృష్టిస్తూనే ఉంటాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ 2003లో అంజూ బాబీ జార్జి కాంస్యపతకం సాధించారు. 2022లో నీరజ్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు,’’ అంటూ సంతోషంగా అన్నాడు నీరజ్ సమీప బంధువు గౌరవ్. అథ్లెటిక్స్ లో ఒక మెడల్ కోసం దేశం పందొమ్మిదేళ్ళు వేచి చూడవలసి వచ్చింది. ‘‘నీరజ్ రెండో స్థానంలో నిలిచినందుకు ఆనందంగా ఉంది,’’ అని నీరజ్ తండ్రి సతీష్ కుమార్  అన్నారు. నీరజ్ చోప్డాకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, విశిష్ఠ సేవా మెడల్, పరమ విశిష్ఠ సేవా మెడల్ ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. ‘మన గొప్ప అథ్లెట్స్ లో ఒకడైన నీరజ్ సాధించిన ఘనవిజయం ఇది. భారత క్రీడారంగానికి ఇది ప్రత్యేకమైన సందర్భం. నీరజ్ కు నా అభినందనలు’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ ఆదివారంనాడు ఒక ట్వీట్ ఇచ్చారు.

పానిపట్ జిల్లా కలెక్టర్ సుశీల్ శర్వణ్ నీరజ్ చోప్డా కుటుంబ సభ్యులను కలుసుకొని వారితో సంతోషం పంచుకోవడం కనిపించింది. ఇరుగుపొరుగువారూ, బంధువులూ నీరజ్ కుటుంబ సభ్యులతో సంతోషంగా మాట్లాడారు.

నిరుడు టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్డాతో స్పూర్తి పొందిన గ్రామంలోని యువకులు జావెలిన్ త్రోలో శిక్షణ ప్రారంభించారు. ‘‘మేము కూడా జావెలిన్ త్రో ప్రాక్టీసు చేస్తున్నాం,’’ అంటూ నీరజ్ ఇంటిదగ్గరే ఉన్న ఒక పొరుగింటి యువకుడు చెప్పాడు. ‘నీరజ్ భయ్యా మెడల్ గెలుచుకోవడం మాకందరికీ సంతోషంగా ఉంది,’ అని మరో పొరుగు యువకుడు వ్యాఖ్యానించాడు.    

‘జ్యోతి సే జ్యోతి జగాతె చలో’ అన్నట్టు ఒకరి విజయం మరెందరికో స్ఫూర్తిదాయకం అవుతుంది. మరింతమంది నీరజ్ చోప్డాలు తయారవుతారు. మరిన్ని విజయాలు సాధిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles