Monday, January 6, 2025

నీలం అడుగుజాడలు ఇంకా కొనసాగుతున్నాయి…

జాన్ సన్ చోరగుడి

కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశాల్లో ఉన్నప్పుడు, అది ప్రజాబాహుళ్యానికి ప్రదర్శన మాత్రమే.కానీ కాంగ్రెస్ కమిటీ రూమ్ లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పనిలో నిమగ్నమై ఉన్నట్టు

ఉడ్రో విల్సన్ అమెరికా మాజీ అధ్యక్షుడు (1913-1921)

డా. శ్రీ నీలం సంజీవరెడ్డి గారు కన్నుమూసిన తర్వాత మూడు దశాబ్దాల కాలానికి చేరువ అవుతున్న తరుణంలో, వారి గురించి మాట్లాడుకుంటున్న సందర్భమిది. జాతీయ స్థాయిలో లబ్ధప్రతిష్ఠులైన మహనీయుల జీవితాలను సమీక్షించేప్పుడు- వారిని, వారున్న కాలపరిధిలో ఉంచి మరీ చూడ్డం అవసరం.

అలా చూడగలిగే కాలిక స్పృహతో కూడిన చూపు మనకు ఉన్నప్పుడు, ఆ నాయకుడికి ముందున్నది ఏమిటి? వారి తర్వాత జరిగింది ఏమిటి; రెండు కాలాల మధ్య వారధిగా మనం మాట్లాడుకుంటున్న నేత- ‘కాంట్రిబ్యూషన్’  ఏమైనా ఉందా? ఉంటే అది ఎటువంటిది? అనే తులనాత్మక పరిశీలన సాధ్యమవుతుంది. అయితే ఎక్కువసార్లు, సుళువు కదా అని మనకు సమీపాన తెలిసిన వివరాలతో, స్థానిక దృష్టి నుంచి జాతీయ నాయకులు గురించి కూడా మాట్లాడ్డం మనం మొదలెడతాం. అది సరైన ప్రయత్నం కాదు.

Also read: వానపాముల కదలికలు, వారి ఉక్కపోతకు కారణం!

వందేళ్లకు చేరువ అవుతున్న దేశచరిత్రలో, అవి ఎన్ని పేజీలు ఉంటాయి? అనే దానితో పనిలేకుండా, మన రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలో పనిచేసినవారి స్థానాన్ని మనమే పదిలంగా ప్రతిష్టించుకోవాలి. అయితే ఎక్కువ సార్లు ఆలా జరగడం లేదు. ఆధునిక భారతీయ రాజకీయ చరిత్రలో ప్రధాన మంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ మొదటి ‘టర్మ్’ ను (1966-77) ‘వెల్ఫేర్ ఎరా’ అంటుంటాము. ఆ కాలాన్ని అలా కీర్తించడానికి అవసరమైన- రాజకీయ, పరిపాలనా సంబంధమై న పార్లమెంటరీ రాజకీయ పర్యావరణాన్ని సృష్టించింది,  1967-69 మధ్య కాలంలో లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన- డా. శ్రీ నీలం సంజీవరెడ్డి.

సైనిక వందనం స్వీకరిస్తున్న సంజీవరెడ్డి

చరిత్ర వుంది

అయితే, అదేమీ ఉన్నట్టుండి జరిగిందేమీ కాదు. రెడ్డి గారు పార్లమెంటరీ రాజకీయాల్లో పోషించిన ఈ క్రియాశీల పాత్రకు చరిత్ర వుంది. రాజ్యాంగం ముసాయిదా తయారు చేయడానికి 9 డిసెంబర్ 1946న ఏర్పడిన ‘కాన్స్టుయెంట్ అసెంబ్లీ’ ప్రావెన్స్ సభ్యుల్లో మద్రాస్ నుంచి ఎంపికచేయబడిన తెలుగు వారిలో సర్వశ్రీ- కళా వెంకటరావు, మొసలికంటి తిరుమల రావు, పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం, ఎన్ . జి. రంగా, నీలం సంజీవ రెడ్డి వంటి ఉద్దండులు ఉన్నారు. అటువంటి విలువైన అనుభవ నేపథ్యం తర్వాత కాలంలో లోక్ సభ స్పీకర్ గా రెడ్డి గారికి ఉపకరించింది.  

Also read: రాష్ట్రవిభజన రహస్యం వెల్లడించిన విశాఖ వేదిక!

పార్లమెంట్ సభ్యుడుగా 1967లో ఎన్నికయిన తర్వాత, వెంటనే లోక్ సభకు స్పీకర్ అయిన నలుగురిలో రెడ్డి ఒకరు కావడం ఒక అంశమయితే; స్పీకర్ అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, అది రాజకీయాలకు అతీతమైన స్థానం అని ప్రకటించిన నిక్కచ్చితనం ఉన్న నాయకుడు డా. శ్రీ నీలం సంజీవ రెడ్డి. అలా స్వత్యంత్రంగా వ్యవహరించడానికి అవసరమైన భూమికను ఆయన ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇటువంటి స్వంత వ్యక్తిత్వంతో 1967-69 నాటికి ఆయన లోక్ సభ స్పీకర్ స్థానంలోకి రావడానికి మరికొంత నేపధ్యం ఉంది.అప్పటికి శ్రీమతి ఇందిరా గాంధీ ప్రధానమంత్రి. దానికి ముందు- పండిట్ జవహర్ లాల్ నెహ్రు, లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానులుగా వున్న కాలంలో (1956-60, 1962-64) ఆరేళ్ళు పైగా సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా- నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, వంశధార వంటి ప్రాజెక్టులు చేపట్టిన విలువైన అనుభవ నేపథ్యం, తర్వాత ఆయన ఢిల్లీలో పనిచేసిన స్థానాల్లో ఉపకరించింది.

ఇందిరాగాంధీ ప్రభుత్వంలో

శాస్త్రిగారి ప్రభుత్వంలో 1964 నాటికి- ‘సోషల్ సెక్యూరిటీ డిపార్మెంట్’ న్యాయశాఖలో ఉండేది.  సోషల్ సెక్యూరిటీకి అనుబంధమైన అన్ని విభాగాలు, ఖాదీ-హస్తకళలు ఈ శాఖతో ఉండేవి. అటువంటిది 1966లో కేంద్ర ప్రభుత్వం- ‘సోషల్ వెల్ఫేర్ డిపార్మెంట్’ ఏర్పాటుచేసి, దాన్ని విద్యాశాఖతో జతచేసింది. ఈ నేపథ్యంలో 1967లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో- ‘The Committee of the Welfare of the Scheduled Castes and Scheduled Tribes’ పేరుతో పార్లమెంటరీ కమిటీ రెడ్డి అధ్యక్షతన లోక్ సభలో చేసిన తీర్మానం మేరకు 30 ఆగస్టు 1968న ఏర్పాటు అయింది.

Also read: ‘క్రిస్మస్’ తోనే సరళీకరణ మొదలయింది…

మదర్ థెరిసాతో సంజీవరెడ్డి

అస్సాం కు చెందిన డి. బసుముతరై అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో సభ్యురాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజన ఎం. పి. శ్రీమతి. బి. రాధాబాయి ఆనందరావు కూడా ఉన్నారు. ఈ కమిటీ 26 నవంబర్ 1969న తన నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదికకు సంబంధించిన ప్రధానమైన వివరాలు ఇలా వున్నాయి-

  • The term of the office of the Committee is for a period of two years beginning from the date of their first sitting, i.e. from the 18thDecember, 1968.
  • At their sittings held on the 7th and 14th May, 1969, the Committee decided to constitute a Sub-Committee consisting of 9 Members to examine the Reorganizations of the Office of the Commissioner for Scheduled Castes and Scheduled Tribes and the set-up of the Department of Social Welfare with special reference to the office of the Director General, Backward Classes Welfare.

ఆ నివేదికలోని అధ్యాయాల వరస ఇది-

CHAPTER I- Role of the Commissioner for Scheduled Castes and Scheduled Tribes

CHAPTER II- Re-organization of the office of the Commissioner.

CHAPTER III- Office of the Director General, Backward Classes Welfare

CHAPTER IV – Organizational Pattern in States

CHAPTER V- Investigation into cases of harassment, exploitation etc

CHAPTER VI- Tenure, Qualification and Status of the Commissioner

ఇలా తాను ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ నివేదిక తాను స్పీకర్ స్థానంలో ఉండగానే, నిర్దేశించిన కాల పరిమితికి ముందు దానిని పార్లమెంట్ ముందు ఉంచడం; అది అమలులోకి రావడం, ఇదంతా తదనంతర చరిత్ర. ఆ తర్వాత జరిగింది ఏమిటి? అనే ప్రశ్నకు ఇందిరా గాంధీ ప్రభుత్వంలో అమలు జరిగిన సాంఘిక సంక్షేమ పథకాలు వద్ద, మనం సమాధానం కోసం వెతకాలి.

డా. నీలం సంజీవ రెడ్డి కన్నుమూసిన (1996) దశాబ్ది కాలానికి మళ్ళీ ఇదే రాయలసీమ ప్రాంతం నుంచి మరో కాంగ్రెస్ నాయకుడు డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డి- ‘ఇందిరమ్మ రాజ్యం – ఇంటింటా సౌభాగ్యం’ అంటూ అధికారంలోకి వచ్చి, ‘జలయజ్ఞం’ పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం అనేది, నీలం అడుగుజాడలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నట్టుగా చూడాల్సివుంటుంది.

Also read: ‘సీన్’ ఇండియా మ్యాప్ క్రిందికి కనుక ‘షిఫ్ట్’ అయితే?

రచయిత: అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత

(భారత గ్రామీణ అధ్యయనం – పరిశోధన అకాడమీ (అగ్రశ్రీ‘) తిరుపతి, మే 19న వెలువరించనున్న డా. నీలం సంజీవరెడ్డి స్మారక సంచిక కోసం రాసిన వ్యాసం)

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles