- బుధవారం విచారణ
- డివిజన్ బెంచ్ తీర్పుపట్ల సర్వత్రా ఆసక్తి
అమరావతి: జెడ్ పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ముందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ సవాలు చేశారు. ఈ కేసు బుధవారంనాడు విచారణకు రానున్నది.
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 8న జెడ్ పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ఏప్రిల్ ఒకటో తేదీన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ను హైకోర్టు సింగిల్ జడ్డి కొట్టివేసి సంచలనం సృష్టించారు. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందుగానే నోటిఫికేషన్ విడుదల కావాలనీ, ఎన్నికల కోడ్ అమలులోకి రావాలనీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వ్యవహరించారని కోర్టు తప్పుపట్టింది. ఎంపీటీసీ, జెడ్ పీటీసీ ఎన్నికలు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడి నుంచి కొనసాగించేందుకు నోటిఫికేషన్ కొత్తగా జారీ చేయాలని ఎన్నికల కమిషనర్ కు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు రూ. 160 కోట్లు ఖర్చయిందనీ, అందువల్ల ఎన్నికలను ఆమోదించాలనీ అంటూ ఎన్నికల కమిషనర్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అట్లా చేయడం అక్రమాన్ని ఆమోదించినట్టు అవుతుందని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బుధవారం ఎన్నికల కమిషనర్ అప్పీలుపైన డివిజన్ బెంచ్ ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తుందో చూడాలి.