నేర్పుగా తొలగించిన డాక్టర్ మధుసూదన్
హైదరాబాద్: అపురూపమైన శస్త్ర చికిత్స.. ఉదరంలోంచి వెంట్రుకలు..కణితి…మేకులు,..ఇలా ఎన్నెన్నో వార్తలు చదివాం కదా. అయితే ఇవన్నీ మనుషులకు జరిగిన శస్త్ర చికిత్సలు. ఈ చికిత్స శస్త్ర చికిత్స కాదు. మేధస్సు ఉపయోగించి చేసింది. ఇక్కడి విజయనగర్ కాలనీలో ఉన్న పశువైద్య శాలకు రెండు రోజుల క్రితం ఓ బుల్లి శునకాన్ని తీసుకొచ్చారు. కారణం వాంతులు, విరేచనం కాకపోవడం. దీనిని పరిశీలించిన డాక్టర్ మధుసూదన్ నేర్పుగా వ్యవహరించారు. దాని మలద్వారం (రెక్టమ్)లో ఆయనకు ఏదో అడ్డంకి కనిపించింది. అప్పటికే ఆ వస్తువు రెక్టమ్‌ను తీవ్రంగా గాయపరిచింది. కడు జాగరూకతతో ఆయన దాన్ని నేర్పుగా బయటకు తీశారు.
దాన్ని చూసిన అందరికీ ఒళ్ళు జలదరించింది. షిర్జు జాతి శునకం ఆ వస్తువును ఎలా మింగిందో ఎవరికీ అర్థం కాలేదు. అది సుమారు రెండు అంగుళాల పొడవున్న మేకు. దాని చివరన ఉండలాగా దారం. ఏమైనా మొత్తం మీద ఆ కుక్కపిల్లకు పునర్జన్మ లభించినట్లయ్యింది. ఇదే ఏ కార్పొరేట్ హాస్పటల్లోనో అయితే.. ఎంతెంతో చెప్పుకునే వారు. ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో ఇలాంటి వాటికి పెద్దగా ప్రచారం రాదు. డాక్టర్ మదుసూదన్ ముత్యాల ప్రభుత్వ పశువైద్య శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
కొవిడ్ సమయంలో కూడా వెరవకుండా నిబంధనలు పాటిస్తూ విధులు చేపట్టారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ మూగజీవాల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ఆస్పత్రికి తమ పెంపుడు జంతువులను తీసుకొచ్చే వారికి ఆయన ఒకటే చెబుతుంటారు. మన చేతుల్లో ఏమీ లేదు. కానీ మాకు చేతులే ఆయుధాలు. మా దగ్గర స్కానింగ్‌లుండవు. ఎక్స్‌రేలు ఉండవు. జీవానికి ఇబ్బంది లేకుండా చూడటమే మా లక్ష్యం. ఒక్క క్షణం కూడా ఆయువు పోయలేం. గాడ్ క్యూర్స్…డాక్టర్ టేక్స్ క్రెడిట్ అంటారు. ఎన్నో క్లిష్టమైన కేసులను ఆయన పరిష్కరించారు. అందులో ఈ షిర్జు కేసు ఒకటి.