- ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు
- వరద ఉధృతికి కొట్టుకుపోయిన పలు ఆనకట్టలు
- విపత్తుపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు
ఉత్తరాఖండ్ ప్రకృతి సృష్టించిన జలవిలయం అంతా ఇంతాకాదు. మరణించిన వారిసంఖ్య 20 కి చేరుకోగా ఘటనలో మొత్తం 200 మందికి పై గల్లంతయినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వాయుసేన, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా గల్లంతయిన వారికోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడటంతో ఆకస్మిక వరదలు పోటెత్తిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ధౌలిగంగ నది ఉధృతిని తగ్గించడానికి సైనిక సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనికోసం సమీపంలోని సొరంగ మార్గాలన్నీ విపరీతమైన బురదతో నిండిపోవడంతో బురదను తొలగించి శుభ్రం చేస్తున్నారు.
నీటిపాలైన ఆనకట్టలు :
వరద ఉధృతికి పలు ఆనకట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తపోవన్ ఆనకట్ట సమీపంలోని సొరంగంలో గల్లంతయిన వారికోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. మందాకిని నది ఉధృత స్థాయిలో ప్రవహిస్తూ ఉండటంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. రుషిగంగ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవడంతో సమీపంలో నిర్మాణంలో ఉన్న మరో ప్రాజెక్టు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో పనిచేస్తున్న పాతిక మంది కార్మికులు గల్లంతయినట్లు ప్రభుత్వం తెలిపింది.
విపత్తుపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తల బృందం:
గల్లంతయిన వారికోసం ప్రత్యేక జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అకస్మాత్తుగా సంభవించిన వరదలకు గల కారణాలను అన్వేషించేందుకు డీఆర్ డీవో శాస్త్రవేత్తల బృందం పరిశోధన ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి రావత్ తెలిపారు. అధ్యయనంలో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తల సాయం తీసుకోనున్నారు.