(భారత సామాజిక వ్యవస్థలో కులం)
ఒక రాజకీయ ఆర్థిక విశ్లేషణ
“ఎంతో మంది అతణ్ణి గాంధీ అని పిలిచేవారు. లేదా జ్ఞానులైన పెద్ద మనుషులను పిలిచే ఏదైనా పేరు పెట్టి పిలిచేవారు. నవీన్ రాజకీయాలకు గాంధీతో ఏ సంబంధమూ లేదని తెలిసే ఇలా పిలిచేవారు. గాంధీ తరహా వ్యక్తిత్వం, జీవనశైలి, వైఖరి ఉందనే అర్ధంలో అలా పిలిచేవారు….” (పేజి 120, బచ్చు రమేశ్ బాబు)
“మావో సె టుంగ్ ను ఎవరో కమ్యూనిస్టు అంటే ఒక్క మాటలో నిర్వచించండి అని అడిగినప్పుడు ఆయన ‘ప్రజలకు సేవ చేయడం’ అని చెప్పాడట. నవీన్ ఈ నిర్వచనానికి నిదర్శనంగా జీవించి అమరుడయ్యాడు. పీడిత పోరాట ప్రజలకు ఎన్నో రూపాల్లో సేవ చేయడంలోనే కాదు, వాళ్ళ కోసం వర్గపోరాటంలో ప్రాణాలు అర్పించడం అనే అత్యున్నత త్యాగం వల్ల ఆయన గుర్తుండిపోయాడు. అంతకన్నా ఏ మనిషి అయినా మానవ సమాజానికి ఇవ్వగలిగింది ఏముంటుంది!”
(పేజి 136, వివి)
“మాలో అందరికన్నా” మార్పు” కోసం అంకితమైనవాడు. గొప్ప వాడైనప్పటికీ తన గొప్పతనం ప్రదర్శించని లక్షణాన్ని చివరగా చూసింది గాంధీజీలోనూ, ఇతనిలోనే. నవీన్ అమరత్వాన్ని గురించిన వార్త మాకు చేరినప్పుడు మా స్నేహితులు పత్రికల్లో సందేశాలు రాసినప్పుడు వాటితో పాటు అతికించడానికి ఫొటోల కోసం చాలా వెతికారు. నవీన్ కు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. వారి జ్ఞాపకాలలో అతడెప్పుడూ జీవిస్తూనే ఉన్నాడు. కానీ ఆరోజు మాత్రం ఉపయోగించడానికి వీలయ్యే ఒక్క ఫొటో కూడా దొరకలేదు. తప్పనిసరిగా ఫొటో దొరకగలిగే స్థానం నుండి అంటే జె.ఎన్.యు.లో అతడి ప్రవేశ పత్రం నుండి ఆయన ఫొటోను తీసారు. నవీన్ జీవితపు సారం ఇది..” (పేజి 149, భూపేంద్ర యాదవ్)
Also read: ప్రజల కోసం పాత్రికేయం
“నవీన్ ఆచరణ, దళితులతో సహా అందరితో మమేకమైన తీరు వల్లనే దళితులతడ్ని ‘తమ వాడను’కున్నారు. మేమేమో దళిత నేపథ్యం నుండి వచ్చిన మార్క్సిస్టు మేధావి అని గర్వించే వాళ్ళం. విప్లవ పార్టీలో, సంఘాల్లో ఈ రూపంలో కులాల ఎరుక ఉందనడానికి కూడా ఇదొక ఉదాహరణ.” (పేజి 153, ఎన్.రవి)
“ప్రస్తుత సమాజంలో తనకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల కోసం తన సర్వస్వం ధారపోసే నవీన్ వంటి సరళమైన, మంచి వ్యక్తి ఉన్నాడని విశ్వసించడం కూడా కష్టం.” (పేజి 156, బాలా)
Also read: ఎగిరే ధిక్కార పతాక – కలేకూరి ప్రసాద్!
……………………………
గుంటూరు జిల్లా రేపల్లె మండలం గుడ్డికాయలంక గ్రామంలో పుట్టిన యలవర్తి నవీన్ బాబు కుటుంబం అతని చిన్నప్పుడే ప.గో.జిల్లా విజయిరాయికి వలస వెళ్ళారు. ఢిల్లీ లోని జె.ఎన్.యు. అతడ్ని విద్యార్థి గా, ఒక సామాజిక వేత్తగా మలిచింది!
దేశవ్యాప్తంగా అనేక ప్రజాతంత్ర విద్యార్థి ప్రగతిశీల ఉద్యమాల్లో తలలో నాలుకగా మారి పనిచేసాడు. మితవాద వామపక్ష రాజకీయ పార్టీలు మొదలుకొని అతివాద రాడికల్ సంఘాల వరకూ అన్నిట్లోనూ తనదైన ముద్రవేసాడు!
స్టూడెంట్ ఫోరమ్ (విద్యార్థి వేదిక) స్థాపకుడైన నవీన్, ‘ప్రగతిసాహితి’, ‘కలం’, ‘డెమోక్రటిక్ వాయిస్’ వంటి పత్రికలు నడిపాడు. వెబేరియన్ నుండి మార్క్సిస్ట్ మేధావిగా ఎదిగాడు. డి.ఎస్.వో, డి.ఆర్.ఎస్.ఓ. , పి.యు.డి.ఆర్. వంటి సంఘాల్లో ముఖ్యపాత్ర వహించాడు!
Also read: వీరోచిత ఉపదేశం – నేనూ, నా దేశం!
1996లో ఢిల్లీలో ‘అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక’ ఆద్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది మేధావుల సమక్షంలో జరిగిన జాతీయత సమస్య పై అంతర్జాతీయ సెమినార్కి నవీన్ చేసిన కృషి అద్వితీయమైనదంటారు!
అజ్ఞాత వీరుడిగా నవీన్ 2000 సంవత్సరంలో తూ.గో.జిల్లా దారకొండ గ్రామంలో జరిగిన ఒక ఎన్ కౌంటర్ లో చనిపోవడం జరిగింది. రమేశ్ బాబు మాటల్లో, “..అతని జీవితపు విలువ యుద్ధానికి ఇరువైపులా ఉన్న ఆయుధాల కంటే విలువైనది.” (పేజి 119)
ఎమ్.ఏ అనంతరం రిసెర్చ్ ఫెలోషిప్ స్కాలర్‌షిప్ కోసం యుజిసిలో అర్హత సాధించిన నవీన్ ప్రొ యోగేంద్ర యాదవ్ పర్యవేక్షణలో కులం మీద పరిశోధనకు పూనుకుని 1989 లో పూర్తి చేసాడు. ఇంగ్లీష్ లో ప్రచురించిన చాలా కాలానికి రెండేళ్ళ క్రితం ఇలా తెలుగులో వచ్చింది!
“సగటు భారతీయుల దైనందిన జీవితంలో ఏ సంభాషణలో కానీ, చర్చలో కానీ రెండో వాక్యం వద్దకు చేరగానే ” మీదే కులం” అనే ప్రశ్న తప్పనిసరిగా ఎదుర్కొంటామనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.. ” (పేజి 104)అన్న రమేశ్, నడరాజా “కుల వ్యవస్థ ను రద్దు చేయటం భారత ప్రజాస్వామిక విప్లవపు ఒక మౌలిక లక్ష్యం కావాలి” (పేజి 108) అంటారు!
Also read: మద్యమా? మానవ మనుగడా?
జి.ఎన్.సాయిబాబా తో సహా ప్రజాస్వామిక వాదుల పై జరుగుతున్న హింసను గురించి కూడా తన వ్యాసం లో తడిమిన వి.వి. ప్రస్తుతం అదే రాజ్య హింసతో పోరాడు తున్నారు. కులనిర్మూలన కోసం పనిచేసే ప్రతి కార్యకర్త చదవాల్సిన పుస్తకం ఇది. ఎందుకంటే,
“మాలో చాలా మందిమి పెట్టుబడిదారీ వినిమయ సంస్కృతికి లొంగిపోకుండా ఉండడానికి చాలా అవస్థ పడుతుంటే, జె.ఎన్.యు.లో మేమెంచుకున్న విలువలకనుగుణంగా జీవించలేకపోతుంటే నవీన్ మాత్రం చాలా సహజంగా సునాయాసంగా నిరాడంబరమైన జీవనశైలిని అలవరుచుకుని అనవసర ఖర్చులను వదిలేసేవాడు. తాను ఎంచుకున్న మార్గం పట్ల అతడికి ఎటువంటి అనుమానాలు, గందరగోళాలు లేవు. అతడి సోదరి మాటల్లో చెప్పాలంటే, “ఇటువంటి మనుషులు మళ్ళీ పుట్టరు.”
“నవీన్ వంటి వారు మనుషులలో ఉన్న మంచి తనానికి కొలబద్ద లాంటి వారు. మనిషి లో ఉన్న అపరిమితమైన శక్తి సామర్థ్యాలను మనకు గుర్తు చేస్తారు. అతడి జీవితాన్ని కృషి నీ పంచుకోక పోవడంమంటే, అది అతడికి చేసే లోపం కాదు, మిగిలిన ప్రపంచానికి చేసే లోపం. మా జీవితకాలంలో మేమంత గొప్ప వ్యక్తిని చూడగలగడం మా అదృష్టం.” (పేజి 124)
(ఈ పుస్తకానికి ఈ పరిచయం సరిపోవచ్చు కానీ 20 ఏళ్ళ క్రితం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాన్ని ధారపోసిన ఒక యువ మేధావి, సామాజిక కార్యకర్త త్యాగాన్ని స్మరించు కోవడానికి ఎన్ని అసంఖ్యాక అక్షర నీరాజనాలు కావాలో..!)
Also read: ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి, చింతన
– గౌరవ్