- ముగురమ్మల మూలపుటమ్మ ఆరాధన
- తొమ్మిది రోజులూ తొమ్మిది రూపాలు
- ఆధ్యాత్మక వైభవానికి సముచితమైన సమయం
- వెన్నెల రాత్రులు, ఆరోగ్యప్రదమైన అందమైన సందర్భం
భారతీయులు వైదిక ధర్మంలో పరమ పవిత్రంగా భావించే కాలంలో ‘శరత్ కాలం’ విశిష్టమైనది. ఈ ఋతువులో ప్రారంభమయ్యే నవరాత్రులు శక్తి స్వరూపమైన దుర్గాదేవి ఉపాసనకు గొప్ప కాలంగా భావించడం మన ఆచారం. ఈ శరన్నవరాత్రులు / దేవీనవరాత్రులు తర్వాత వచ్చే దశమిని ‘ విజయదశమి’గా వేడుక చేసుకుంటాం. శ్రీరామచంద్రుడు, పాండవులు మొదలైన పురాణ పురుషులు, చక్రవర్తుల కాలం నుంచి గొప్ప ఆధ్యాత్మిక వైభవానికి ఆలవాలమైన ఈ సమయం నేటి నుంచి ఆసన్నమైంది. ఆ వీచికలు ఆరంభమయ్యాయి. వాతావరణం పరంగా, సౌరప్రభావం పరంగా చాలా ఆరోగ్యవంతమైన కాలం. ధ్యానం, ఉపాసన, ఆహార, నిద్రా నియమాల వల్ల గొప్ప మానసిక, శారీరక ఆరోగ్యం సంప్రాప్తమవుతాయి. మంచి ఆలోచనలు వస్తాయి. మెదడు చురుకుగా పనిచేసే రసాయన చర్యలు జరుగుతాయి. శాస్త్రీయమైన ఆలోచనా విధానంతోనే ఆచారాలు రూపుదిద్దుకున్నాయని పెద్దల మాట.
Also read: రక్తసిక్తమైన రైతు ఉద్యమం
ఒక్కోరోజు ఒక్కోరూపం
దేశంలోని ఒక్కొక్క ప్రాంతంలో చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నా, ప్రధానమైన ఆరాధనా స్వరూపం ఒకటే. ఈ శరన్నవ రాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజించడం విశేషం. ముగ్గురమ్మల మూలపుటమ్మను ఆరాధించడంలో ఎంచుకున్న మార్గంలో పార్వతి,లక్ష్మి, సరస్వతులను ( మహాకాళి, మహాలక్ష్మి,మహాసరస్వతి) మూడు రోజుల చొప్పున ఉపాసిస్తారు. నవ దుర్గల అలంకారంలో ‘పరాశక్తి’ దర్శనమే పరమపద సోపానంగా విశ్వసిస్తారు. శైలపుత్రి, బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణ,లలితాదేవి, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని రూపాలలో అలంకరించడం ఆనవాయితీ. పదోరోజు రాజరాజేశ్వరి స్వరూపాన్ని ఆరాధిస్తారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు ప్రధానమైన శక్తి స్వరూపాలు. ‘ఇచ్ఛ’ అంటే? = గొప్ప కోరిక, ఆలోచన,సంకల్పం కలగడం కూడా శక్తిలో భాగమే. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోడానికి తగిన జ్ఞానం పొందడం రెండవ అడుగు. జ్ఞానశక్తిని పొందిన తర్వాత ఆచరణలో పెట్టి, సాధించడం క్రియాశక్తి. మంచి ఆశయం స్ఫురించడం, సాధించడానికి సరిపడా జ్ఞానాన్ని పొందడం, దానిని క్రియాత్మకంగా మలచుకోవడం, చివర్లో అనుకున్నది సాధించడం.. ఇదీ వరస. ఈ ప్రక్రియలు సజావుగా సాగాలంటే నిలకడ కుదరాలి, ఏకాగ్రత ఉండాలి, సాధన జరగాలి. శరీరం, మనసు సహకరించాలి. ఈ తొమ్మిదిరోజుల పాటు జరిగే సాధన వల్ల మనసు, మెదడు, శరీరం తదనుగుణంగా అధీనంలోకి వస్తాయని మన పూర్వులు ఈ ఆచారాన్ని రచించారు.
Also read: వక్రబుద్ధి చైనా
ఇన్నర్ ఇంజనీరింగ్
ఇదొక మానసిక, శారీరక ప్రయాణం. ఆధునికంగా చెప్పాలంటే ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ను తెలుసుకోవడం, విజయం వైపు ప్రయాణం చెయ్యడన్నమాట! శరన్నవ రాత్రుల ( శరత్+ నవ రాత్రులు) ప్రారంభమంటే కొత్త రాత్రులు వచ్చినట్లు, నవనవోన్మేషమైన తొమ్మిది రాత్రులు మొదలైనట్లు, వెన్నెల రాత్రులు ప్రవేశించినట్లు.ఈ సందర్భంగా, నన్నయ్యగారి ” శారదరాత్రు లుజ్వల లసత్తర తారక హార పంక్తులం… ” అనే పద్యాన్ని గుర్తు తెచ్చుకొని తీరాలి. ఇవి శారద రాత్రులు, ఉజ్వలంగా ప్రకాశించే తారహారాలతో సౌందర్య శోభితంగా వెన్నెల వెలుగులు విరజిమ్మే రాత్రులు. ప్రకృతిని కాపాడుకుంటే, కాలుష్యాన్ని దరిచేరకుండా చూసుకుంటే, మానవ ప్రకృతికి తగ్గట్టుగా నడుచుకుంటే? నన్నయ్యగారు ఈ పద్యంలో చెప్పినట్లు శరత్ కాలంలో మేఘాలు తొలగిపోయి, ఆకాశం నిర్మలంగా మారుతుంది. నక్షత్రాలు, చంద్రుడు ప్రకాశమానంగా కనిపిస్తారు. నదుల వరదల ఒత్తిడి తగ్గి, ప్రసన్నమైన వాతావరణం అలముకుంటుంది. కలువపూలు వికసిస్తాయి, ఆ వికాసం మనకు కనిపిస్తుంది. తెల్లని వెన్నెల రాత్రులతో నిండిన కాలాన్ని అనందంగా అనుభవిస్తాం. ప్రకృతిని ఆరాధించడం మన సనాతన సంప్రదాయం.ఆధ్యాత్మిక చింతన పెంచుకోడానికి ఇది గొప్పకాలం. అదే ఆరోగ్యసోపానం, ఆనందపర్యవసానం.
Also read: ‘మా’ ఎన్నికలలో బాహాబాహీ