- మానవ తప్పిదాల వల్లే ఉపద్రవాలు
- 2004 సునామీ నుండి నిన్నటి హైదరాబాద్ వరదలే నిదర్శనం
క్రిస్మస్ జరుపుకున్నామన్న ఆనందం ఒక రోజులోనే ఆవిరి అయింది. 2004 డిసెంబర్ 26 సునామీ భారత దేశాన్ని అతలాకుతలం చేసింది…!మానవ పరిజ్ఞానం ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రకృతి కన్నెర్ర చేస్తే మాత్రం చేతులెత్తేసి బిక్క ముఖం వేస్తున్నారు. అసలు సునామీ అంటే ఏమిటో ఈ తరానికి తెలియ జేసి జాగ్రత్తలు తీసుకునేలా చేసిన 2004 డిసెంబర్ 26 సంఘటన దేశ దుర్ఘటనలో అతి పెద్ద ప్రకృతి వినాశనం! పర్యావరణం పరిరక్షించే బాధ్యత లేకుంటే ప్రజలు ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందో నిన్నటి హైదరాబాద్ వరదల నుండి మొన్నటి జపాన్ సునామీ వరకు మనకు ప్రకృతి ఎన్నో పాఠాలు నేర్పింది! మానవ తప్పిదాలు చేయడం వల్ల ఎన్ని ఘన కార్యాలు సాధించినా, సరికొత్త టెక్నాలజీ కనుగొన్నా కూడా ప్రాణ నష్టాన్ని ఆపలేక పోవడం ప్రకృతితో చెలగాటం ఆడడమే! నేపాల్ భూకంపం లో , ఉత్తరాఖండ్ లో వచ్చిన ఆకస్మిక వరదలలో కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు.
జపాన్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నా, సునామీ లో కూడా వేల మంది ప్రాణాలు కోల్పోయారు! దురదృష్టం ఏమిటంటే , విపత్తులు వచ్చి వేలమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు కొంతకాలం పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడటం, తరువాత అవన్నీ మర్చిపోవటం ఎక్కువగా జరుగుతోంది! హిందూ మహాసముద్రం లో భూకంపం తరువాత వచ్చిన సునామీ తమిళనాడు రాష్ట్ర తీరాన్ని నాశనం చేసిన రోజుల్లో, సునామీ వల్ల పడవలు, వలలు ధ్వంసం అయ్యాయి! చాలా మంది తీరప్రాంత ప్రజలు మత్స్యకారులు మరియు చేపల పెంపకందారులుగా జీవనోపాధి కోల్పోయారు. కొన్ని వేల మంది ఉవ్వెత్తున వచ్చిన సునామీ అలలకు సముద్ర గర్భంలో ప్రాణాలు వదిలారు! ఇది ఒక గుణపాఠం! హిందూ మహా సముద్రములో 2004 డిసెంబరు 26 న వచ్చిన సునామి ఈ ప్రాంతం ఊహించినంత హీనమైనదేమి కాదు. సదరన్ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలోని సునామి పరిశోధన సంస్థలో పని చేసే ప్రొఫెసర్ కస్తాస్ సైనోల్కిస్, తన పరిశోధన పత్రము “భూ భౌతిక అంతర్జాతీయ పత్రము”లో, హిందూ మహా సముద్రములో ఇంత కన్నా ఘోర విపత్తులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు.
ఇదీ చదవండి:నివర్ తుపాను బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్
భవిష్యత్తులో వచ్చే సునామీలు మడగాస్కర్, సింగపూర్ , సోమాలియా, పశ్చిమ ఆస్ట్రేలియాని , ఇతర ప్రాంతాలను ముంచెత్తుతాయి అని అంటున్నాడు. 2004 బాక్సింగ్ డే సునామి దాదాపు 3 లక్షల మంది ప్రజలను పొట్టన పెట్టుకుంది. అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు వివిధ దేశాల్లో కొన్ని మిల్లియన్ ప్రజలు, ప్రత్యక్షంగా కాని లేదా పరోక్షంగా కాని సునామి వల్ల చనిపోయారు! నిన్న హైదరాబాద్ వరదలు గానీ భవిష్యత్ లో వచ్చే తుపాన్లు గానీ ముందస్తుగా తెలిపే టెక్నాలజీ ఉందేమో గానీ ఎంత మేర ప్రభావితం చేస్తాయో మానవులకు అంతుపట్టకుండా ఉంది! దక్కన్ పీఠభూమి గా పేరు గాంచిన హైదరాబాద్ లో పడవలు వేసుకునే తిరిగే పరిస్థితి ఏమిటి?
దివి సీమ తుపాను తరువాత తీరప్రాంతంలో దట్టంగా చెట్లు నాటి సముద్ర అలలు ఊర్లమీద పడకుండా చూస్తున్నారు. తప్ప ముప్ఫై మీటర్ల ఎత్తున అలలు ఉవ్వెత్తున లేస్తే ఏ చెట్లు ఆపగలవు? ఇంట్లోనే జల సమాధి అయ్యే పరిస్థితి చేతులారా మనమే కొని తెచ్చుకుంటున్నాం! నాలాలపై అక్రమ కట్టడాలు, పంట కాల్వల్లో ఊరి మురికి నీరు పంపడం ద్వారా చెత్తను చేరదీసి చేతులు దులుపుకోవడం వల్ల ప్రకృతి కన్నెర్ర ప్రాణాలు నీటి పాలవుతున్నాయి. నాలాల్లో వ్యర్థ పదార్థాలు అన్ని చేరి పూడిక కూరుకుపోయి మురికి నీరు అంతా ఇళ్లల్లో చేరడం వల్ల లేని పోని అంటురోగాలు వస్తున్నాయి! పక్కన కాలీ స్థలం ఉంటే చాలు మన ఇంటి చెత్త చేరడం వల్ల అవి తినడానికి ఎలుకలు, పందికొక్కులు చేరతాయి. వాటిని తినడానికి పాములు ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇలా వ్యర్థ పదార్థాలు మోరీల్లో చేరి నీళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల ఎన్ని డ్రైనేజీలు నిర్మించినా ఏమి ఫలితం. మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపు కేవలం పది శాతం మాత్రమే అమలుకు నోచుకుంది! భారత దేశ పౌరులకు కనీస అవసరాలపై ఉన్న ఆత్రుత పర్యావరణ పరిరక్షణ పై లేక పోవడం దురదృష్టకరం!
ఇదీ చదవండి: సునామీలపై అవగాహన అవసరం