డా యం. అఖిల మిత్ర, ప్రకృతి వైద్యులు
ప్రకృతి వైద్యం అనేది మానవుడు సామరస్యంగా, ప్రకృతి యొక్క నిర్మాణాత్మక సూత్రాలతో, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దశలలో అతని జీవితంలో రూపొందించుకునే ఒక విధానం. ఇది ఆరోగ్యాన్ని పెంపొందించే, వ్యాధులను నివారించే, చికిత్స చేసి స్వస్థత కలిగించే, అలాగే శక్తి, ఆరోగ్యాన్ని తిరిగి యధాస్థితికి తీసుకురాగలిగే గొప్ప అవకాశాలను కలిగి ఉంది. బ్రిటిష్ నేచురోపతి అసోసియేషన్ ప్రణాళికా ప్రకటన ప్రకారం “ప్రకృతి వైద్యం (నేచురోపతి) అనేది శరీరంలో అంతర్లీనంగా ఉండే, స్వస్ధతను కలిగించే ఒక శక్తి యొక్క ఉనికిని గుర్తించి చేసే చికిత్సా విధానం”. అందుచేత, ఇది వ్యాధిని కలిగించే కారణాలు అంటే ఉపయోగించే పదార్థాలు విషపూరితమైన పదార్ధాలను తొలగించడానికి, అవసరం లేని విషపూరితమైన పదార్ధాలను మానవ శరీరం నుండి విసర్జించి వేసి వ్యాధులను నయం చేయడానికి మానవ వ్యవస్ధకు సహకరించాలని సూచిస్తుంది.
అన్ని వ్యాధులకూ కారణం ఒక్కటే
అన్ని వ్యాధులు, వాటి కారణాలు చికిత్సలు ఒకటే. బలమైన దెబ్బలు, గాయాలకు, పర్యావరణ పరిస్థితులకు తప్ప, అన్ని వ్యాధులకు కారణం ఒకటే. అది శరీరంలో అనారోగ్యకరమైన పదార్ధాలు పేరుకుపోయి ఉండడమే. వ్యాధులన్నింటికి చేసే చికిత్స శరీరంలో నుంచి పేరుకుపోయిన పదార్ధాలను తొలగించి వేయడం. వ్యాధులు రావడానికి ముఖ్య కారణం శరీరంలో పేరుకుపోయిన అనారోగ్యకరమైన పదార్థాలే. బ్యాక్టీరియా (మేలు చేసే లేక కీడు చేసే సూక్ష్మజీవులు), వైరస్ (రోగాలు కలుగజేసే ఒక రకమైన విషం) వాటికి పెరగడానికి అనువైన అనారోగ్యకరమైన పదార్థాలు పేరుకుపోయిన వాతావరణం శరీరంలో ఏర్పడిన తరువాత అవి శరీరంలో ప్రవేశించి అక్కడే జీవిస్తూ ఉంటాయి. అందుచేత వ్యాధులకు మూల కారణం శరీరంలో అనారోగ్యకరమైన పదార్థాలు పేరుకుపోవడం, రెండవ కారణం బ్యాక్టీరియా. తీవ్ర వ్యాధులు శరీరం యొక్క స్వయంకృషితో నయం చేసుకునేటటువంటివి. అందుచేత ఇవి మన స్నేహితులే తప్ప శత్రువులు కావు. దీర్ఘకాల వ్యాధులు తప్పుడు చికిత్స, తీవ్ర వ్యాధులను అణగదొక్కి ఉంచడం ఫలితాలు. ప్రకృతి మహోన్నతమైన బాధలను, కష్టాలను ఉపశమింపజేసే ఉపశమనకారి. వ్యాధులను నివారించుకోగలిగే శక్తిని, అనారోగ్యంగా ఉంటే తిరిగి ఆరోగ్యాన్ని చేకూర్చుకోగల శక్తినీ అదే మానవ శరీరం కలిగి వుంది. ప్రకృతి చికిత్స నయం చేయబడేది కేవలం వ్యాధి ఒకటే కాదు, వ్యాధికి గురైన రోగి యొక్క మొత్తం శరీరమంతా చికిత్సను పొంది, తిరిగి యధాస్థితికి పునరుధ్దరింపబడుతుంది. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉండే రోగులు కూడా ప్రకృతి వైద్యంలో తులనాత్మకంగా తక్కువ సమయంలో విజయవంతంగా నయం చేయబడతారు.
ఆహారమే ఔషధం
ప్రకృతి వైద్యంలో అణగారి ఉన్న వ్యాధులు కూడా బయటకు తేబడి శాశ్వతంగా తొలగించబడతాయి. ప్రకృతి వైద్యం శారీరక, మానసిక, సాంఘిక మరియు ఆధ్యాత్మికమైన అన్ని అంశాలనూ ఒకే సమయంలో చికిత్స చేస్తుంది. ప్రకృతి వైద్యం శరీరం మొత్తం అంతటికీ చికిత్స చేస్తుంది. ప్రకృతి వైద్యం ప్రకారం ‘ఆహారం మాత్రమే మందు’, బయట ఔషధాలేవీ వాడబడవు. ఎవరి ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం వారు ప్రార్థన చేయడం అనేది చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం. ప్రకృతి వైద్య చికిత్సాలయాలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్య వ్యవస్థను రూపొందించవచ్చు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను కల్పించి ప్రజలను ప్రకృతికి దగ్గర చేయాలి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు శారీరిక శ్రమ తక్కువై విపరీతంగా బరువు పెరిగారు. చాలా మందికి అతిపెద్ద సమస్య స్థూలకాయం, మధుమేహం, బిపి, కండరాలు, కీళ్ల సమస్యలు, మానసిక ఆందోళన. రోజంతా కూర్చుని, శరీరానికి ఎలాంటి పని ఇవ్వకపోవడంతో, తినే ఆహారంలో కొవ్వు పొత్తికడుపులో చేరడం ప్రారంభిస్తాయి. ఇది కాకుండా, చెడు ఆహారం జీవనశైలి అలవాట్లు అధిక జుట్టు రాలడానికి, చర్మం పెళుసుగా మారడానికి దారితీస్తుంది. వీటన్నింటికీ పరిష్కారం ఒక్కటే – అది వ్యాయామం. బరువు తగ్గాలనుకునే వారికే కాదు, ఆరోగ్యంగా ఉండి జీవితాన్ని ఆనందంగా పొడిగించాలనుకునే వారికి కూడా వ్యాయామం అవసరం. రోజుకు 30-40 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా, చర్మం కాంతివంతంగా మారుతుంది, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఏ వయస్సు వారు ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలాంటి ఆహార అలవాట్లు అలవరచుకోవాలి? వ్యాయామాలు ఎలా సహాయపడతాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రకృతి వైద్య చికిత్సాలయాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి, ప్రజలు ప్రకృతికి దగ్గరగా ఉండేట్లు చూడాలి. స్వయం నియంత్రణ, మంచి ఆరోగ్య అలవాట్లు, ఆహార అలవాట్లు అవలంబించు కొనే విధంగా ప్రజలను చైతన్య పరచాలి. జీవనశైలి వ్యాధిగ్రస్తులకు, చెడు అలవాట్లకు బానిసైన వ్యక్తులకు, బుద్ధిమాంద్యం పిల్లలకు ఆకుపెషనల్ తెరఫీ, రీహాబిలిటేషన్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. జంక్ ఫుడ్, ఆరోగ్యాన్ని పాడు చేసే శీతల పానీయాలు, మధ్య పానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, శుచి శుభ్రత మరియు నాణ్యతలేని తినుబండారాల పట్ల ప్రజలకు నిరంతరం చైతన్యపరచాలి.