హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగ , ఉపాధ్యాయ విభజన ప్రక్రియలో రాష్ట్రపతి ఉత్తర్వుల (PO 124) స్ఫూర్తి స్థానికత. 33 కొత్త జిల్లాలు ఏర్పాటైన క్రమంలో, పాత 5,6 జోన్లు కొత్త జోన్లుగా వ్యవస్థీకృతమైన క్రమంలో ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను స్థానిక జిల్లాలకి, స్థానిక జోన్ల కి కేటాయించే క్రమంలో సీనియార్టీ కంటే స్థానికతనే మొదటి ప్రాధాన్యత అంశంగా తీసుకోవాల్సి వస్తుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా జోన్లో కానీ జిల్లాలో కానీ , ఏదైనా ఒక్క పోస్ట్ కి ఎక్కువ మంది స్థానిక అభ్యర్థులు కనుక ఎంచుకున్నట్టైతే సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుందని సంఘం వివరించింది. అయినప్పటికీ 124 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం 95% స్థానికులకు ఉద్యోగ , ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాల్సిన అవసరం ఉందనీ, అవసరమైతే ఆ జిల్లాలోగాని జోన్ లల్లో గాని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని కాపాడాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. ఈ మొత్తం ప్రక్రియలో ఎటువంటి అక్రమాలు, అవినీతి చోటు చేసుకోకుండా ఉండడానికి పూర్తి పారదర్శకత కోసం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాట్మెంట్ కమిటీల్లో టీజీవో, టిఎన్జీవో సంఘ నాయకులను ఉంచడం వల్ల భారీ ఎత్తున అవినీతికి ఆస్కారం ఏర్పడింది కాబట్టి పూర్తి స్థాయి ప్రక్రియని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్స్ తో చేయాలని డిమాండ్ చేస్తున్నామని సంఘం వివరించింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిల గాని సంపత్ కుమార్ స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నిర్మల, రాష్ట్ర కోశాధికారి బాలస్వామి, తదితర నాయకులు పాల్గొన్నారు.