- నేడు దేశవ్యాప్తంగా 4 గంటలపాటు రైతుల ఆందోళన
- కట్టుదిట్టమైన భద్రత మధ్య రైల్ రోకో
- శాంతియుతంగా నిర్వహిస్తామిని హామీ
రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అన్నదాతలు ఈ రోజు (ఫిబ్రవరి 18) గురువారం దేశవ్యాప్తంగా రైల్ రోకో ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయిన రైల్ రోకో సాయంత్రం 4 గంటలవరకు నిర్వహిస్తామని కిసాన్ ఆందోళన్ కమిటీ అధికార ప్రతినిధి జగతార్ సింగ్ బాజ్వా తెలిపారు. అయితే శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నామని రైలు ప్రయాణికులకు తినుబండారాలను అందిస్తామని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో రైతులను యాక్టివ్ గా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైల్ రోకో ఆందోళన సందర్భంగా రైల్వే శాఖ అదనంగా 20 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలను నియమించింది.
రానున్న రోజుల్లో తమ ఆందోళనను పశ్చిమ బెంగాల్ కు కూడా విస్తరిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ తెలిపారు. బెంగాల్లో అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆయన చెప్పారు. రైతుల రైల్ రోకో కు మద్దతుగా బీహార్ లో జన్ అధికార్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పాట్నా రైల్వే జంక్షన్ వద్ద రైతులు పట్టాలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రైతులకు అండగా సరిహద్దు గ్రామస్థులు
ప్రయాణికులకు ఆహారం, నీరు:
రైల్ రోకో సందర్భంగా దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. నిరసనలో భాగంగా శాంతియుతంగా రైళ్లను నిలిపివేస్తామని రైతు సంఘాలు తెలిపాయి. నిలిచిపోయిన రైళ్లలోని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆహారం, నీరు అందిస్తామని తెలిపారు. సాగు చట్టాల అమలుతో రైతులకు కలిగే నష్టాన్ని ప్రయాణికులకు వివరిస్తామని రైతుసంఘాల నేతలు స్పష్టం చేశారు.
భారీగా రైల్వే బలగాల మోహరింపు :
రైల్ రోకో నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమయింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 20 వేలకు పైగా అదనపు రైల్వే భద్రతా బలగాలను మోహరించారు. రైల్ రోకో నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసాంది.
Also Read: వ్యవసాయచట్టాలు, ఒక ఫార్ములా సినిమా కథ