- ఫైనల్లో బరోడాపై 7 వికెట్ల గెలుపు
- 15 ఏళ్ల తర్వాత తమిళనాడుకు టైటిల్
జాతీయ టీ-20 క్రికెట్ ఛాంపియన్లకు ఇచ్చే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని తమిళనాడు జట్టు రెండోసారి గెలుచుకొంది. అహ్మదాబాద్ సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ముగిసిన ఏకపక్ష పైనల్లో తమిళనాడు 7 వికెట్లతో మాజీ ఛాంపియన్ బరోడాను చిత్తు చేసింది. ఈ టైటిల్ సమరంలో ముందుగా కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న బరోడాకు తమిళనాడు బౌలర్లు పగ్గాలు వేశారు.లెఫ్టామ్ స్పిన్నర్ మణిమరన్ సిద్ధార్థ్ 20 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి బరోడాను 120 పరుగుల స్కోరుకే పరిమితం చేయడంలో ప్రధానపాత్ర పోషించాడు.
ఓ దశలో 36 పరుగులకే ఆరు టాప్ ఆర్డర్ వికెట్లు నష్టపోయిన బరోడాను విష్ణు సొలంకి ఆదుకొన్నాడు. 49 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరకు బరోడా 20 ఓవర్లలో 120 పరుగుల స్కోరు సాధించగలిగింది. సమాధానంగా 121 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన తమిళనాడు మరో 12 బాల్స్ మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే నష్టపోయి విజయం సొంతం చేసుకోగలిగింది. తమిళనాడు ఆటగాళ్లలో ఓపెనర్ హరి నిశాంత్ 35 పరుగులు, బాబా అపరాజిత్ 29 నాటౌట్, కెప్టెన్ దినేశ్ కార్తీక్ 22 పరుగులు సాధించారు. స్పిన్నర్ సిద్ధార్ధ్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 2006-07 ప్రారంభ సీజన్లో తొలిసారిగా టైటిల్ నెగ్గిన తమిళనాడు మరో టైటిల్ కోసం 15 సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది.
ఇది చదవండి: 2020-21 రంజీ సీజన్ హుష్ కాకి
దినేశ్ కార్తీక్ డబుల్ ధమాకా:
స్టార్ ప్లేయర్లు అశ్విన్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, సందీప్ వారియర్ (నెట్ బౌలర్) జట్టుకు అందుబాటులో లేకపోడం,. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం , ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ వివాహం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయినా తమిళనాడు జట్టు దినేశ్ కార్తీక్ నాయకత్వంలో జూనియర్ ఆటగాళ్లతోనే టైటిల్ నెగ్గడం విశేషం.
ఇది చదవండి: కెప్టెన్ గా విరాట్ కొహ్లీ స్టయిలే అంత…!
గతేడాది కర్నాటకతో జరిగిన ఫైనల్‌లో అందినట్టే అంది చేజారిన టైటిల్‌ను ఈసారి తమిళనాడు సాధించగలిగింది. ఈ ఏడాది టోర్నీ మొత్తం ఓటమి లేని జట్టు ఏదైనా ఉంటే తమిళనాడు మాత్రమే. అంతేకాదు..తమిళనాడుకు రెండుసార్లు టీ-20 ట్రోఫీ అందించిన కెప్టెన్ ఘనతను సైతం దినేశ్ కార్తీక్ సొంతం చేసుకోగలిగాడు. విజేత తమిళనాడుజట్టు సభ్యులకు ట్రోఫీని బోర్డు కార్యదర్శి జే షా బహుకరించారు.