చదివింది మానవీయ శాస్త్రం. ఆసక్తి విజ్ఞాన శాస్త్రం పైన. ఆయనను ఉన్నత విద్యకోసం విదేశాలకు పంపాలనుకున్నారు కన్నవారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో స్వదేశంలోనే చదివించారు. బి.ఎ., ఎం.ఎ.,పట్టాలు పొందారు. అయినా సైన్స్ పట్ల మక్కువతో ఆ రంగంలో కృషి చేశారు. నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్తగా వినుతికెక్కారు. ఆయనే చంద్రశేఖర వెంకట్రామన్ (సీవీ రామన్). జీవితాంతం పరిశోధనలు, సైన్స్ బోధనలతో గడిపేరు.
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని తిరువన్ కావల్ లో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మాళ్ దంపతులకు 1888 నవంబర్ 7వ తేదీన జన్మించిన రామన్ చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేవారు. సైన్స్ అంటే మక్కువ. దానిని గ్రహించిన తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ కుమారుడిని విదేశాలకు పంపాలనుకున్నారు. (విశాఖపట్నం ఏవీఎన్ కళాశాలలో గణిత,భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా పనిచేశారు). ఆరోగ్య కారణాలతో వైద్యుల సలహ మేరకు మదరాసు రాజధాని (ప్రెసిడెన్సీ) కళాశాలలో చేర్పించగా, సర్వ ప్రథములుగా ఉత్తీర్ణుయలయ్యారు. రామన్ పలు పత్రికలకు వ్యాసాలు రాయడంతో పాటు తన 19 ఏట కలకత్తాలోని `ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్`లో సభ్యత్వం పొందారు. కలకత్తాలోని అకౌంటెంట్ కార్యాలయంలో మంచి జీతంపై ఉద్యోగంలో కుదిరినా ఆయన మనసంతా సైన్స్ మీదే ఉండేది. తల్లిదండ్రులకు సంగీతంలో ప్రవేశం ఉండడంతో ఆయనకు మొదట్లో ధ్వనిశాస్త్రం పట్ల ఇష్టం ఉండేది. సితార్, వయోలిన్ మున్నగు వాద్యాల ధ్వనులపై పరిశోధన చేశారు. ఆయనకు భౌతిక శాస్త్రంతో పాటు ఖగోళ, శరీర, వాతావరణ శాస్త్రాల పట్ల ఆసక్తి ఉండేది. సైన్స్ అంటే కేవలం విజ్ఞాన శాస్త్రమే కాదని, దేశ ఆర్థిక సమస్యలకు ఇది పరిష్కారం చూపగలదని విశ్వసించేవారు.
Also Read : సంక్షోభాలు – సైన్స్ సమాధానాలు
పరిశోధనకు బీజం
రామన్ యూరప్ నకు సముద్ర ప్రయాణం (1921) చేస్తుండగా , `సముద్రం నీలంగా ఎందుకుంది? మంచు తిప్పలు (గ్లేషియర్స్) పారదర్శకంగా ఎందుకున్నాయి?`అనే ప్రశ్నలు వేధించాయట. ‘కాంతి కిరణాలను నీటి అణువులు చెదరగొట్టడం వల్లనే అలా జరుగుతోంది` అని తెలుసుకుని తిరిగి కలకత్తా చేరగానే పరిశోధనను ముమ్మరం చేశారు. కారమ్ బోర్డు మీద కాయన్స్ ను స్ట్రైకర్ చెదరగొట్టినట్లే, అణువులు కాంతిని చెదరగొడతాయని, దీనిని బట్టి పదార్థంలోని అణు నిర్మాణాన్ని తెలుసుకోవచ్చని రుజువు చేశారు. వీటికి సంబంధించి కనిపెట్టిన కొన్ని రేఖలనే (లైన్స్) `రామన్ రేఖలు`గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రయోగాన్నే `రామన్ ప్రభావం`అంటారు.
నోబెల్ బహుమతి
రామన్ ఆవిష్కరించిన `రామన్ ఎఫెక్ట్` (రామన్ ఫలితం/ప్రభావం) విజ్ఞానశాస్త్ర చరిత్రలో మైలురాయిగా నిలిచి నోబెల్ బహుమతి గెలుచుకుంది. `రామన్ ఎఫెక్ట్` కారణంగానే రామన్ స్పెక్ట్రా, రామన్ స్పెక్ట్రోస్కోపి అని భౌతికశాస్త్రంలో ప్రత్యేక విభాగాలు ఏర్పాడ్డాయని నిపుణులు చెబుతారు. ఈ పురస్కారానికి కారణమైన పరిశోధనకు కేవలం రెండు వందల రూపాయలు (అప్పట్లో పెద్ద మొత్తం కావచ్చుకానీ ఇతరత్రా పోల్చితే చాలా తక్కువంటారు) ఖర్చు అయింది. పరిశోధనకు ఉత్సాహం, మేధస్సు తప్ప ఖరీదైన పరికరాలు కాదని రుజువు చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (1933)లో వ్యవస్థాపక డైరెక్టర్ గా సేవలు అందించారు. 1948లో రామన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించారు. ఆయన `ఆకాశవాణి`ద్వారా చేసిన ప్రసంగాలను న్యూయార్క్ లోని ఫిలాసిఫికల్ గ్రంథాలయం `ది న్యూ ఫిజిక్స్ టాక్స్ ఆన్ యాస్పెక్ట్స్ ఆఫ్ సైన్సెస్` అనే శీర్షికతో సంకలనం వెలువరించింది. రామన్ అన్న సీఎస్ అయ్యర్ కుమారుడు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ కూడా నోబెల్ బహుమతి అందుకోవడం (1983)విశేషం.
Also Read : బందీగా కంటే బలిదానమే మిన్న:ఆజాద్
గాంధీజీ ఆరాధకులు
గాంధీజీ అంటే రామన్ కు విపరీతమైన ఆరాధన భావం. ఆయనంటే ఎంత ఇష్టమంటే `ప్రతి పాఠ్య పుస్తకంలో గాంధీజీ ఆశయాలను వివరిస్తూ ఆయన బొమ్మను ప్రచురించాలి`అనే వారు. ఆయన కన్నుమూతకు రెండు దశాబ్దాల పాటు గాంధీజీ గౌరవార్థం స్మారకోపన్యాలు నిర్వహించారు. చిన్నపిల్లలకు విజ్ఞాన శాస్త్రం బోధించడాన్ని ఇష్టపడేవారు. అలా అనేక ప్రాంతాలలో సైన్స్ ప్రదర్శనలు ఇచ్చారు.
సైన్స్ డే
రామన్ గౌరవార్థం `సైన్స్ డే` నిర్వహించాలన్న జాతీయ శాస్త్ర సాంకేతిక మండలి సమాచార మండలి (ఎన్.సి.ఎస్.టి.సి) సూచన మేరకు భారత ప్రభుత్వం ఆయన వర్థంతి రోజు ఫిబ్రవరి 28వ తేదీని సైన్స్ దినోత్సవంగా ప్రకటించింది. ఆయన శతజయంతిని పురస్కరించుకొని 1987లో తొలి సైన్స్ దినోత్సవం జరుపుకుని, నాటి నుంచి ఏటా ఒక ఇతివృత్తం (థీమ్)తో దీనిని నిర్వహించుకుంటున్నారు.సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుతూ వివిధ కార్యక్రమాలు రూపొందించడం దీని లక్ష్యం.
Also Read : అవసరార్థుల ‘దేవర’ అయ్యదేవర
పురస్కారాలు
రామన్ కృషికి మెచ్చిన బ్రిటిష్ రాణి `సర్`బిరుదుతో (1929), భారత ప్రభుత్వం `భారతరత్న` (1954)తో సత్కరించింది. పదిహేనుకుపైగా ప్రపంచ దేశాలు గౌరవ డాక్టరేట్ లు ప్రదానం చేశాయి. పరిశోధనలతో దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సర్ సీవీ రామన్ 82వ ఏట కనుమూశారు.
(ఫిబ్రవరి 28వ తేదీ సీవీ రామన్ జయంతి/సైన్స్ డే)
Also Read : విద్యాపిపాసి `కట్టమంచి`