Sunday, November 24, 2024

కాంగ్రెస్ బతికి బట్టకడుతుందా?

“ఇపుడు, ఈనాడు, చింతించి చింతించి, వగచిన ఏమి ఫలము” అని ఒక కవిగారు ఏనాడో అన్నారు. సరియైన సమయాల్లో చింతించకుండా, చింతించే పరిస్థితులు తెచ్చుకుని , ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ “చింతన్ భైఠక్ “కు సిద్ధమవుతోంది. మంచిదే. ఎట్టకేలకు రాహుల్ గాంధీ మెత్తపడ్డారు, పార్టీ పగ్గాలను పట్టుకోడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు. సోనియాగాంధీ అసంతృప్త నేతలతో సమావేశం అయ్యారు. లేఖాస్త్రం సంధించి, సంచలనం రేపిన నాయకులు ఇందులో ఉన్నారు. చాలాకాలం తర్వాత సుదీర్ఘంగా 5గంటలపాటు మాట్లాడుకున్నారు. బడా నేతలంతా ఒక్కచోట చేరి, అమీతుమీ తేల్చుకోడానికే సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

సోనియా కుటుంబం ఆలోచన ఏమిటి?

గాంధీ కుటుంబీకులు పునరాలోచనలో పడ్డారా, దీర్ఘాలోచనలో ఉన్నారా, అసలు ఆట ఇప్పుడే  మొదలుపెట్టారా? కొన్ని నెలల్లోనే తేలిపోతుంది. సీనియర్ నేతలు మొదలు రాహుల్ గాంధీ వరకూ పార్టీ పట్ల ఏమేరకు శ్రద్ధగా ఉన్నారో అర్థంకాని పరిస్థితులోనే ఇప్పటికీ కాంగ్రెస్ కేడర్ ఉంది. చిదంబరం, కమల్ నాథ్ వంటి సీనియర్ నేతలకు, రాహుల్ గాంధీకి మధ్య విభేదాలు ఉన్నాయని, అగాధం ఏర్పడిందనీ నిన్నటి సమావేశం మరోసారి ఋజువు చేసింది. సోనియాగాంధీ కొంత మెతకధోరణి అవలంబిస్తున్నా, రాహుల్ గట్టిగానే మాట్లాడుతున్నారు.

చిదంబరం, కమల్ నాథ్ లపై రాహుల్ చిర్రుబుర్రు

మధ్యప్రదేశ్ లో, బిజెపి భావజాలానికి  దగ్గరగా ఉండేవారే ఎక్కువమంది అధికారగణంలో ఉండడంపై కమల్ నాథ్ పై రాహుల్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులో, డిఎంకె కు కాంగ్రెస్ పార్టీను  అనుబంధపార్టీగా మార్చివేశారనే అనుమానాన్ని, ఆగ్రహాన్ని చిదంబరంపై బాహాటంగానే చూపించారు. ఇవ్వన్నీ కాంగ్రెస్ పార్టీ తీరు తెన్నులను మరోసారి  బయటపడేశాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనే,  పార్టీ భవిష్య నిర్మాణం ఉంటుందని అంచనా వెయ్యవచ్చు. పైకి సోనియాగాంధీ  మాట్లాడకపోయినా, ఇవే అనుమానాలు ఆమెకూ లేకపోలేదు. కొడుకు ప్రధానమంత్రి కావాలన్నదే ఆమె ఏకైక ఎజెండా. మన్ మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోపెట్టినప్పటి నుండీ అదే వ్యూహం వుంది. ఇప్పటికీ  అదే సంకల్పంలో ఉన్నారు.

ఆచితూచి మాటలు

ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం వల్ల సీనియర్లు, అసంతృప్త నేతలపట్ల సోనియాగాంధీ  ఆచితూచి మాట్లాడుతూ, అసహనాన్ని, అనుమానాన్ని  ఏ మాత్రం బయటకు వ్యక్తం కాకుండా జాగ్రత్త పడుతున్నారని అర్ధమవుతోంది. ఆమె ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది, ఆమెకు  మనసులో అనేక భయాలున్నాయి. వాటన్నిటిని కప్పిపుచ్చుకుంటూ, కొత్తవ్యూహ రచనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగమే శనివారంనాడు జరిగిన సుదీర్ఘ సమావేశం. సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు  దాదాపు 20మంది సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీని బూత్ స్థాయి నుండి ప్రక్షాళనం చేసి, జవజీవాలు పొయ్యాలన్నదే అందరి అభిప్రాయంగా వ్యక్తమైంది.

తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు

త్వరలో బెంగాల్ లో, తమిళనాడులో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలోనూ రాజకీయ చిత్రపటాలు ఊహతీతంగా మారిపోతున్నాయి. మొన్న బీహార్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చావుదెబ్బతింది. అత్యుత్సాహంతో ఎక్కువ  సీట్లకు పోటీ చెయ్యడమే మొదటి తప్పు. భస్మాసుర”హస్తం”లా, ఈ ప్రభావం ఆర్ జెడిపై కూడా పడి, రాజయోగం పోగొట్టుకుంది. ఇటువంటి ఆచరణీయంకాలేని సలహాలను పార్టీలో ఎవరిస్తున్నారో? సమీక్ష చేసుకోవడం మంచిది. ట్రబుల్ షూటర్, వ్యూహకర్త, గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడైన అహ్మద్ పటేల్ ఇటీవలే కన్నుమూశారు. ఈ తరుణంలో, గాంధీ కుటుంబానికి ఇది పూడ్చలేని లోటు.మహానేత,  ట్రబుల్ షూటర్, మాస్టర్ ఇన్ కమ్యూనికేషన్ గా పేరు తెచ్చుకున్న దివంగత ప్రణబ్ ముఖర్జీకూడా తన పుస్తకంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ఘాటు వ్యాఖ్యలే చేశారు.

ఆ పుస్తకావిష్కరణ సంచలనం సృష్టిస్తుందా?

ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగి బయటకు వస్తే, ఇంకా చాలా విషయాలు వెల్లడి అవుతాయి. కపిల్ సిబల్ కూడా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల వేడిలో, పార్టీ చికిత్సకు సోనియా సిద్ధమయ్యారు. 2022-23 లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది, మధ్య భారతంలో కొంత ఉనికిని కాపాడుకుంటున్నా, దక్షిణాదిలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూసాలు కదిలిపొయ్యాయి. మరమ్మత్తు జరిగే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. బీహార్ లో పోగొట్టుకున్న పరువును తమిళనాడులో, బెంగాల్ లో నిలబెట్టుకొని, జాతీయ స్థాయిలో క్యాడర్ కు నూతన ఉత్సాహాన్ని ఇవ్వాలనే ఆశలో సోనియాగాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వాతావరణం గమనిస్తే, సీనియర్ల సహకారం అంతంతమాత్రంగానే ఉంది. శశిథరూర్ వంటివారు కొంత ఆశాదీపంగా  ఉన్నా, ఆయన ప్రభావం కేరళ రాష్ట్రానికి మించి సాగుతుందా అన్నది అనుమానమే. కాకపోతే, పార్టీ వాణిని వినిపించడానికి ఉపయోగ పడుతుంది.

తమిళనాడులో డీఎంకే తో దోస్తీ

తమిళనాడులో డి ఎం కె తో కాంగ్రెస్ సహజీవనం చేస్తోంది. ఇక్కడ స్టాలిన్ ఒక్కడే కాస్త బలమైన నాయకుడు. రజనీకాంత్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిపోయారు. కమల్ హసన్, అసదుద్దీన్ ఒవైసీ కలిసి సాగుతామంటున్నారు. వీరు హస్తానికి స్నేహహస్తం అందిస్తారా, లేదా  అన్నది చూడాలి.  ఏఐఏడిఎంకె పళనిస్వామి, జైల్లో నుండి బయటకు రావాల్సిన శశికళ కూడా రేసులో ఉన్నారు. వీరు పూర్తిగా స్టాలిన్ కు  వ్యతిరేక వర్గం. కాంగ్రెస్ తో కలిసే అవకాశం చాలావరకూ మృగ్యమనే చెప్పాలి. మొత్తంమీద, రేపు ఏప్రిల్, మేలో జరుగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు దక్కడం కష్టమే.

బెంగాల్ లోనూ చివరి బెంచీలోనే

బెంగాల్ లోనూ దాదాపుగా అదే తీరు కనిపిస్తోంది. అక్కడ అధికారాన్ని ఛేజిక్కించుకోవాలని బిజెపి శత విధాలా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కీలకనేతలను తనవైపు తిప్పుకుంది. అనేకమంది వలసల బాటలో ఉన్నట్లు సమాచారం. ఈసారి  మమతా బెనర్జీ గెలుపే త్రిశంకు స్వర్గంలో ఉంది. కాంగ్రెస్ కు తృణమూల్ తో సంబంధాలు బాగానే వున్నా, ఫలితాలు ఎట్లా ఉండబోతాయో ఇప్పుడు చెప్పలేం. తమిళనాడు, బెంగాల్ లో ఎన్ని సీట్లల్లో, ఎక్కడెక్కడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నికల రంగంలో దింపుతారన్నది కూడా చాలా కీలకమైన అంశం. పొత్తుల విషయం కూడా పూర్తిగా తేలాల్సివుంది.

ఈ రెండు రాష్ట్రాలే కీలకం

పార్టీ పట్ల ఆకర్షణ, విశ్వాసం పెంచడానికి చేస్తున్న ప్రయత్నంలో ఈ రెండు రాష్ట్రాల వ్యవహారం కీలకమేనని చెప్పాలి. ఇక్కడ కూడా సరియైన ఫలితాలను రాబట్టుకోలేకపోతే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యాలనే ఆలోచన మంచిదే. ఆచరణ, అనుకూల పరిస్థితులు ముఖ్యం. ఫలితాలను బట్టి రాహుల్ గాంధీ మళ్ళీ మనసు మార్చుకొని, అస్త్రసన్యాసం చేస్తే? అంతకు మించిన అపరాధం ఇంకొకటి ఉండదు. రాహుల్ నాయకత్వంపై ఇప్పటికీ ప్రజల్లో పెద్ద విశ్వాసం లేదు.విశ్వాసాన్ని ప్రోదిచేసుకోవడం కూడా రాహుల్ చేతుల్లోనే ఉంది.

నెహ్రూ-ఇందిర కుటుంబంపట్ల ఆకర్షణ

నెహ్రు, ఇందిరాగాంధీ కుటుంబంపై ప్రజల్లో ఇంకా ఎంతోకొంత ఆకర్షణ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడమూ వారి కోర్టులోనే ఉంది.  ప్రజల్లో సోనియా ప్రభావం మాత్రం చాలా వరకూ కనుమరుగైపోయిందనే చెప్పాలి. ప్రియాంకాగాంధీ పట్ల ఒక దశ వరకూ మంచి ఆకర్షణ ఉండేది. ఆ సమయంలో ఆమెకు  ప్రధాన నాయకత్వ బాధ్యతలు ఇవ్వలేదు. ఆ ఆకర్షణ తగ్గుముఖం పట్టిన తర్వాత ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్పారు. ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. ఐనప్పటికీ, దేశంలో  ప్రియాంక ఆకర్షణ ఇంకా కొంచెం ఉందనే చెప్పాలి. భౌతికంగా ఇందిరాగాంధీ పోలికలు కాస్త ఎక్కువగా ఉండడమే కారణం. కానీ, నాయనమ్మ నుండి ఆమె  నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోలేదు.

నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి

రాహుల్ గాంధీ, ప్రియాంక నాయకత్వ లక్షణాలు పెంచుకొని,  ప్రజల్లో విశ్వాసం కలిగిస్తే, కాంగ్రెస్ కు కొంత మేలు జరుగుతుంది. ఇంకా, పార్టీ అధ్యక్షుడునే ఎంపిక చేసుకోలేదు. వర్కింగ్ కమిటీ ఎన్నికలు జరుగలేదు. పార్లమెంట్ బోర్డు ఏర్పాటు కాలేదు. క్షేత్రస్థాయి వాస్తవాలను, లోపాలను తెలుసుకునేలా దేశమంతా ” చింతన్ భైటక్ ” జరపాలనే ప్రతిపాదనలు నిన్నటి సమావేశంలో వచ్చాయి. దానికి సోనియాగాంధీ సుముఖత తెలిపినట్లు తెలుస్తోంది. మొత్తంమీద, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేలుకోకపోతే, పార్టీ మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుంది. బలమైన ప్రతిపక్షం లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరోగ్యదాయకం కాదు. కాంగ్రెస్ పార్టీ  మంచి చింతన  (ఆలోచన) చేస్తుందా,చింతించాల్సిన  దుస్థితిలోకి వెళ్తుందా అన్నదానికి  కాలమే సమాధానం చెప్పాలి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles