- బెంగళూరులో నిర్మించిన రైల్వేశాఖ
- త్వరలో అందుబాటులోకి రానున్న టర్మినల్
ఆర్థిక సంస్కరణలలో భాగంగా భారతదేశంలోని పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. దేశంలోని పలునగరాలు అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ స్థాయి నగరాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అంతర్జాతీయంగా భారత్ కీలక భూమిక పోషిస్తున్న నేపథ్యంలో దేశంలోని ముఖ్య నగరాలు అభివృద్ధిలో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా దేశంలో సాఫ్ట్ వేర్ కు మకుటాయమానంగా వెలుగొందుతున్న బెంగళూరులో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ ఇపుడు సరికొత్త హంగులను అద్దుకుని సర్వాంగ సుందరంగా తయారైంది. విమానాశ్రయం తరహాలో సెంట్రలైజ్డ్ ఏసీ కలిగిన తొలి రైల్వే టర్మినల్ కావడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్ గా నామ కరణం చేశారు. ఈ టర్మినల్ త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులో రానుందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ లో తెలిపారు.
టర్మినల్ ప్రత్యేకతలు
బెంగళూరు బయ్యప్పన్ హళ్లిలో ఏర్పాటైన ఈ టర్మినల్ ద్వారా బెంగళూరు నగరానికి మరిన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను అనుసంధానించడానికి వీలు పడుతుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. టర్మినల్ అందుబాటులోకి వస్తే కేఎస్ఆర్ బెంగళూరు, యశ్వంత్ పూర్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 314 కోట్ల రూపాయల వ్యయంతో 4200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టర్మినల్ ద్వారా రోజూ 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది.
సకల సౌకర్యాల కలబోత:
మొత్తం ఏడు ఫ్లాట్ ఫాంలు కలిగిన టర్మినల్ ప్రాంగణంలో 250 కార్లు, 1000 ద్విచక్ర వాహనాలు, పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్ హాలు, వీఐపీ లాంజ్, ఫుడ్ కోర్టు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండు సబ్ వేలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా రియల్ టైమ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, 4 లక్షల లీటర్ల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరు నుంచి ఈ టర్మినల్ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఎన్టీపీసీ అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్