- వాషింగ్టన్ సుందర్ కూ టెస్ట్ క్యాప్
- అరంగేట్రం టెస్టులోనే నటరాజన్ షో
తమిళనాడు యువబౌలర్లను అనుకోని అదృష్టం వరించింది. కలనైనా ఊహించనిరీతిలో టెస్ట్ క్యాప్ దక్కింది. సీనియర్ ఆటగాళ్ల గాయాలు కాస్త యార్కర్ల కింగ్ నటరాజన్,స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ల పాలిట వరంగా మారింది.
300వ టెస్ట్ క్రికెటర్ నటరాజన్…
ఆస్ట్ర్రేలియా టూర్ కు నెట్ బౌలర్ గా వెళ్లి…టెస్ట్ బౌలర్ గా మారిన ఘనత తమిళనాడు యువఫాస్ట్ బౌలర్ నటరాజన్ సొంతం చేసుకొన్నాడు. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ఆఖరిటెస్ట్ ద్వారా నటరాజన్ అరంగేట్రం చేశాడు.
సీనియర్ ఫాస్ట్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా గాయంతో అందుబాటులో లేకపోడంతో…తుదిజట్టులో నటరాజన్ కు చోటు దక్కింది. మ్యాచ్ ఆరంభానికి ముందు బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జరిగిన టీమ్ సమావేశంలో నటరాజన్ కు బౌలింగ్ కోచ్, మాజీ ఫాస్ట్ బౌలర్ భరత్ అరుణ్..టెస్ట్ క్యాప్ ను అందచేశారు. దీంతో ఎనిమిది దశాబ్దాల భారత టెస్టు చరిత్రలో టెస్ట్ క్యాప్ అందుకొన్న 300వ క్రికెటర్ గా నటరాజన్ రికార్డుల్లో చేరాడు.ఇప్పటికే భారతజట్టు తరపున టీ-20, వన్డే మ్యాచ్ లు ఆడిన నటరాజన్ అనుకోని రీతిలో టెస్ట్ చాన్స్ సైతం దక్కించుకొన్నాడు. అరంగేట్రం టెస్టు తొలిఇన్నింగ్స్ లోనే
కంగారూ ఆటగాళ్లు లబుషేన్, మాథ్యూ వేడ్ లను పడగొట్టాడు.
ఇదీ చదవండి: ఆఖరిటెస్టుకు బుమ్రా, విహారీ దూరం
వాషింగ్టన్ సుందర్ కూ టెస్ట్ చాన్స్….
స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వెన్నెముక నొప్పితో తుదిజట్టుకు అందుబాటులో లేకపోడంతో…అతని స్థానంలో తమిళనాడుకే చెందిన మరో స్పిన్ ఆల్ రౌండర్, వైట్ బాల్ క్రికెట్ స్పెషలిస్ట్ వాషింగ్టన్ సుందర్ కు చోటు కల్పించారు.
వాషింగ్టన్ సుందర్ కు టెస్ట్ క్యాప్ ను అశ్విన్ అందించాడు. భారత టెస్టు చరిత్రలో 301వ ఆటగాడిగా సుందర్ రికార్డుల్లో చేరాడు. టీ-20 ఫార్మాట్లో స్పెషలిస్ట్ బౌలర్ గా పేరుపొందిన సుందర్ కు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. 532 పరుగులు సాధించడంతో పాటు…30 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది.
బ్రిస్బేన్ టెస్ట్ తొలిరోజుఆటలో కంగారూ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను పడగొట్టడం ద్వారా సుందర్ తన తొలిటెస్ట్ వికెట్ సాధించాడు.ఒకే టూర్ లో …అదీ కొద్దివారాల వ్యవధిలో, మొత్తం మూడుఫార్మాట్లలోనూ భారత్ కు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆటగాడిగా నటరాజన్ చరిత్ర సృష్టించాడు.
ఇదీ చదవండి: టెస్టు క్రికెట్లో రికార్డుల రిషభ్