ప్రపంచంలోని మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా, మన దేశంలోని 12 మహా నగరాలు అదృశ్యమైపోతాయనే వార్త దేశాన్ని హడలెత్తిస్తోంది. అది గాలివార్త కాదు. ప్రఖ్యాతమైన, అత్యంత బాధ్యతాయుతమైన ‘నాసా’ తయారుచేసిన నివేదిక. దీనికి కారణం పెరిగిపోతున్న కాలుష్యం తద్వారా వేడెక్కుతున్న వాతావరణం. కాలుష్యం పెరిగిపోవడం వల్ల మంచు కరిగి, సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఇప్పటికే హిమాలయ ప్రాంతాలలో ఆ ముప్పు ఆరంభమైంది. మన నగరాలు కనుమరుగయ్యే దశ ఏమంత దూరంలో లేదు. మరో 80ఏళ్లలో – 2100 నాటికే ఆ పెను ముప్పు చుట్టుముట్టనుందని సమాచారం.
Also read: మహామహితాత్ముడు మాస్టర్ ఇకె
‘నాసా’ వెల్లడించిన నగరప్రళయం
అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ సముద్ర మట్టాలను కొలిచేందుకు ప్రాజెక్షన్ టూల్ ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా వాతావరణంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ కమిటీ నివేదించిన తాజా నివేదిక ద్వారా ఈ భయానక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తులో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని నివేదిక చెబుతోంది. రాబోయే ఇరవై ఏళ్ళల్లోనే వీటి తీవ్రత మన అనుభవంలోకి రానుంది. కార్బన్ ఉద్గారాలు కాలుష్యాన్ని నియంత్రించక పోతే, ఈ పెను ముప్పును మనం తప్పించుకోలేమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ పై శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్/ భూతాపంపై శాస్త్రవేత్తలు,నిపుణులు దశాబ్దాల నుంచి అప్రమత్తం చేస్తున్నారు. అభివృద్ధి – ప్రకృతి పరిరక్షణ పట్ల సమన్వయంతో ముందుకు సాగాలని ప్రభుత్వాలకు, పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారులకు , సంబంధిత వర్గాలకు అందుతున్న హెచ్చరికలను, నివేదికలను పెడచెవిన పెడుతున్న వైనమే ఇక్కడ దాకా తెచ్చింది. భూతాపం తద్వారా మన పతనం మనం స్వయంగా తెచ్చుకున్నది. ఇది నూటికి నూరు శాతం స్వయంకృత అపరాధం. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్ కూడా మన తప్పులకు ఫలితమే. అభివృద్ధి మాటున అరాచకంగా ప్రవర్తిస్తున్నాం. ఈ సృష్టిలోని ప్రతి వస్తువూ ఎంతో విలువైంది. ఒకదానికి మరో దానికి కార్యాకరణ సంబంధం ఉంది. అట్లే జీవరాశులు కూడా పరస్పర ప్రయోజనంతో కూడుకున్నవి. మనిషి పుట్టినప్పటి నుంచీ వెళ్లిపోయేంత వరకూ ప్రతిదశలోనూ ప్రకృతికి, జీవరాశులకు గొప్ప అనుబంధం ఉంది, అవసరం ఉంది. పర్యావరణం, వాతావరణం, జీవరాశులు, ప్రకృతిని కాపాడుకోకపోతే అంతరించే జీవుల్లో మనిషి కూడా ఉంటాడని పరిశోధకులు చెబుతున్నారు.
Also read: టోక్యో ఒలింపిక్స్ అనుభవాలతో భవిష్యత్ బాటలు
పంచభూతాలతో జాగ్రత్త!
పంచభూతాత్మకమైన శరీరం -పంచభూతాత్మకమైన ప్రకృతి రెండూ ఒక్కటే. వేరు వేరు కాదు. ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పేది, ఆధునిక శాస్త్రాలు చెప్పేది ఒకటే. గాలి,నీరు, భూమి,ఆకాశం, అగ్ని- అన్నింటి పట్లా జాగ్రత్తగా ఉండడమే వాటి సారాంశం. జీవనశైలి, గమనం, ఆలోచనా విధానాల్లో వచ్చిన పెనుమార్పులే పెనుప్రమాదాలకు హేతువులవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కాలుష్యాన్ని నివారించకపోతే ఉష్ణోగ్రతలు సగటున 4.4 డిగ్రీల సెల్సియస్ కు పెరుగుతాయని నాసా తాజా నివేదిక వివరిస్తోంది. రాబోయే రెండు దశాబ్దాల్లో 1.5 డిగ్రీ సెల్సియస్ కు పెరుగుతాయని తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ హిమనీ నదాలన్నీ కరిగి సముద్ర మట్టాలు అమాంతంగా పెరిగిపోతాయి.సముద్ర మట్టం పెరిగిపోయే రేటు ఆసియాలోనే ఎక్కువగా ఉందని సమాచారం. 2006 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టం ఏడాదికి 3.7 మిల్లీమీటర్ల చొప్పున పెరిగిపోయింది. 21వ శతాబ్దం మొత్తం ప్రపంచం అంతటా సముద్ర మట్టాలు పెరుగుతూనే ఉంటాయని నివేదిక స్పష్టం చేస్తోంది. దీని వల్ల మనదేశంలోని విశాఖపట్నం, ముంబయి, చెన్నై,మంగుళూరు, కొచ్చి, పారాదీప్,మర్మగావ్,భావ్ నగర్ ఓకా,కాండ్లా,తూత్తుకుడి సముద్రతీరంలో ఉన్న నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఐపిసీసీ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ) నివేదిక తాజాగా హెచ్చరించింది. ప్రపంచ దేశాల మధ్య సముద్ర తీరాల ఒప్పందాలు, ఉల్లంఘనల అంశంపై ఐక్యతా స్వరంతో ముందుకు వెళదామని మన ప్రధాని నరేంద్రమోదీ వివిధ దేశాధినేతలకు సూచించారు. చట్టపరమైన అంశాల విషయంలో ఉదారంగా సాగుదామని, అవసరమైతే తదనుగుణంగా సవరణలు చేసుకుందామని విన్నవించారు. మారిటైమ్ సెక్యూరిటీపై (సముద్రాల రక్షణ) యుఎన్ ఎస్ సీ ( యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ) వేదికగా ఈ మాటలు సాగాయి.
Also read: మూడో ముప్పు ముసురుకుంటోంది, తస్మాత్ జాగ్రత!
దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాలి
దేశాల మధ్య పరస్పర సంబంధాలను మెరుగుపరుచుకుంటూ, మౌలిక వసతుల కల్పనలను పెంచుకుంటూ సముద్రయాన వాణిజ్యాన్ని విస్తరించుకోవడం అందరి లక్ష్యం. కానీ, అలా జరగడం లేదన్నది వాస్తవం. దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన హక్కుల విషయంలో బలమైనవాడిదే పెత్తనంగా సాగుతోంది. వీటిని పరిరక్షించుకోవడం, వాణిజ్యాన్ని అభివృద్ధి పరచుకోవడం ఎంత ముఖ్యమో, పకృతి వైపరీత్యాల నుంచి దేశాలను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. సముద్రప్రాంతాల ఆక్రమణలే కాక జరుగుతున్న అక్రమాలను అరికట్టాలి. భారత ప్రధాని మోదీ తలపెట్టిన ‘సాగర్ విజన్ ప్లాన్’ లో ఆర్ధిక, రక్షణాపరమైన అంశాలనే ప్రస్తావించారు.కాలుష్యాన్ని, భూతాపాన్ని అరికట్టకపోతే నగరాలకు నగరాలే అదృశ్యమైపోతాయన్నది ప్రస్తావనలోకి రాలేదు. ఈ అంశంలో అగ్రరాజ్యాల సహకారం, అన్ని దేశాల సమన్వయం చాలా ముఖ్యం. ప్రకృతిని కాపాడుకొంటూ, సముద్రాలు ఆగ్రహించకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం. ఆ దిశగా భారతప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగాల్సిన తరుణం ఆసన్నమైంది.
Also read: రామాలయం సరే, రామరాజ్యం ఎప్పుడు?