బూర్గుల నరసింగరావు గొప్ప మానవతావాది, స్నేహశీలి. నిజాంకూ, రజాకార్లకూ వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు. మృదుభాషి. జ్ఞాపకాల పుట్ట. కదిలిస్తే అలవోకగా ఆరవై దశాబ్దాల చరిత్ర చెప్పేవారు. నిండుకుండలాగా ఉండేవారు. చిరునవ్వు చెరిగేది కాదు. ఎటువంటి రాజకీయ పరిణామం అయినా తనదైన శైలిలో విశ్లేషించి వివరించేవారు. కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణరెడ్డి తో తన స్నేహం గురించీ, నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ సాధించి నారాయణరెడ్డి లోక్ సభ ఎన్నికలో గెలిచిన సందర్భం గురించీ, సోయబ్ ఖాన్ గురించీ, అతడిని రజాకార్లు కాచిగూడా చౌరాస్తాలో దారుణంగా చంపడం గురించీ చెప్పేవారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో తన పాత్ర గురించి చెప్పేవారు. నరసింగరావు ప్రేమాస్పదుడు. ఎప్పుడు కలిసినా ప్రేమగా పలకరించేవారు. గుంభనంగా, అర్థవంతంగా నవ్వేవారు. దబ్బపండు రంగులో చూడముచ్చటగా ఉండేవవారు. వయస్సు మీద పడినా ఉత్సాహంగా ఉండేవారు. కరోనా మహమ్మారి బారిన పడి వారం రోజుల కిందట బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. సోమవారం చివరి శ్వాస పీల్చారు.ఆయన వయస్సు 88 సంవత్సరాలు.
స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం
పాత మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో 15 మార్చి 1932లో నరసింగరావు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించారు. సామాజికవేత్త, అధ్యాపకురాలు ప్రొఫెసర్ రమా మెల్కోటేకి ఆయన అన్నగారు. హైదరాబాద్ రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు తమ్ముడి కుమారుడు. అభ్యుదయ భావాలను ప్రచారం చేయడమే కాదు స్వయంగా ఆచరించారు. మంగతాయారును కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె మాళవిక, ఇద్దరు కుమారులు అజయ్, విజయ్ ఉన్నారు. వారందరూ విదేశాలలో స్థిరపడినారు.
ఇది చదవండి: కరోనాతో బూర్గుల నర్సింగరావు మృతి
బాల్యంలోనే వామపక్ష భావాలు
నరసింగరావు బాల్యంలోనే వామపక్ష భావాలు వంటబట్టించుకున్నారు. 1947-49లొ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు. అంతర్జాతీయ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడిగా పని చేశారు. నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడారు. కొంతకాలం చెంచల్ గూడా జైలులో ఉన్నారు. నికార్సయిన తెలంగాణ పక్షపాతి. 1952 లో ముల్కీ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించారు. 1955లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్) జాతీయ అధ్యక్షుడుగా పని చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన షోయబుల్లా ఖాన్ హైదరాబాద్ లో ‘ఇమ్రోజ్ ’ పత్రికను స్థాపించడంలో, నడపడంలో నరసింగ్ రావు ప్రోత్సాహం పూర్తిగా ఉంది. రజాకార్లు షోయబుల్లాపైన దాడి చేసినప్పుడు నరసింగరావు పక్కనే ఉన్నారు. ఆయన ప్రత్యక్ష సాక్షి. షోయబుల్లా హత్య నరసింగరావును రాటుదేలిన సెక్యులరిస్టుగా, కమ్యూనిస్టుగా మార్చింది. ఎన్నో కమ్యూనిస్టు, ప్రగతిశీల ఉద్యమాలను ఆయన నాయకత్వం వహించి నడిపించారు. 1960లో ఇంగ్లండ్ లో ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. కొంతకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రం బోధించారు. జర్నలిస్టుగా, రచయితగా రాణించారు. 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించారు. కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో నడిచిన ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలన్నింటిలో, అన్ని దశలలోనూ పాల్గొన్నారు. సీపీఐ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పని చేశారు.
ఎంతో ఎత్తుకు ఎదిగి గ్రామసర్పంచ్ గా విధులు
అంతర్జాతీయ స్థాయిలో చదువుకొని, విద్యార్థి నాయకుడుగా, కమ్యూనిస్టు యోధుడిగా, అధ్యాపకుడిగా పని చేసిన తర్వాత బూర్గుల గ్రామం సర్పంచ్ గా 1989 నుంచి 1994 వరకూ పని చేయడం, గ్రామ అభివృద్ధికి పాటుపడటం విశేషం. అందరూ గ్రామ సర్పంచ్ గా రాజకీయ జీవితం ప్రారంభించి మండల అధ్యక్షుడిగా, ఎంఎల్ఏగా, మంత్రిగా ఎదుగుతారు. నరసింగరావు ఇందుకు పూర్తిగా భిన్నం. స్వగ్రామంపైన ఉన్న ప్రేమ ఆయననూ హైదరాబాద్ నుంచి బూర్గులకు నడిపించింది. ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కోసం, ఆస్పత్రి నిర్మాణం కోసం సొంత భూమిని దానం చేశారు. తమ కుటుంబానికి చెందిన 1100 ఎకరాల భూమిని పేదలకు పంచడంలో ముందు పీటీన నిలిచి పని చేశారు.
ముఖ్యమంత్రి కారుకు నిప్పు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ముఖ్యమంత్రిగా పని చేస్తున్న పెదనాన్న బూర్గుల రామకృష్ణారావు కారును సైతం నరసింగరావు తగులపెట్టారని కమ్యూనిస్టు నాయకులు చెప్పుకుంటారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ట్రస్ట్, రావినారాయణరెడ్డి ఫౌండేషన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిండు జీవితాన్ని తనకు నచ్చిన తీరులో, అందరూ మెచ్చే రీతిలో జీవించి ఈ లోకం వదిలి వెళ్ళిన నరసింగరావుకు ఇదే అక్షరాంజలి.