డా. ఆరవల్లి జగన్నాథస్వామి
తెలుగు పత్రికా రంగం పేరు చెప్పగానే స్ఫురించే ప్రముఖులలో ముందువరుసలో ఉంటారు నార్ల వేంకటేశ్వరరావు. ఆధునిక పత్రిక రంగానికి దార్శనికుడు. ఆయన పేరు ప్రస్తావన లేకుండా ఈ రంగం గురించి ముచ్చటించుకోలేనంతగా ముద్ర వేశారు. చదివించే సంపాదకీయాలు రాసిన ఘనత ఆయనకే దక్కుతుందని, ఆయన సంపాదకీయాల కారణంగానే పత్రికలు ప్రాచుర్యం పొందాయని అనంతర కాలంలో పలువురు సంపాదక ప్రముఖులు చెప్పారు, చెబుతుంటారు.
భావ వ్యక్తీకరణలో రాజీ లేదు
నమ్మిన భావాలను వ్యక్తీకరించడంలో వెనుకాడ లేదు. అలాంటి విషయాల్లో ఏటికి ఎదురీడం అలవాటైంది. అవిభక్త మద్రాసు రాష్ట్ర ఎన్నికల్లో (1946)లో కాంగ్రెస్ శాసనసభ పక్షనేతగా చక్రవర్తుల రాజగోపాలాచారిని ఎన్నుకోవాలన్న మహాత్మా గాంధీ వినతి పూర్వక సూచనను నార్ల గట్టిగా వ్యతిరేకించారు. `నచ్చని నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పే హక్కు గాంధీజీకి సహా ఎవరికీ లేదు`అని తెగేసి చెప్పారు. దాంతో టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయ్యారు. నార్ల వారి ఆ వ్యాఖ్యలు ప్రకాశం పదవీ యోగానికి ఉపకరించినా, ఏడాది టంగుటూరి పాలన పట్ల అసంతృప్తితో తమ సంపాదకీయాల్లో ఘాటుగా విమర్శలు గుప్పించారు.
నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో అదుపుతప్పిన రజాకార్ల చర్యలను నార్ల గట్టిగా వ్యతిరేకించారు. దాంతో ఆయన సంపాదకత్వం వహిస్తున్న `ఆంధ్రప్రభ‘ హైదరాబాద్ ప్రవేశాన్నినిజాం ప్రభుత్వం నిషేధించింది. దాంతో అక్కడి పాఠకులకు ఆ పత్రిక సమాచారం పట్ల ఉత్సుకత మరింత పెరిగి చాటుమాటుగా కొని చదివే వారు. ఆ `నిషేధం` కూడా పత్రిక సర్క్యులేషన్ కు ఉపకరించినట్లయింది.
అధికారపక్ష నేతలనే కాదు,అనుచిత విధానాలు అవలంబించే ప్రజానీకాన్ని, అవసరమైతే పత్రిక యాజమాన్య అభిప్రాయాలతోనే విభేదించే వారు. `ఆంధ్రప్రభ` సంపాదక పదవికి రాజీనామా చేయడాన్ని (1942-59) అందుకు ఉదాహరణగా చెబుతారు. యాజయాన్యంతో వ్యక్తిగత విభేదాలతో రాజీనామా చేశారని కొందరు భావిస్తే, ఆ సమమంలోనే సమ్మెకు దిగిన సిబ్బంది న్యాయమైన కోరికలకు మద్దతుగా పదవీ త్యాగం చేశారని డాక్టర్ సి.ఎస్. శాస్త్రి ఒక సందర్భంలో రాశారు. నమ్మిన సిద్ధాంతాలను పక్కన పెట్టలేకే 1942 వరకు కూడా అనేక పత్రికల నుంచి బయటికి వచ్చేశారు.
నిరంతర అన్వేషి
నార్లవారు రూపొందించుకున్నశైలినే నిరంతరం అనుసరించ డానికి ఇష్టపడే వారు కాదని ఆయన సమకాలికులు చెబుతారు. ఆయన నిరంతర అన్వేషి. వార్తా రచనకు సంబంధించి అనేక పదాలు సృష్టించి వాడుకలో తెచ్చారు. వాటికి ప్రామాణికత కల్పించారు. ఆంగ్ల పత్రికా రంగంలో స్థిరపడాలని ఎంత కోరిక ఉన్నా తెలుగు పత్రికలలో మాత్రం ఆంగ్ల పదాలను గుడ్డిగా అనుసరించడాన్ని ఇష్టపడేవారు కాదు. సాధ్యమైనంత వరకు తెలుగులో రాయడానికి, రాయించడానికి ప్రయత్నించారు. సరళపదజాలంతో పాఠకుల మనస్సుకు హత్తుకునేలా వార్తా రచన కోసం తపించారు. పత్రికలో అచ్చయ్యే ప్రతి పదం పట్ల అప్రమత్తత అవసరమని చెప్పేవారట. చరిత్రకు పత్రిక సమాచారమే ముడి సరకు అవుతుందని ఆయన భావన.
ముక్కుసూటిదనం
`సూటిగా కుండబద్దలు కొట్టినట్లు, ముక్కుమీద గుద్దినట్టు చెప్పడం ఆయన ప్రత్యేకత. ఎవరి పట్లనైనా వ్యతిరేక భావంతో మనసులో చిందులు తొక్కేటప్పుడు ఆయన భాష కూడా అలాగే పదునుగా ఉండేది. మండిపడుతూ ఉండేది. సంపాదకీయాలకు వస్తువును ఎన్నుకోవడంలో, వింతపోకడలు పోవడంలో, నాటకీయంగా రాయడంలో ఆయన కొత్తదారులు తొక్కారు` అని ఆనాటి `ఆంధ్రజ్యోతి`కి సంపాదకునిగా నార్ల వారి వారసునిగా వచ్చిన నండూరి రామమోహనరావు చెప్పేవారు. ఆయన ఒరవడినే కొనాసాగిం చానని ఒక వ్యాస సంపుటిలో పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యుడిగా…..
నార్ల రాజ్యసభకు రెండుసార్లు (1958, 1964) ప్రాతినిధ్యం వహించారు. పాత్రికేయుడిగా అనేక అంశాలపై సంపాదకీయాలు వెలువరించినట్లే, అనేక అంశాలు, సమస్యలపై సభలో చర్చించేవారు. పాత్రికేయుడిగా పలు అంతర్జాతీయ , జాతీయ సదస్సులకు హాజరయ్యారు. ఆయన కేవలం పాత్రికేయుడే కాదు. కవి, నాటక కర్త కూడా. ఆయన రాసిన `సీత జోస్యం` సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది.
మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో 1908 డిసెంబర్ 1 వ తేదీన జన్మించిన నార్ల 1985 ఫిబ్రవరి 19న హైదరాబాద్ లో కన్నుమూశారు.
(ఈ రోజు, డిసెంబర్ 1 నార్ల జయంతి)