Tuesday, January 21, 2025

నరేంద్రుని కాశీయాత్ర

  • అట్టహాసంగా ప్రచార సంరంభం
  • హిందువుల ఐకమత్య సాధన ధ్యేయం
  • బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సందడి

‘కాశి… అది పుణ్యరాశి – దుష్కలుష వల్లికా సితాసి’.. అన్నారు ప్రఖ్యాత జంటకవులు కొప్పరపు సోదరులు. వారణాసి యాత్ర పాపాలను పోగొట్టి, పుణ్యాలను కలిగిస్తుంది, కలుషాలను దూరం చేస్తుందని ఆర్యుల వాక్కు. పవిత్రతకు, స్వచ్ఛతకు నిలయం ఆ పుణ్యభూమి. సకల విద్యలకు, సర్వ కళలకు ఒకప్పుడు నెలవు ఆ ధన్యసీమ. ఆధ్యాత్మిక శోభకు ఆలవాలం,ముక్తికి మార్గం, కోట్లాదిమంది భారతీయుల భుక్తికి సోపానం వారణాసి. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నగరాలలో శిఖరాయమానంగా నిలుస్తూ, భారతదేశాన్ని అన్నింటా శిఖరంపై కూర్చో పెట్టిన ఘనత ఈ మహానగరంకే చెందుతుంది.

Also read: దేవిప్రియ అంటే అనేక శిఖరాలు

వందల ఏళ్ళ వైభవ ప్రతీక

వందల ఏళ్ళ వైభవానికి ప్రతీకగా దర్శనమిచ్చే కాశి కాలుష్య కాసారంగా మారింది. ఆ పవిత్ర గంగ స్వచ్ఛతను కోల్పోయి చాలా కాలమైంది. అది కేవలం ఆ నదికే పరిమితం కాలేదు. ఊరు ఊరంతా అదే దారి. ఇరుకు వీధులు, మురికి వాడలు అడుగడుగునా కనిపిస్తాయి. పుస్తకాల్లో చదువుకున్న దానికి ,క్షేత్ర వాస్తవాలు పూర్తి భిన్నంగా మారిపోయి కూడా చాలా కాలమైంది. స్వాతంత్య్ర అనంతర భారతంలో కాలుష్యం, అపవిత్రత, సౌకర్యాలలేమి ఆకాశాన్ని అంటాయి. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కాలం నుంచి అదే తీరు. అందరూ కాశీని సందర్శించినవారే. 2014లో నరేంద్రమోదీ లోక్ సభ స్థానంగా కాశీని ఎంచుకున్నారు. కాశీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రణాళికలను వివరించారు. సర్వతోముఖాభివృద్ధికి కంకణం కట్టుకున్నట్లు ప్రకటించారు. ప్రజలు విశ్వసించారు. 2014, 2019 రెండు పర్యాయాలు గొప్పగా గెలిపించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి స్థానాన్ని అధిరోహించారు. గతంలో ఎన్నిసార్లు పర్యటించినా ఆ దారి వేరు. ఆ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించడం ప్రారంభం  అయినప్పటి నుంచీ నరేంద్రమోదీ పర్యటనల తీరు వేరు.  ముఖ్య సందర్భాల్లో, సంరంభాల్లో కాశీని ముఖ్య వేదికగా  ఎంచుకుంటున్నారు. ప్రధాని రెండు రోజుల తాజా పర్యటనకు విశేషమైన ప్రచారం వచ్చింది. నేడు  అది తన సొంత నియోజకవర్గం. సొంత రాష్ట్రం గుజరాత్ ను విడచి, కాశీని ఎంచుకున్నప్పుడే మోదీ వ్యూహం చాలామందికి అర్ధమైంది. అన్నట్లుగానే, అనుకున్నట్లుగానే ఆయన అడుగులు వేస్తున్నారు.

నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్

అయోధ్య స్వప్నసాకారం

ఎన్నో ఏళ్ళ స్వప్నం అయోధ్య మందిర నిర్మాణం సాకారమైంది. మరి కొన్ని నెలల్లోనే సర్వ దర్శనానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు కాశీలో పునః వైభవానికి పునాదులు పడుతున్నాయి. ఇవన్నీ బిజెపికి కలిసి వచ్చే అంశాలని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరో ముప్పై ఏళ్ళు బిజెపిదే పాలన అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( పీ.కే) చేసిన వ్యాఖ్యలు నిజమయ్యేట్లు ఉన్నాయని వారు గుర్తుచేసుకుంటున్నారు. 339 కోట్ల రూపాయలతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథుని ‘నడవా’ ( కారిడార్) తొలిదశ విజయవంతంగా సంపూర్ణమైంది. జాతికి అంకితం చేసి, తన సత్తా చాటుకొనే ప్రయత్నం మోదీ విజయవంతంగా పూర్తి చేశారు. ఇరుకుగా ఉండే ‘విశ్వనాథ్ ధామ్’ ను విస్తరించారు. 3000 చదరపు అడుగుల నుంచి 5 లక్షల చదరపు అడుగులకు భారీగా విస్తరణ జరిగింది.  ఇక నుంచి రోజుకు 50-75వేల మంది మందిరాన్ని దర్శించుకొనే గొప్ప సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. యాత్రికుల సౌకర్యం కోసం 23 కొత్త భవనాలు కూడా సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.  కాశీ వీధులన్నీ మోదీ కలియ తిరిగారు.  అర్ధరాత్రి వేళ బజారుల్లో ఆకస్మిక పర్యటన చేశారు. విశ్వనాథ్ కారిడార్ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలతో సహపంక్తి భోజనం చేశారు. వాళ్లపై పూలు చల్లుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మహాత్మాగాంధీ కన్న కలలు మోదీ సాకారం చేశారు ‘ అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానిపై పొగడ్తల పూదండలు వేశారు. హర హర మహాదేవ.. అంటూ మధ్య మధ్యలో మోదీ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పనిలో పనిగా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంగళవారం నాడు కీలక సమావేశం నిర్వహించారు. వారంతా బుధవారం నాడు రామ్ లల్లా దర్శనం కోసం అయోధ్యకు వెళ్ళనున్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని తెలిసిందే.

Also read: అమెరికాలో పెనుగాలుల అల్లకల్లోలం

సార్వత్రిక ఎన్నికలకు ప్రీఫైనల్

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇవి ప్రీఫైనల్స్ వంటివి. దేశంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ ఫలితాలు అత్యంత కీలకం.అక్కడ యోగి ఆదిత్య నాథ్ పాలన అంత గొప్పగా ఏమీ లేదు. పైపెచ్చు వివాదాలకు, విభేదాలకు కేంద్ర స్థానంగా మారిందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ కులాల కుంపట్లు తెగ రగిలి పోతున్నాయి. లఖింపూర్ మారణహోమం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు మూటకట్టింది. పాలనా వైఫల్యాలపై ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి. మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు చుట్టుముట్టుతున్నాయి. వీటన్నిటిని ఎదుర్కొంటూ ఎన్నికల బరిలో గెలవాల్సిన బరువు అగ్రనాయకులందరిపైనా పడింది.ఎన్నికల వేళ కాశీలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం అత్యంత ముఖ్యమని నరేంద్రమోదీ భావిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. కాశీ క్షేత్రం ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఆ రాష్ట్రంలో ముస్లింల సంఖ్య కూడా చాలా ఎక్కువ. సామాజిక సమ తుల్యతను పాటిస్తూ, మైనార్టీల మనోభావాలు దెబ్బ తినకుండా చూడడం పాలకుల బాధ్యత. అది ఎట్లున్నా… హిందూ రాజ్య స్థాపన ప్రధాన ఎజెండాగా, దేశంలోని మెజారిటీ సంఖ్యాకులైన హిందువులను పార్టీ వైపు తిప్పుకోవడం ముఖ్య రాజకీయ భూమికగా బిజెపి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, దానికి కాశీ, అయోధ్యలను మోదీ వాడుకుంటున్నారనే విమర్శలు వినపడుతూనే ఉన్నాయి. ఈ విమర్శలు అలా ఉండగా, కాశీని సమగ్రంగా అభివృద్ధి చెయ్యడం చాలా ముఖ్యం. అభివృద్ధితో పాటు గంగానదిని, కాశీ ధామాన్ని ప్రక్షాళన చెయ్యడం ఎంతో ముఖ్యం. భారతదేశ చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడడం, పునరుద్ధరించడం అంతే ముఖ్యం. మొత్తంమీద, ప్రధాని నరేంద్రమోదీ కాశీయాత్ర  రాజకీయ ప్రస్థానంలోఎటువంటి మలుపులు తిప్పుతుందో కాలపరీక్షలోనే తేలుతుంది.

Also read: గంధర్వులను మించిన ఘంటసాల

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles