వోలేటి దివాకర్
ఎంపి సభ్యత్వం రద్దయినట్లు ప్రకటించగానే ఒక మాజీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మంచిరోజులు ప్రారంభమయ్యాయని సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానించారు. వైద్యురాలైన బిజెపి నాయకురాలు కూడా రాహుల్ గాంధీపై కక్ష సాధిస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీసుశాఖలో పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నాయకుడు, ఎంపి కూడా అయిన రాహుల్ లాంటి నాయకుడి పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు. తమ పాలన అమృతకాలమని (అమృత్కాల్) తరుచూ బిజెపి నాయకులు చెబుతుంటారు. అయితే, ఇలాంటి వ్యాఖ్యలు వింటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు రాహుల్ గాంధీకి ఇది అమృతకాలమని, ప్రధాని నరేంద్రమోడీకి రాహుకాలం ప్రారంభమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే భారతదేశాన్ని ఏకతాటి పైకి తెచ్చేందుకు కాంగ్రెస్ యువనేత, ఎంపి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో మంచి స్పందన లభించినా… రాహుల్ ఆశించిన లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరలేదు. అయితే, కేంద్రంలోని నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ చర్యలతో రాహుల్ గాంధీ ఆశయం నెరవేరినట్టే కనిపిస్తోంది.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్యాంకులకు కోట్లు మోడీ తదితరులను ఎగ్గొట్టి పరారైన నీరవ్ మోడీ, లలిత్ మోడీలను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇంత కన్నా ఎక్కువ తీవ్ర విమర్శలు సాగుతాయి. అయితే రాహుల్ ను లక్ష్యంగా చేసుకుని మోడీ ఇంటి పేరు గల వారందర్నీ రాహుల్ అవమానించినట్లు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. రెండేళ్ల పాటు ఈకేసు విచారణ కొనసాగింది. ఈకేసులో విచారించిన న్యాయమూర్తులు కూడా మారారు. ఈ పరిణామాల మధ్య రాహుల్ గాంధీ బ్రిటన్లో పర్యటించి అక్కడి పార్లమెంటు సహా వివిధ వేదికలపై, భారతదేశంలోని మోడీ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ విదేశీగడ్డపై భారతదేశ సార్వభౌమత్వాన్ని అవమానించారని బిజెపి ఎదురుదాడికి దిగింది. ఈలోగా హిండెన్బర్గ్ నివేదిక బహిర్గతమైంది. మోడీకి అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అత్యంత తక్కువ వ్యవధిలో ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా ఎదిగిన తీరును ఆ నివేదిక ప్రశ్నించింది. అదానీ కంపెనీల పుస్తక విలువలను కృత్రిమంగా ఎక్కువగా చూపించారని నివేదిక బయట పెట్టడంతో అదానీ కంపెనీ షేర్లు పతనం కావడంతో పాటు, స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. దీంతో రాహుల్ మోడీ, అదానీ బంధాన్నిలోక్ సభలో గట్టిగా నిలదీశారు. బ్రిటన్లో తాను చేసిన వ్యాఖ్యలకు పార్లమెంటులో వివరణ ఇచ్చేందుకు, అలాగే మోడీ, అదానీ బంధంపై కూడా బిజెపిని నిలదీసేందుకు రాహుల్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడకుండా బిజెపి అడ్డుకోవడంతో పాటు, ఆయనకు మాట్లాడే అవకాశాన్ని కూడా లేకుండా మైకును నిలిపివేశారు. ఈ పరిణామాలు జరిగిన కొద్ది రోజులకే సూరత్ కోర్టు పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఆ వెంటనే నిబంధనల ప్రకారం అంటూ ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం వంటి చర్యలు చకచకా జరిగిపోయాయి. కనీసం రెండేళ్ల శిక్ష పడితేనే ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవుతుంది. ఈకేసులో ఇంతకన్నా తక్కువ శిక్ష విధించవచ్చని విశ్లేషిస్తున్నారు. ఇంతకన్నా తక్కువ శిక్ష విధిస్తే పిటిషనర్ ఉద్దేశ్యం నెరవేరదని ఈసందర్భంగా జడ్జి వ్యాఖ్యానించడం గమనార్హం. తాజాగా ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయాలని నోటీసులు కూడా జారీ చేయడం కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు.
ఏపీలో ప్రధాన పార్టీలు మౌనం
రాహుల్ గాంధీపై బిజెపి ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బిఆర్ఎస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ వంటి నాయకులు తీవ్రంగా ఖండించడంతో పాటు బిజెపి కక్ష సాధింపు చర్యలను తప్పుపట్టారు. బిజెపిని వ్యతిరేకించే దేశంలోని మెజార్టీ పార్టీలు రాహుల్ కు బాసటగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ పరిణామాలతో రాహుల్ గాంధీకి భారత్ జోడో యాత్ర కన్నా ఎక్కువ అనుకూల ప్రచారం లభిస్తోంది. ఆయన పట్ల సానుభూతి వెల్లువెత్తుతోంది. విపక్షాల ఐక్యత ఇలాగే కొనసాగితే పదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న బిజె పికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎపిలోని అధికార వైఎస్సార్ సిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి అనుకూలేమన్న విషయం మరోసారి స్పష్టమైంది. రాహుల్ పై చర్యలపై ఆపార్టీలు కిమ్మనకుండా ఉండటమే ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.
మోడీలే ఓబిసిలా?!….
మరోవైపు బిజెపి మోడీలను కించపరచడం ద్వారా దేశంలోని ఓబిసిలను రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలు అవమానిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే మోడీలు ఒక్కరే ఓబిసిలు కాదన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. ఓబిసిల్లో మోడీ కులస్తులు ఒక భాగం మాత్రమే. రాజస్థాన్, ఇతర ఉత్తరభారతదేశంలోని మోడీలు ఇతర కులస్తులు కావడం గమనించాల్సిన అంశం. యూపీకి చెందిన దివంగత బ్యాట్మెంటేన్ క్రీడాకారుడు సయ్యద్ మోడీ ముస్లిం. అలాగే దేశవ్యాప్తంగా ఓబిసిల్లో వేలాది కులస్తులు ఉన్నారన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. వారెవరూ రాహుల్ వ్యాఖ్యలతో తమకు అవమానం జరిగిందని భావించనట్లు కనిపిస్తోంది. లేనిపక్షంలో గుజ్జర్లు, పటేళ్ల తరహా ఉద్యమాలను చూడాల్సి వచ్చేది. మోడీ కోసమే బిజెపి ఆందోళన చేస్తోందన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతోంది. ఇంత జరుగుతున్నా అదానీకి, మోడీకి సంబంధం లేదని ప్రధాని మోడీ, బిజెపి విస్పష్టంగా ప్రకటించలేక పోవడం గమనార్హం. అదానీ కంపెనీల్లో కొన్ని షెల్ కంపెనీలు రూ. 20వేల కోట్లు పెట్టుబడి పెట్టాయన్న రాహుల్ ఆరోపణలపై కూడా బిజెపి సమాధానం చెప్పడం లేదు. అదానీని బిజెపి వెనుకేసుకుని వస్తున్నట్లు కనిపించడం సామాన్య ప్రజల్లో అనుమానాలకు దారితీస్తోంది. అదే సమయంలో రాహుల్ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మోడీకి రాహు కాలం… రాహుల్ కు శుభ గడియలు వచ్చినట్లు కనిపిస్తోంది.