Thursday, November 21, 2024

హైదరాబాద్ సంస్కృతికి సముజ్జ్వల ప్రతీక నరేంద్ర లూథర్

భాగ్యనగరాన్ని అమితంగా ప్రేమించిన బహుముఖ ప్రతిభావంతుడు, బహుగ్రంధ రచయిత,  మాజీ ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ అసలు సిసలైన హైదరాబాదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా సమర్థంగా పని చేసి చరిత్రలో తనకంటూ ఒక  సమున్నత స్థానం సంపాదించుకొన్న అరుదైన వ్యక్తి, హైదరాబాద్ చరిత్రను అక్షరబద్ధం చేసిన 89 సంవత్సరాల లూథర్ మంగళవారం (19 జనవరి 2021) ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉన్నారు. కేర్ బంజారాలో చికిత్స పొందుతూ తుడిశ్వాస విడిచారు. నరేంద్ర భార్య బింది, కుమార్తె సంధ్య, కుమారుడు రాహుల్ ఆయన చెంతనే ఉన్నారు.

శిల్లాలంటే అమితమైన ప్రేమ

సొసైటీ ఫర్ సేవ్ రాక్ సంస్థ అధ్యక్షుడుగా ఆయన ఎనలేని సేవలు అందించారు. హైదరాబాద్ చుట్టుపక్కల కొండలూ, గుట్టలూ అంటే ఆయనకు విపరీతమైన మక్కువ. కవి, రచయిత, చరిత్రకారుడు, కాలమిస్ట్ గా ఆయన హైదరాబాద్ చరిత్రలో, సంస్కృతిలో కలిసిమెలిసి జీవించారు. 23 మార్చి 1932లో అవిభక్త  పంజాబ్ లోని హోషియార్ పూర్ లో పుట్టిన నరేంద్ర బాల్యం లాహోర్ లో గడిచింది.  దేశవిభజన సందర్భంలో లాహోర్ నుంచి భారత్ కు తల్లిదండ్రులతో వచ్చేశారు. హైదరాబాద్ లో ఐఏఎస్ అధికారిగా వివిధ శాఖలలో పని చేసి విస్తారమైన సేవలందించారు. 1991 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రధాన  కార్యదర్శిగా పని చేశారు. హైదరాబాద్ నగర మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా, పరిశ్రమల శాఖ సంచాలకుడిగా విలువైన సేవ చేశారు.

విధినిర్వహణలో తెగింపు, నిజాయితీ

Hyderabad has lost its character' - The Statesman

విధి నిర్వహణలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా కర్తవ్య నిర్వహణ నరేంద్రలూథర్ ప్రత్యేకత. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ లో సబ్ కలెక్టర్ గా పని చేస్తున్నప్పుడు రెండు రైళ్ళు తుపానులో చిక్కకుపోయిన సందర్భంలో రహదారి వరద నీటిలో నిండిపోయిన కారణంగా వాహనాలు అడుగు ముందుకు కదలలేని పరిస్థతి. అప్పుడు వరద నీటిలో ఈదుకుంటూ వెళ్ళి రైళ్ళలో ఆకలి, దప్పులతో అలమటిస్తున్న ప్రయాణికులకు నీరు, ఆహారం సరఫరా చేశారు. ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. ప్రయాణికులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఐఏఎస్ అధికారిగా తన సర్వీసును 1958లో కర్నూలు జిల్లాలో ప్రారంభించారు. తర్వాత నెల్లూరు జిల్లా లో పని చేశారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ ను మనస్ఫూర్తిగా ప్రేమించారు. ఇక్కడి మిశ్రమ సంస్కృతికి ఫిదా అయిపోయారు. 1991లో హైదరాబాద్ 400 సంవత్సర సంబురాలు జరుపుకుంటున్న సమయంలో నరేంద్ర లూథర్ పునరావాస శాఖలో పని చేసేవారు. అంతగా పని ఒత్తిడి ఉండేది కాదు. కులీకుతుబ్ షా పైన మోనోగ్రామ్ రచించారు. ఉర్దూ భాషలో ఆయన రచనలకు అనేక అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్ పైన సాధికార చరిత్రకారుడుగా నరేంద్ర లూథర్ కు చరిత్రలో చెరిగిపోని పేరు నిలిచి ఉంటుంది. ఆయన రచనలు ఇతర భారతీయ భాషలలోకీ, కొన్ని విదేశీభాషలలోకీ అనువాదమై ప్రాచుర్యం పొందాయి.

బహుగ్రంథ రచయిత

హైదరాబాద్ చరిత్ర, భౌగోళిక స్వరూపం, సంస్కృతి, మిశ్రమ నాగరికతపైన 14 గ్రంధాలు రచించారు. హైదరాబాద్ – ఎ బయోగ్రఫీ, లష్కర్ – ద స్టోరీ ఆఫ్ సికిందరాబాద్, పోయెట్, లవర్, బిల్డర్, మహమ్మద్ అలీ కుతుబ్ షా-ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్, తదితర పుస్తకాలు విశేషంగా పాఠకాదరణ పొందాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న శిలల విశిష్టతను అభివర్ణిస్తూ ‘రాక్ మెంటరీ’ పేరుతో ఒక డాక్యుమెంటరీ నిర్మించారు. ‘ది ఫామిలీ సాగా’  అనే పుస్తకం దేశ విభజన సమయంలో తన కుటుంబం లాహోర్ నుంచి ప్రత్యేక రైలులో అమృత్ సర్ కు చేసిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రాసింది. ఈ ఇతివృత్తంతోనే, ఆ రైలు పైనే ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత కుష్వంత్ సింగ్ ‘ట్రయిన్ టు పాకిస్తాన్ ’ అనే పుస్తకం 1956లో ప్రచురించారు. అది దేశవిభజన సమయంలో ఇండియా నుంచి ముస్లింలు పాకిస్తాన్ కూ, పాకిస్తాన్ నుంచి హిందువులు ఇండియాకూ వలస రావడాన్ని, ఆ సమయంలో ఎదుర్కొన్న సమస్యలనూ, జరిగిన మారణహోమాన్నీ, మానవీయకోణాలనూ ఆవిష్కరించిన పుస్తకం అది. నరేంద్ర లూథర్ పుస్తకం కూడా విలువైనదే. విట్ అండ్ విజడమ్ సొసైటీ, యుద్ధవీర్ ఫౌండేషన్ లలో కీలకమైన బాధ్యతలు పోషించేవారు. శిలలపైన తన ప్రేమను ప్రదర్శిస్తూ బంజారాహిల్స్ లో 1977లో ఒక పెద్ద శిల చుట్టూ తన ఇంటిని కట్టుకున్నారు. ఆ భారీ శిల ప్రకృతి పరిరక్షణకు నరేంద్రలూథర్ లో గల అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం.

లాహోర్ తర్వాత హైదరాబాద్

Amazon.in: Narendra Luther: Books

లూథర్ తన ఆత్మకథను ‘ఏ బోన్సాయ్ ట్రీ’ పేరుతో 2017లో ప్రచురించారు. ఇది అద్భుతమైన గ్రంధం. ఇందులో లాహోర్ లో తన జీవితాన్నీ, దేశవిభజన సమయంలో తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలనీ, కన్నీళ్ళని మనసును ఆకట్టుకునే విధంగా వివరించారు. ‘లాహోర్ చూడనివాడు పుట్టడు అని పంజాబీ అంటారు. నేను హైదరాబాద్ కి రావడం వల్ల రెండు సార్లు పుట్టినట్టయింది (It was a popular saying in Punjab that one who had not seen Lahore has not yet been born. Coming to Hyderabad, I felt twice born) అని ఆత్మకథలో లూథర్ రాసుకున్నారు.

భాగమతి, కులీ ప్రేమకథపై విశ్వాసం

నిజాం ఫొటోగ్రాఫర్ రాజా దీన్ దయాళ్ పైన కూడా లూథర్ రాశారు. 19వ దశాబ్దం నుంచి 20వ దశాబ్దానికి ప్రయాణం చేసే సంధ్యలో హైదరాబాద్ ప్రజల జీవితానికి అద్దం పట్టే ఛాయాచిత్రాలను దీన్ దయాళ్ తీశారు. అదే విధంగా భాగమతి ప్రేమ ఫలితమే హైదరాబాద్ నగర నిర్మాణమని విశ్వసించిన రచయిత లూథర్. అందుకే భాగమతి చరిత్రనూ, కులీకుతుబ్ షా చరిత్రనూ, వారి ప్రేమ కథనూ గ్రంథస్తం చేశారు. హిందూ యువతి అయిన భాగమతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న కులీకుతుబ్ షా ఆమెకోసం నగరం నిర్మించాడనీ, మొదట ఈ నగరాన్ని భాగనగరంగా పిలిచేవారనీ, అనంతరం భాగ్యనగర్ గా ప్రసిద్ది చెందిందనీ, భాగమతి ఇస్లాం మతం స్వీకరించి ‘హైదర్ మహల్’ అనే టైటిల్ ను స్వీకరించిన తర్వాత నగరం పేరు కూడా హైదరాబాద్ గా మారిందనీ చరిత్ర. దీనిపైన చరిత్రకారులలో, పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నరేంద్ర లూథర్ మాత్రం ప్రేమకథను విశ్వసించారు. హిందూ-ముస్లిం అనుబంధానికి ప్రతీకగానే, గంగా-జమునీ సంస్కృతికి ఉదాహరణగానే ఆయన హైదరాబాద్ నగరాన్ని సంభావించారు. లూథర్ ఉర్దూ భాషనూ, హైదరాబాద్ నగరాన్నీ, చమత్కార బాషణనీ మనస్పూర్తిగా ప్రేమించిన వ్యక్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles