Sunday, December 22, 2024

లక్ష్మి కరుణిస్తేనే నారాయణుని అభయం

18 గోదా గోవింద గీతమ్

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

మదపుటేనుగులు వేయి నదుపు జేసెడివారు

 వైరుల దరిమెడు అతిరథుడు అరిభంజనుడు

నందగోపుని మేనగోడల నప్పిన్న పరిమళ నీలవేణి

కొక్కొరకోల ప్రభాతగీతమ్ము నీ చెవులు సోకలేదేమొ

మాధవీలతల చిగురుమేసిన కోకిల గానాలు వినలేదేమొ

గోవిందునెదపై నీళ హస్తమొకటి,  క్రీడించు బంతి మరొక చేత

కాలిఅందెల ఘల్లుధ్వనుల స్వర్ణకంకణ కాంతులెగయ

 కంజదళాక్షి కదిలి రావమ్మ కవాటపు గడియతీయ.

ప్రతిపదార్థం
“ఉందు మదకళిత్తన్” =మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు “ఓడాద తోళ్ వలియన్” ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు, అంతటి “నంద గోపాలన్” నందగోపాలుని “మరుమగళే!” కోడలా, నప్పిన్నాయ్ = సమగ్ర సౌందర్య రాశీ, నీలాదేవీ అంటూ పిలిచారు. సీతా దేవి దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు గోపికలు. “కందం కమరుం కురలి” =సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కల దానా! (మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ).”కడై తిఱవాయ్” గడియ తెరువుమా.”కోరి అరైత్తన కాణ్” = కోడి కూస్తుంది, కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. అమ్మా”ఎంగుం” =అన్నీ కోళ్ళు కూస్తున్నాయి “వంద్” = తిరుగుతూ కూస్తున్నాయి. ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా, జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్పుతూనే ఉంటారు. అటువంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అని గోదమ్మ వివరిస్తున్నారు.

భావం

నందగోపుడు మహాబలవంతుడు. ఏనుగులతో పోరాడగలిగిన వాడు. మదము స్రవించుచున్న ఏనుగు బలము కలవాడు, మదము స్రవించుచున్న ఏనుగులున్నవాడు. యుద్ధములో జంకడు. అంతటి నందగోపుని కోడలివి నీవు. నీలాదేవీ నీ నీలవేణి సుగంధాలువెదజల్లుతున్నాయి. కోళ్లు అన్నీ కూస్తున్నాయి. తెల్లవారింది. మాధవీ లత అల్లుకున్న పందిరిమీద కోకిలలు గుంపులుగా కూచున్నాయి. నీచేతిలో బంతి ఉంది, మేం వచ్చి నీ బావ గుణకీర్తనం చేస్తున్నాం. ఆనందంగా మందస్మిత వదనంతో రామ్మా, నీ సుందరమైన చేతికంకణాలు ఘల్లుమని ధ్వనిస్తుంటే తలుపు తెరువుము.

దయ అంటే ఏమిటి

మనం దయ అనే పదం చీటికీ మాటికీ వాడుతూ ఉంటాం. దయ అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసా?

దయ అంటే ఎదుటి వారు దుఃఖిస్తే వారి దుఃఖం తొలగి పోయేంత వరకు అది తన దుఃఖంగా భావించడం. వాత్సల్యం అంటే వత్సం పై కరుణ. వత్సం అంటే గోదూడ. దోడపుట్టినపుడు దానిపై ఉండే మురికిని వాత్సమ్ అంటారు. ల అంటే దాన్ని నాకి తీసేయడం. మనం తెలియకుండా మనం తెచ్చుకున్న కొన్ని దోషాలు మనపై ఆవహించి ఉంటాయి. ఆ దోషాలను తొలగించి, మనలోని మంచిగుణాలు (ఉంటే) తండ్రికి చూపించే వాత్సల్యం తల్లికి ఉంటుంది. అందుకు తల్లి తండ్రితో నిరంతరం ఎడబాయకుండా ఉండాలి. ‘‘అగలగిల్లేన్ ఇరయుమ్’’ అరక్షణం కూడా అమ్మ స్వామిని విడువదని నమ్మాళ్వార్ చెప్పారు. పరమపదంలో లక్ష్మీదేవి, భూమికి వరాహ మూర్తిగా వస్తే ఆమె భూదేవి. రాముడైతే సీత. శ్రీకృష్ణుడైతే నీళాదేవి.

అమ్మను ఆశ్రయించాల్సిందే

ఈశానాం జగతోస్య వేంకటపతే – ర్విష్ణోః పరాం ప్రేయసీం |

తద్వక్షస్థ్సలనిత్యవాసరసికాం – తత్‌ క్షాంతిసంవర్ధినీమ్‌ |

పద్మాలంకృతపాణిపల్లవయుగాం – పద్మాసనస్థాం శ్రియం | వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం – వందే జగన్మాతరమ్‌.

ఇది శ్రీ వేంకటేశుని ప్రపత్తిలో వచ్చే సంస్కృత శ్లోకం. వేంకటపతి ప్రపంచానికి తండ్రి. ఆయనకు అలమేలుమంగ అత్యంత ప్రేయసి. ఆమెకు నిత్యం వేంకటేశుని వక్షస్థలంలోనే నివాసం. అక్కడ ఉండి ఆయన హృదయాన్ని శాంత పరుస్తూ ఉంటుందట. ఆమె చేతిలో పద్మాల మొగ్గలుంటాయి. పద్మం లోనే కూర్చుని ఉంటుంది. తనముందుకు వచ్చిన భక్తుల తప్పులు అయ్యకు కనబడుతూఉంటే అమ్మ మాత్రం ఆ బిడ్డడి ప్రేమను కష్టాలను గమనిస్తూ భర్తకు, వాడు మనవాడు, మన దూడ(వత్స) కాస్త ప్రేమతో సంభావించండి అని చెబుతూ విష్ణుదయను ఆవాహన చేస్తూ ఉండడమే ఆమె పని. వక్షస్థలంలో కూచుని వత్సలను కాపాడే ఆ వత్సల్యమూర్తి జగన్మాత, ఆమెకు వందనం. ఎంత అద్భుతమైన భావన. ప్రతి ఇంటా అమ్మనే కదా బిడ్డలకు తండ్రి దయను సంపాదించి పెట్టేది.

నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి అని రామదాసు అమ్మ పురుషాకార ప్రాభవాన్ని తలచుకుని వేడుకుంటాడు. విష్ణు హృదయంలో తత్ క్షాంతి సంవర్థిని ఆమె.

శ్రీకృష్ణుడి దయ కావాలంటే ముందుగా అమ్మగారు నీళాదేవిని ఆశ్రయించాలని భావించి నీళాదేవి భవనానికి వెళుతున్నారు గోపికలు. శ్రీకృష్ణుని మేల్కొల్పి ఆయన దర్శనానుభవ సుఖాన్నిఆనందించాలన్న ఆశ తీరలేదు. ఆయన మేల్కొనలేదు. బలరాముడు లేచినా శ్రీకృష్ణుడు మేల్కొనలేదు. కనుక నీళాదేవిని ఆశ్రయించక తప్పదని గోపికలు గమనించారు. అమ్మవారిని ఆశ్రయించకుండా ఆశ్రయించే దశ పూర్తికాదు. అమ్మగారు పురుషకారం కట్టుకుంటారు. ఆమె మధ్యవర్తి. జీవుల పక్షాన నిలబడి, వారికోసం భర్త అయిన నారాయణుడికి సిఫారసు చేసే దయామయి. కనుక నీలాదేవినే ముందుగా మేల్కొల్పవలసింది అనుకుని ఆమెను ఆశ్రయించాలని గోపికలు తెలుసుకున్నారని శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు వివరించారు. ఆమె భవనం సమీపించారు.

నీళాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. మాధవీలత ప్రాకిన పందిరి మీద అనేక సార్లు కోకిలల గుంపులు  కూస్తున్నాయి. రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు, బంతి చేతులలో కలదానా. ఈ భూమి వంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అటువంటి అండాలనన్నీ కలిపితే అది బ్రహ్మాండం. అటువంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు, ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆధీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.

సీతా కటాక్షం – రామాయణ ఘట్టం

లంకలో సీత కోసం ఎంత వెదకినా దొరకకపోతే, ఆంజనేయుడు ‘‘నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దైవ్యైచ తస్యై జనకాత్మజాయై’’ అని ప్రార్థిస్తాడు. అమ్మా ఆనాడు జనకునకు ఏ విధంగా స్వయంగా దొరికావో నాకూ నీయంత నీవే కనిపించు తల్లీ అన్నాడు. అశోక వనం వైపు అతని దృష్టి మళ్లింది, ఆమె కనిపించింది.

‘‘సీతామువా చాతియశా రాఘవంచ మహావ్రతమ్’’ వనవాసానికి లక్ష్మణుడు కూడా వస్తానంటే రాముడు నిరాకరిస్తాడు. అతను సీతను ఆశ్రయించి ఆమె ద్వారా కోరితే కాదనడు. సీత వల్లనే ఆమె పాదాలు పట్టిన కాకాసురుడిని రాముడు చంపకుండా కన్ను మాత్రం హరించి వదిలాడు. సీతను కాదని రాముని పొందబోయిన శూర్పణఖ ముక్కుచెవులు కోల్పోయింది. రాముడికి దూరం చేసి సీతను పొందాలనుకున్న రావణుడు ప్రాణాలు కోల్పోయాడు. సీత విసిరిన నగల ద్వారా సుగ్రీవుడు రామునికి స్నేహితుడైనాడు. తన భార్య, కూతురు ద్వారా సీతకు సేవలుచేసి విభీషణుడు రాముని శరణాగతి పొందగలిగాడు. సీతను ఆశ్రయించి రావణుడిని వదులుకోగలిగి లంకాధిపతి కాగలిగాడు. సీత దూరమైన రామలక్ష్మణులను మాత్రమే చూచిన హనుమ కు కూడా లంకలో సీతాకటాక్షం వచ్చే వరకు పరిపూర్ణత్వం సిద్ధించలేదు.

రామదూత – రామదాసు

రావణునికి సీత చెప్పిన హితవు విన్నపుడు హనుమకు స్వస్వరూపం గురించి భగవత్స్వరూపముగురించి అర్థమైందట. అందాకా రామదూతను అనుకున్న వాడు రామదాసుడినని ఘోషించాడట. సీతాదర్శనంతో పావనమైన పావని, రాముని సర్వస్వభూతమైన ఆలింగమును పొందగలిగినాడు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles