29
గోదా గోవింద గీతం
శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై శేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ
కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!
ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నో
డుత్తోమేయావోం ఉనక్కే నాం ఆట్చెయ్ వోం
మత్తై నం కామంగళ్ మాత్త్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగుభావార్థ గీతిక
తామరవోలె మృదువుగా గుబాళించు నీ పసిడి పాదాల
వ్రాల తెలతెలవారు ఝామునే నీ కోవెలకు జేరినాము
పశువులమేపువారలకు పఱైలు పఱములేలనయ్య
మా గొల్లలకు నీ తోడినేస్తమే సమస్త సిరిసంపదలయ్య
మాకులాన జనించిన నీవు మాసేవలు కాదనరాదు
ఏడేడు జన్మల నిన్నెడబాయని సాపత్యమీయవయ్య
ఇతర వాంఛలెల్ల తుడిచివేసి నిన్నుమాత్రమే ధ్యావించి
నిన్నె సేవించి పూజించు బుద్ధి వరముగా నీయవయ్య
ఏదో ఒక మిషతో వచ్చిశ్రీకృష్ణుని లేపి, సింహాసనం మీదకు రప్పించి, మంగళం పాడి, కొన్ని ఉపకరణాలు అడుగుతారు. శ్రీకృష్ణుడు అవి ఇవ్వడానికి సిద్ధమయితే నీవే మాపుణ్యం మాకు పఱై ఇవ్వు చాలంటారు. అది మామూలు పఱ కాదు అని తెలుసుకుని శ్రీకృష్ణుడు మౌనంగా ఉంటాడు. అయ్యా మీరే మా ఉపాయం అని చెప్పి నిత్యకైంకర్యమనే ఫలం ఇవ్వమని అడుగుతారు. జన్మజన్మలకు నీ సాపత్యం, సాంగత్యం, బాంధవ్యం కావాలని అడుగుతున్నారు 29 వ పాశురంలో.సాయుజ్యం కావాలని మనసారా కోరాలి. సంసారం నుంచి దూరమై, భగవంతుడినిచేరి భగవదనుభవం పొందు గాక.
Also read: తెలివి లేమిగల గొల్లల నీవు బుట్టుటే మాభాగ్యమోయి
మా గొల్లలకు నీ తోడినేస్తమే సమస్త సిరిసంపదలయ్య
నేపథ్యం:
ఇన్నాళ్లూ పఱై కావాలని గోపికలు కోరుకున్న ప్రస్తావన కనిపిస్తుంది. నిన్న పఱై, అలంకార వస్తువులు, పరమాన్న భోజనం అడిగిన గోపికలు కాని ఆ పఱై శ్రీ కృష్ణుని శ్రీచరణాలే కాని మరేదీ కాదు. నీకైంకర్యమే పరమపురుషార్థం అని గోపికలు తేల్చారు. భగవంతుడిని పొందడానికే ఈవ్రతము. ముందు భగవత్ సంబంధులతో సంబంధం ఏర్పరచుకోవాలి. శమము దమము అనే గుణాలను అలవర్చుకుని ఆచార్యుని వద్ద సమాశ్రయణం పొందాలి. వారినుంచి మంత్రోపదేశం పొంది, మంత్రార్థము తెలుసుకుని, పురుషకారం కట్టుకొమ్మని అమ్మను ఆశ్రయించాలి.ఆమె ద్వారా స్వామియే ఉపాయమని వారి కటాక్షం సంపాదించాలి. స్వామిని దర్శించి మంగళాశాసనం చేసి, స్వరూపం జ్ఞానం మొదలైనవి కావాలని కరుణించి దయచేయమని అడగాలి. అందుకు కావలసిన అలంకారాలు ఇవ్వమని అడిగి అవి ధరించి సాయుజ్యం కావాలని మనసారా కోరాలి. సంసారం నుంచి దూరమై, భగవంతుడినిచేరి భగవదనుభవం పొందే ప్రక్రియను 27 పాశురాలలో వివరించడం జరిగింది. ప్రధానంగా తెలియవలసిన విషయాలను 28, 29వ పాశురాల్లో చెప్పి, వ్రతఫలం 30 వ పాశురంలో వివరించారు.
నారాయణనే నమక్కే పఱైతరువాన్ అని నారాయణుడే మనకు పఱ అనే వాయిద్యం ఇస్తారని మొదటి పాశురంలో చెప్పి వ్రతం ఆరంభించారు. ధర్మ అర్థ కామ మోక్షాలలో మొదటి మూడు నాలుగవ పురుషార్థమును పొందడానికి మెట్లు. భగవత్సేవ రూపంలో భగవత్ ప్రాప్తి కలుగుతుంది. అందుకే నారాయణుడే ఫలం ఇస్తాడని, ఫలమే పఱై. ఈ మాట 28, 29 పాశురంలో వివరిస్తారు. దానికి ఉపాయము శ్రీకృష్ణుడే అని 28వ పాశురంలో చెప్పారు. ఫలం పొందే అర్హత మనకే ఉన్నదని ఈ రెండు పాశురాల్లో చెప్తున్నారు. భగవానుని పొందడమే ఫలం. పఱై అంటే అదే. భగవంతుడు తప్ప మరొక ఉపాయం ఉందనుకోరాదు. అనుకుంటే అది మురికి (అపరిశుద్ధత), భగవంతుడు ప్రాప్తించిన తరువాత వేరొక ప్రయోజనం అడగడం మరొక అపవిత్రత. భగవంతుని కైంకర్యము తన కోసం అనుకుంటే అది మరొక అపవిత్రత. ఈ అపవిత్రతలన్నీ తొలగించుకోవడమే ఫలశుద్ధి. నీవే ఉపాయమనేది ఒక పరిశుద్ధి. నీవే ఫలమనేది ఫల పరిశుద్ధి. 28 వ పాశురంలో ఉపాయ పరిశుద్ధి, 29 పాశురంలో ఫల పరిశుద్ధి ప్రధానం. నోము ఒక మిష, పఱ ఒక మిష. వారికి నిజంగా కావలసింది శ్రీకృష్ణసేవ.
Also read: ద్వేషాలు వదిలేయడం శాంతికి దారి
తెల్లవారుఝాముకన్నా ముందటి బ్రాహ్మీ ముహూర్తంలో (శిట్రం శిరుకాలే) వచ్చి (వందు) నిన్ను సేవించి (ఉన్నైశేవిత్తు) నీ అందమైన పాదకమలాలకు (ఉన్ పొన్ తామరై అడి)మంగళాశాసనం చేయడానికి గల ప్రయోజనాన్ని (పొట్రుమ్ పొరుళ్) వినాలి (కేళాయ్) పశువులను మేపి (పెట్రమ్ మేయ్ త్తు) జీవించే (ఉణ్ణుమ్) యాదవకులంలో (కులత్తిల్) జనించి (పిఱందు) నీవు (నీ) మాచే (ఎంగళై) ఆంతరంగిక కైంకర్యాన్ని (కుట్రేవల్) స్వీకరించకుండా ఉండడం తగదు (కొళ్లామల్ పోగాదు) ఈ రోజు (ఇట్రై) నీవు కరుణించి ప్రసాదిస్తున్న పఱైని తీసుకొనడానికి వచ్చిన వారిమి కాము (పఱై కొళ్వాన్ అన్ఱు కాణ్). ఓ గోవిందా (గోవిందా) ఈ కాలమున్నంతవరకు (ఎట్రైక్కుమ్) ఏడేడు జన్మలకు (ఏజేజ్ పిఱవిక్కుమ్) నీతోనే (ఉన్ తన్నోడు) సంబంధం కలిగిన వారై ఉంటాము (ఉట్రేమే ఆవోమ్) నీకు మాత్రమే (ఉనక్కే) మేము (నామ్) దాస్యం చేయాలని కోరుకుంటున్నాము (ఆట్చెయ్ వోమ్) మాయొక్క (నమ్) తదితర కోరికలు (మాట్రైకామంగళ్) పోగొట్టాలి (మాట్రు)ప్రాతః వేళలు మూడు – కాలై, చిరుకాలై, శిట్రం శిరుకాలై తామసులు లేచే వేళ కాలై, గోపస్త్రీలు చేలుకుని చల్ల చిలికే వేళ చిరుకాలై, దానికన్న ముందుగా గోపబాలికలు లేచిన వేళ శిట్రం శిరుకాలే. శ్రీకృష్ణుడివియోగ దుఃఖం అనే చీకటి పోగొట్టడానికి ఉదయించే సూర్యబింబం పోలిన ముఖాన్ని శ్రీకృష్ణుడిని చూడడానికి పోతున్నందున ఇదే ఉదయమైపోయింది. ‘‘ఆవిర్భూతమ్ మహాత్మానా’’ అంటే భగవంతుడు ఆవిర్భవించిన అర్ధరాత్రి కూడా ఉదయకాలమే అవుతుంది.
బంగారంవలె ఉన్నా కఠినమైనవి కాకుండా తామర పూల వలె మెత్తనివి. వాసనలేని లోహం కాకుండా మంచి గంధపు వాసనలు విరజిమ్మేవి అమృతస్యంది అయిన నీ తిరు (శ్రీ) చరణాలను ఎందుకు కోరుతున్నాము. కిరీట ధారణ చేయాలని నీవే స్వయంగా బతిమాలినా అంగీకరించకుండా నీ చరణాలనే సేవిస్తానని లక్ష్మణుడు కోరినాడు. అదే విధంగా మాకూ నీ పాదాలమీదే ప్రియత్వం అధికంగా ఉంది. ‘‘ధనం మదీయం తవ పాద పంకజం’’ అన్నట్టు,
Also read: శ్రీకృష్ణుడుఇంద్రనీలమణి, మణివణ్ణా, భక్తులకు కొంగుబంగారం
‘‘మీ పాదాలే మాకు ధనం. మాకే ఇతర ప్రయోజనాలూ లేవు. నీ పాదసేవే మా పరమలక్ష్యం. పశువులనుమేపుకుని తినే మా కులంలో ఎందుకు పుట్టావు? దీనులైన మమ్మల్ని ఉద్ధరించడానికే కదా? కైంకర్య చేయకుండా మేముండలేము. మా సేవలను స్వీకరించకుండా నీవూ ఉండలేవు. మా సేవలు వద్దనుకుంటే మరి నీవెందుకు జన్మించావు. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది పొందాలి కదా. మాలో ఒకరిని పొందడానికి నీవు వచ్చావు. పశువులను రక్షించడానికి వేరెందరో ఉన్నారు’’ అన్నారు గోపికలు.
‘‘నేను స్వీకరించదలచిన అంతరంగ కైంకర్యాలను నాకు కావలసినపుడు నేను స్వీకరిస్తాను. మీరు వ్రతం చేసిందే పఱై కోసం కదా అదిస్తాను తీసుకువెళ్లండి’’ అని శ్రీ కృష్ణుడు అన్నాడు.
‘‘పఱై కావాలని అన్నాం కాని నిజంగా ఉళ్లో వాళ్ల కోసం చెప్పిన నెపం మాత్రమే. మాకు నీవు తప్ప మరేదీ అవసరం లేదు’’ అన్నారు.
‘‘మరి పఱై అంటే ఏమిటని మీ ఉద్దేశం. ఆ పేరుతో మీరు అడుగుతున్నదేమిటి’’ అని శ్రీ కృష్ణుడు అడిగాడు.
‘‘నీవు ఎన్ని అవతారాలెత్తినా నిన్ను సేవించి కైంకర్యంచేసే భాగ్యం మాకు కావాలి. నీవు దేవుడివైతే దేవతగానూ మానవుడివైతే మానవిగానూ జనించే శ్రీదేవి వలె మేమూ కైంకర్యం చేయాలని కోరుకుంటున్నాం’’ నీవు ఎక్కడ పుడితే అక్కడ మేముండాలి. నీకు తల్లిగా, భర్తగా తండ్రిగా,తమ్ముడిగా బంధువులుగా మేమే ఉండాలి మాకు అన్ని బంధుత్వాలు నీవే కావాలి. సీత భరతుడు నిన్ను కొన్నాళ్లు విడిపోయారు. కాని లక్ష్మణుడి వలె నిన్ను ఎప్పుడూ ఎడబాయకుండా ఉండే భాగ్యం మాకుండాలి. మా ఆనందం కోసం కాదు. మన ఇద్దరి ఆనందం కోసం కూడా కాదు. కేవలం నీ ముఖం ఆనందంతో వికసించడం కోసం నీకే దాస్యం చేస్తామని అంటున్నాం’’ అని గోపికలు అంటున్నారు.
‘‘ఇదికాకుండా మాలో పొడిచూపగల ఇతర కామభావనలన్నీ నీవే పోగొట్టాలి. భోగంలో ఇద్దరూ కలిసి మెలిసి ఉండడంలోఇద్దరికీ ఆనందం సమానంగా ఉంటుంది. కాని భోక్తవైన నీవు మాసేవలతో ఆనందించడాన్ని చూసి మేము సంతోషించాలి’’.
Also read: గుండెలో కంసుని ద్వేషమనెడు నిప్పు
నారాయణ మంత్రం
ఉనక్కు లో అకారాన్ని అనుసంధించారు. ఉనక్కే లో ఏ కారం వలన ఉపకారం వెల్లడవుతున్నది. నామ్ లో మకారార్థమైన జీవస్వరూపం ఉంది. ఉన్దన్నోడు ఉట్రోమే యావోమ్ అనడంలో నారాయణ పదం ఉంది. ఎట్రైక్కుమ్ ఏజేజు పిఱవిక్కుమ్ అట్ చెయ్ వోమ్ లో అమ్ మాట ద్వారా చతుర్థి అర్థం చెప్పారు. మట్రైనమ్ కామంగళ్ మాట్రు అనడంలో నమ శబ్దానికి అర్థం చెప్పారు. కనుక ఇది అష్టాక్షరీ మంత్రానికి వివరణఅని సర్వ మంత్ర అర్థాలను గర్భంలో దాచుకున్న పాశురమని అన్నారు. ఆచార్యులు మరో పుట్టుక వద్దన్నారు. కాని ఆండాళ్ పుట్టుక వద్దనలేదు. నీతో పాటు ఏడేడు జన్మలు మళ్లీ పుట్టాలని కోరుకున్నారు. పరమపదం కన్న మోక్షం కన్న నీ తో బంధుత్వం ఉన్న పుట్టుకే కావాలని అంటున్నది ఆండాళమ్మగారు. అదే ఆమె విశిష్ఠత. అహంకారాన్ని తొలగించడానికి కూడా అతని సాయాన్ని అనుగ్రహాన్ని అర్థించాలి. స్వామికి హృదయానందం కలిగించడమే లక్ష్యం. దానికి మనమే సాధనం. ఎప్పడికీ కైంకర్యంచేస్తున్నామన్న భావనే ఉండాలి.
చీకటి తొలగని తెల తెల వారే
జీయర్ స్వామి వారి వాఖ్యానం ఇది: గోపీజనులతో వచ్చిన ఆండాళ్ తన మూల కోరిక ఏమిటో వివరించిన పాశురం ఇది.”శిత్తుమ్ శిఱుకాలే” ఇంకా చీకటి తొలగని తెల తెల వారే సమయంలో “వంద్” మేం నీ దగ్గరికి వచ్చాం. మాలో ఆర్తి పెంచినది నీవే కదా, ఎంత కాలం నీవు చేసిన ఫలితమో ఇన్నాళ్ళకు మాకు ఈ జ్ఞానం కల్గింది. ఇది నీవు చేసిన కృషేకదా. “ఉన్నై చ్చేవిత్తు” అన్నీ నీవు చేసినవాడివి, శబరి వంటి వారిని నీవే వెళ్ళి అనుగ్రహించావు. కానీ మేం చేయాల్సి వస్తుంది. మేం నిన్ను సేవిస్తున్నాం. మనకున్న జ్ఞానంతో ఒక్క సారి మేం నీవారమని చెప్పగల్గితే, ఇది రాగ ప్రయుక్తం. “ఉన్ పొత్తామరై యడియే పోట్రుం” నీ పద్మాలవంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం.
“ఎం కించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్దకం సేవాయ” ఈ లోకంలో అల్పమైన పురుషార్దం కోసం వాడి కున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ వీళ్ల వాళ్ల చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా. “నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతసా సేవ్యె సస్య పదస్య దాసరీ సురే నారాయణే తిష్టతి” సమస్త జీవులకు నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా, ముల్లోకాలను నడిపేవాడు, చేతులు కట్టుకున్నా సరే ఒక్క సారి మనస్సులో నీవాడనని తెలిపినా పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్లుగా, మేం నీ పాదాలను పాడటనికి వచ్చాం అని చెప్పారు. ఏమీ విననట్టు సుదీర్ఘమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్లనే చూస్తున్నాడు.”పొరుళ్ కేళాయ్” మేం ఎందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాఠం చెబుతోంది గోదా. ఆండాళ్ తల్లికి పాఠం చెప్పడం అలవాటు కదా. ఆయనకీ పాఠం చెప్పగలదు. “పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు” మొదట పశువులని మేపి అవి తిన్నాకగాని మేం తినేవాళ్ళం కాదు. నీకు మా స్వరూపం తెలియదా. మరి నీవేమి చేస్తున్నావు! మాకు ఆహారం నీసేవయే, అది మాకు లభించాకే, ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి, “నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు” నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే. ఏదో వ్రత పరికరం అని అన్నారు
ఇదిగో అని అవన్నీ అక్కడ పెట్టాడు.
“ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!” మేం ఏదో ఒకటి అడగాలని అది అడిగాం, మేం కోరేవి ఇవికాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా, మా మనస్సులో ఏం ఉందో తెలియదా అని అడిగారు. నాకేం తెలియదు, నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.
ఏడేడు జన్మల నిన్నెడబాయని సాపత్యమీయవయ్య
“ఎత్తెక్కుం” ఎల్లప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వ దేశముల యందు, సర్వ అవస్థల యందు, “ఏరేర్ పిఱవిక్కుం” ఏడేడు జన్మలలో కూడా ‘‘ఉన్ తన్నోడుత్తోమేయావోమ్’’ నీతో సంబంధమే కావాలి. కాలాధీనం కాని పరమపదం లో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి “ఉనక్కే నాం అట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్” కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరి దిద్దాలి, మాపై భారం వెయ్యవద్దు.నీవే కావాలని నీతో సంబంధబాంధవ్యమే కావాలని గోదాదేవి నిర్ద్వంద్వంగా చెప్పడంతో అందరికీ వ్రతఫలితం దక్కింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది. ఈ రోజు పురుషార్థం పొందిన రోజు. ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే శ్రీకృష్ణుడు వివాహమాడిన రోజు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక ఈ రోజు”భోగి” అని శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ వివరించారు.
Also read: పరము వరమునిచ్చిమానోము నిల్పిన వరదునికి జయము