Tuesday, December 3, 2024

కిరీట, తులసీ దామపరిమళాలు జిమ్ము నారాయణుండు

మాడభూషి శ్రీధర్ – తిరుప్పావై 10

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్

తెలుగు మాడభూషి శ్రీధర్ భావార్థ గీతిక

నోములెన్నొనోచి కృష్ణసంస్పర్శస్వర్గాన తేలుతున్నావా

తలుపు తెరవకున్నపోనిమ్ము పలుకైన పలుకవేమి

కిరీటి, తులసీ దామపరిమళాలు జిమ్ము నారాయణుండు

పల్లాండు పాడిన పరవశించు పరమానందమూర్తి

పఱై నిచ్చి పర తత్త్వజ్ఞానమ్ముకూడా బోధించువాడు

రామబాణహతుడు కుంభకర్ణుడు నిద్రలో నీచేత ఓడెనా

నారీ రత్నమా మత్తులో తొట్రుపడక నెమ్మదిగ

గడియ తీయరమ్ము, నోము కై మా తోడ కలిసి రమ్ము.

నేపథ్యం

శ్రీ కృష్ణానుభవం, శ్రీ కృష్ణ సంశ్లేషమే, స్నానం. ఆయనే ధ్యానం. ఆయనే నిద్ర, సర్వస్వం కూడా. అటువంటి విశేషమైన గోపికను, జ్ఞానదీపం వెలిగించిన పేయాళ్వారులను ఈ రోజు మేల్కొలుపుతున్నారు.  శ్రీవైష్ణవంలో పొయ్ గై ఆళ్వార్, తరువాత పూదత్తాళ్వారులు, ఆ తరువాత పేయాళ్వార్ వచ్చారు. ఈ రోజు గురువాక్య పరంపరలో శ్రీపరాంకుశ దాసాయ నమః మంత్రాన్ని అనుసంధానం చేసారు గోదాదేవి. అందరూ ఒకటే అనీ, భూమిమీద నివసించే వారంతా కలిసి ఉండాలని, మంచి తనం పెంపొందించుకోవాలని, అందరినీ కలుపుకుని పోవాలని, అందరూ భగవద్గుణాభవాన్ని పొందాలని గోదాదేవి అభిలషిస్తూ ఈ వ్రతాన్ని రూపొందించారు.

Also read: హాయిగా శయనించు మామ కూతురా లేవవమ్మ

అర్థం

నోట్రు= నోము నోచి, సువర్గమ్ పుగుగిన్ఱ = స్వర్గాన్ని ప్రవేశిస్తున్నంత సుఖాన్ని ఎడతెగక అనుభవిస్తున్న, అమ్మనాయ్= అమ్మా, వాశల్= వాకిలి తలుపు, తిఱవాదార్= తీయని వారు, మాట్రముమ్ తారారో= ఒక బదులు మాటైనా మాట్లాడరా, నాట్రత్తుఝాయ్ ముడి = పరిమళాలు గుబాళిస్తున్న తులసీమాలచే అలంకృత కిరీటముగల, నారాయణన్=నారాయణుడు అనే దివ్యనామాంకితుడు, నమ్మాల్= మనచేత, పోట్ర=పల్లాండును,పాడించి, ప్పఱైతరుమ్ = మనకు ప్రాయమైన కైంకర్యాన్ని పఱైని అనుగ్రహించే వాడు, పుణ్డియనాల్= పుణ్యస్వరూపుడైన శ్రీమహావిష్ణువుచే, పండు ఒరునాళ్ = ముందొక కాలంలో, కూట్రత్తిన్ వాయ్ వీఝన్ద = యుముని నోట్లో పడిన, కుంబకరణనుమ్, కుంభకర్ణుడును, ఉనక్కే తొట్రు= నీకు ఇచ్చి వెళ్లాడా, ఆట్ర ఆనందలుడైయాయ్= గాఢమైన నిద్రను కలిగిన దానా, అరుంగలమే =దుర్లభమైన ఆభరణమా, తేట్రమాయ్ వందు= నిద్రమత్తును వదిలిచుకొని వచ్చి, తిఱ=తలుపు తీయి.

సారాంశం

నోమునోచి హాయిగా నిద్రిస్తున్న అమ్మా, వాకిలి తలుపు తీయకపోతే పోయే కనీసం మాటైనా మాట్లాడకూడదా, కిరీటంలో తులసిమాలను ధరించి నారాయణ దివ్యనామంతో భాసిల్లేవాడు, మనకు పల్లాండు పాడే అవకాశం కల్పించి మనకు పఱైని లేదా పరాన్ని అనుగ్రహించేవాడు ధర్మం మూర్తీభవించిన వాడు అయిన శ్రీ మహావిష్ణువు, అతని చేతిలో పడి యముని జేరిన కుంభకర్ణుడు అంతకు ముందే నీతో ఓడిపోయి తన గాఢనిద్రను నీకు ఇచ్చాడా ఏమి? సొగసుగా నిదురించే దానా, దొరకని ఆభరణమా, నిద్రమత్తువదిలించుకుని తలుపు తెరువమ్మా.

Also read: కృష్ణుడి కోసం వెళ్లడమే ఫలం అనీ అదే వ్రతం

వివరణ

శ్రీకృష్ణుడిని చేరి ఆయన ఇస్తానన్న వ్రత పరికరాలకోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోప బాలికను గోష్టిలో చేరుస్తున్నది గోద. ఈమె అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రేమ అని తెలిసి జ్ఞానంతో కూడిన భక్తి కలిగిన ఈమెఇంటికి  చేరుకుని సుప్రభాతం పాడి తమతో రమ్మంటున్నారు.

గోద: నోట్రు అమ్మానాయ్ ..ఏవమ్మా మాతో చేరి నోము నోచుదామని చెప్పి, నీవు ముందే వ్రతం ముగించి శ్రీ కృష్ణానుభవమనే స్వర్గాన్ని అనుభవిస్తున్నావా. నీతో కలిసి జీవించడమే స్వర్గం, విడిచి ఉండడమే నరకం అని రాముని గురించి చెప్పింది. గోపికలకు కూడా స్వర్గమంటే శ్రీకృష్ణానుభవమే. ఆ అనుభవంలో లీనమైన వారికి స్వర్గం లెక్కలోకి రాదు. వీళ్ల దృష్టిలో వ్రతమంటే శ్రీ కృష్ణుడే తమకు ఉపాయమనుకుని ఎదమీద చేయి వేసుకుని హాయిగా నిదురించడమే. ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం. ఆయనలో సకలం ఉన్నట్లేకదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. “తేషాం రాజన్ సర్వ యజ్ఞాః సమాప్తాః ” ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు (త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి వివరణ) భగవంతుడి నిజస్వరూపం తెలుసుకున్నారంటే అన్ని నోములూ నోచుకున్నట్టే.

Also read: “కవ్వాల యవ్వనులు చిలుకు సవ్వడులు” దధిమధన

అందరినీ కలుపుకుని భగవద్గుణాభవాన్ని పొందాలి

గోద: అమ్మనాయ్, నీవు మా అందరికీ నాయికగా ఉండడం అందంగా ఉంది. రక్ష్యారక్షక భావాన్ని నిరాకరించకు తల్లీ, మేం మాత్రం వదలము’’ అన్నారు.

గోపిక: (ఈమాటలు విన్న గోపిక ఆనందాతిశయంతో మౌనంగా ఉందట, మరో అర్థం. ‘‘వీరికి చెలికత్తెను నేను, నన్ను అమ్మనాయ్ అంటున్నారు’’, అని కూడా మౌనంగా ఉందట.

గోద: ‘‘తలుపు తెరవకపోయినా బదులైనా ఇవ్వవా’’ అని బయటనుంచి అడిగారు.

మాట్రముమ్ తిఱవాదార్= ‘‘తలుపు మూస్తే మాట కూడా మూయాలా? కళ్లకు కష్టం ఇచ్చినట్టు, చెవులకు కూడానా? మీరు సుఖానుభవంలో ఉంటే మా గురించి చింతించరా ఏమి? శ్రీకృష్ణునికి సర్వం సమర్పించినప్పుడు మాకు కనీసం మాటలు వినే భాగ్యమైనా కలిగించవా తల్లీ’’.

‘‘మాట్రముమ్ తారారో… విచ్చేయండని స్వాగతం చెప్పాలనేం లేదు. చెప్పండి అని ఓమాటన్నా చాలు. లేదా కోపంగానైనా ఒక మాట చెప్పండి’’. అని గోపికలు అడిగారు.లోపలి గోపిక: ‘‘శ్రీకృష్ణుడికి సర్వం సమర్పించినానని అంటున్నారే, శ్రీకృష్ణుడైమైనా ఇక్కడున్నాడా?’’ఆనందరూపుడైన వాడు కృష్ణస్వామి, ఆయనే ఆనందము కూర్చేవాడు, ఆయనను తలుచుకుంటూఆనంద స్థితిలో ఉన్నందున గోపిక బదులు పలకలేదట. బయటవారేమో శ్రీ కృష్ణుడు లోపల ఈమెతో ఉన్నాడనీ అందుకే బయటకు రావడం లేదని అనుకుంటున్నారట.

గోద, బయటి గోపికలు: ‘‘నాట్రత్తుఝాయ్ ముడి.. నీవు దాచాలన్నా శ్రీకృష్ణుడి కిరీటం చుట్టిన తులసీ మాల సుగంధాలు వెదజల్లుతున్నాయి కదా. నీవలెబహిర్గతం కాని తత్త్వమా ఆయనది’’. తులసి అంటే శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతి. తులసి విష్ణుపత్ని. తులసీ వనములు ఉన్నచోట శ్రీ హరి తప్పక ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తులసీ పరిమళం ఉంటుంది.

లోపలి గోపిక: ‘‘శ్రీ కృష్ణుడు ఇదివరకొకసారి నన్ను కౌగిలించుకున్నప్పుడు అంటిన తులసి వాసనల సౌరభం అది.  తులసీదామ భూషణుడి వాసన చూసి ఆయన లోపల ఉన్నాడనడం సరికాదు. అదీగాక నిన్న సాయంత్రం నుంచి అక్కడే మీరు కాపలా ఉన్నట్టున్నారు. మీకు తెలియకుండా శ్రీకృష్ణుడు లోనికెలా వస్తాడుచెప్పండి’’. అది తులసీ దళ పరిమళమే కాని తులసీ ప్రియుడైన శ్రీ కృష్ణుడు ఇక్కడ లేడు.

బయటి గోపికలు: ‘‘నారాయణన్..సకల చేతన అచేతన వస్తుజీవములలో లోన పైన వ్యాపించియున్న నారాయణునికి తలుపులు అడ్డమా? సర్వవ్యాపి కనుకఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం కాగలడు. నమ్మాల్ పోత్తప్పఱై తరుం….దేవతలకే అందని ఆ కృష్ణ స్వామి మనవంటి సామాన్యులందరికీ సులభంగా అదేవాడు. పుణ్నియనాల్… పుణ్యాన్ని ఉదారంగా అందరికీ ఇచ్చేవాడు కదా నీ ఒక్క దాని  దగ్గరే పెట్టుకోవడం సబబా?

Also read: కాలుజాడించి తన్ని శకటాసురుని లీల గూల్చినాడు

బయట గోపికలు: ‘‘నాట్రత్తుఝాయ్ ముడినారాయణన్ = ‘‘పరిమళ భరిత తులసీమాలాధరుడైన వాడు నిన్ను ఒక్కసారి కౌగిలించుకుంటే చాలు ఆ వాసన జన్మజన్మాలకూ వీడదు కదా’’.

లోపలి గోపిక మాట్లాడలేదు. మనం జవాబులు ఇస్తూ ఉంటే ‘ప్రతిదానికీ జవాబిస్తూ ఉందే’ అనుకుంటుందని మాట్లాడడం లేదేమో.

బయటి గోపిక: పండొరునాళ్ ఇదివరకు ఒకనాడు కూత్తత్తిన్ వాయ్వాళంద కుమ్బకరణనుం….. కుంభ కరణుడు మృత్యువునోట్లో దూరాడు. అందరినీ రక్షించే రాముడుకుంభకరణుడిని ఎందుకు చంపుతాడు. ఆయనే నడిచి వచ్చి రాముని తో యుద్ధానికి దిగి దీపకాంతికోసం వచ్చి ఆహుతైన కీటకం వలె మృత్యు ముఖంలో తలదూర్చాడు.తొత్తు ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో… ఎంత చెప్పినా నిద్రలేవడం లేదంటేఆ కుంభకర్ణుడు మరణిస్తూ తన నిద్రను నీకిచ్చాడా ఏమి?’’ అని వ్యంగ్యంగా పలుకుతారు గోద.

వింధ్య పర్వతం పెరుగుదలను వంచిన
అగస్త్యుడి గొప్పదనం
ఆ తరువాత దివ్యజ్ఞాని అగస్త్యునితో లోపలి గోపికను పోలుస్తూ మాట్లాడతారు వారు.అగస్త్యుడు కూడా ఓడి పోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా ఏమి అని అంటుంది.కుంభంను కరణముగా కల్గిన వ్యక్తి, అగస్త్యుడు ఒక కుండలో పుట్టిన వాడు. కేదార్ నాథ్ సమీపంలో త్రియుగ్ నారాయణ్ వద్ద పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చూడడానికి అందరితో వచ్చినట్టు అగస్త్యుడు హిమాలయపర్వతాన్ని పైకి ఎక్కుడూతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. మరో సందర్భంలో వింధ్య పర్వతం మేరు పర్వతంతో పడి విపరీతంగా పెరుగుతూ ఉంటే, సూర్యగమనాన్ని కూడా అడ్డుకుంటాడేమోనని భయపడి, వింధ్య పెరగడాన్ని నిలిపి వేయాలని దేవతలంతా అగస్త్యుని వేడుకున్నారు. అగస్త్యుడు వింధ్య పర్వతం సమీపించగానే, గురువుకు వంగి నమస్కారం పెట్టాడట. మహాముని, సరే ఇట్లాగే ఉండు, ‘తథాస్తు’ అన్నారు. అంతే అక్కడే వంగి పోయాడు. వింధ్య పర్వతం పెరుగుదలను ఆవిధంగా ఆయన వంచినాడు.  అని పెరుగుదలని వంచాడు. ఒక్కొక్క పర్వతానికి అధిష్ఠాన శక్తివిశేషం ఉంటుంది. దాన్ని బట్టే ఒక్కో పర్వతానికి విశిష్టత చేకూరుతుంది.
అగం అంటే పర్వతం,  స్తంభింపచేసిన వాడు అందుకే ఆయన పేరు అగస్త్య. మరొక అర్థం ఏమంటే మనలో పెరిగిపోతున్న పాపపు కొండలని స్తంభింపజేసే శక్తి గల మహాముని. అగస్త్యుని గొప్పతనాలు ఇంకా చాలా ఉన్నాయి.  మొత్తం సముద్రాన్ని పానం చేసినశక్తి శాలి. ద్రావిడ భాషకంతటికి వ్యాకరణ సూత్రాలను రచించిన మహ జ్ఞాని. వాతాపి అనే రాక్షసుడిని కడుపులోనే జీర్ణింపచేసి సంహరించిన అద్భుత ముని.

గోద (లోపలి గోపికతో) అంతటి  మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా? ‘‘లోపలనుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నిన్ను శ్రీకృష్ణ సేవనుండి మేం వేరు చేయటంలేదు. నీ మాట ఒక్కటే చాలు మాకు. అదే మా ప్రాణం కాపాడుతుంది.

పిచ్చి ఆళ్వార్ జ్ఞానం పొందాలనుకొనే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష అని జీయర్ వివరించారు.ఈ పాశురంలో పేయాళ్వార్ గురించి ప్రస్తావించారు. 1. పొయగై ఆళ్వారు, (సరోయోగి) 2. పూదత్తాళ్వార్, (భూతయోగి) 3. పేయాళ్వార్ (మహాయోగి) అను ముగ్గురు ముదలాళ్వార్లు. వీరు ముగ్గురు ద్వాపరయుగంలో అవతరించినారు. పేయాళ్వార్లు చెన్నపట్టణానికి సమీపంలో మైలాపూర్ లో నున్న ముణికైరవమను బావిలో ఎర్రకలువ పువ్వులో ఆవిర్భవించినారు. వీరికి భగవంతుని మీద విపరీతమైన ప్రేమ ఉండి లోకులకు పిచ్చిగా కనిపించేవారు. జడభరతునివలె అంటే మూగవానిలా, జడునిలా, గ్రుడ్డివానిలా, చెవిటివానిలా, పిచ్చెక్కినవానిలా భగవంతుని మీద పాటలు పాడుతూ సంచరించేవారు. వీరిని పేయాళ్వారని పిలిచేవారు. “పేయ్” అంటే పిచ్చి అని అర్ధం. వీరి భక్తినిష్ఠను పరీక్షిద్దామని ఓసారి పార్వతీ పరమేశ్వరులు వచ్చారట. తామెవరో వెల్లడించి, ఆది దంపతులు ఏదైనా వరం కోరుకొమ్మన్నారట. భగవంతుడిని మించి కోరుకునేదేమిటి అని ఆలోచించి, సరే నాకు బొంత కుట్టుకోవడానికి కష్ఠం అవుతున్నది. ఈ సూదిలోకి దారం ఎక్కించి పెడతారా అని వరం కోరుకున్నాడట. ఆయనకు ఏ అవసరాలు లేవని, భగవంతుడిని తప్ప ఏదీ కోరబోరని ఇది సంకేతం. పేయాళ్వార్ అమితమైన భక్తికి మెచ్చి సాక్షాత్ శ్రియః పతి సర్వాభరణ భూషితుడై, సపరివార సమేతంగా సాక్షాత్కరించాడు. పేయాళ్వారులు తిరుక్కోవలూర్ లో ఉన్న స్వామి శ్రీ త్రివిక్రమన్ (వామనుడు) దర్శించి ఆనంద పరవశులై ఈ క్రింది పాశురమును పాడినారు. “తిరుక్కణ్డేన్ పొన్ మేని కణ్డేన్ తిఱయుమ్
అఱుక్కన్ అణి విరముం కండేన్ శెరుక్కిళరుం
పొన్నాయ్ కండేన్ పురిశంగం కైక్కణ్డేన్
ఎన్నాయ్ వణ్ణన్ పాలిన్దు.

తొలి ముగ్గురు ఆళ్వారుల సమాగమం

శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు ఆళ్వారులు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు. వీరు పాడిన (రచించిన) పాశురాలు అన్నీ (నాలుగు వేలు) కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అంటారు. భక్తి, పారవశ్యము, శరణాగతి – ఇవి ఈ ఆళువారుల జీవితంలోనూ, రచనలలోనూ, కనిపిస్తాయి.

మొత్తం పన్నెండుమంది ఆళ్వారులలో పొయ్‌గయాళ్వార్ (సరోయోగి), పూదత్తాళ్వార్ (భూతయోగి), పేయాళ్వార్ (మహాయోగి) – ఈముగ్గురూ ప్రథములు. కనుక వారిని ముదలాళ్వారులు అంటారు. ఆళ్వారుల జీవిత కాలాల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు దొరకడం లేదు. ముదళాల్వారులు ద్వాపర యుగాంతంలో ఉద్భవించారని సంప్రదాయ గాథలు. కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం 7వ శతాబ్దం – 9వ శతాబ్దం మధ్యకాలమని ఆలోచన.

1. పొయ్‌గయాళ్వార్

ఆళ్వారులలో మొదటివారుపొయ్‌గాళ్వార్. సంప్రదాయ గాథల ప్రకారము ఇతడు ద్వాపర యుగమున 8,60,900వ సంవత్సరాన ఉన్నారు. కాంచీనగరములో యధోక్తకారి సన్నిధిలో పుష్కరిణిలో తామర పుష్పములోపలో అవతరించారు. ‘పొయ్‌కై’ అనగా చెరువు. సరసునందు అవతరించినాడని ‘పొయ్‌కై ఆళ్వార్’ అన్నారు. కాసార యోగి, సరోయోగి అనుకూడా పిలిచేవారు. శ్రీ మహా విష్ణువు శంఖమైన పాంచజన్యపు అంశావతారమని భక్తుల విశ్వాసము.

పొయ్‌గైయాళ్వారుల ఆచార్యుడుమరోపేరు భూతాహ్వయుడు, లేదా మల్లపురాధీశుడు.నేనముదలియార్ (విష్వక్సేనుడు). తిరువారాధనము ఆళ్వాకళ్‌నైనార్. ఆయన గారి జన్మస్థలం, మహాబలిపురము, ఆయన దైవాంశ -కౌమోదకి (విష్ణువు గద). రచనలు: ఇరణ్డాన్, తిరువందాది.

2. పూదత్తాళ్వార్.

ఆల్వారులలో రెండవవాడు పూదత్తాళ్వార్. సిద్ధార్ధి సంవత్సరము ఆశ్వయుజ మాసము శుద్ధ నవమి బుధవారము ధనిష్ఠా నక్షత్రమున (పొయ్‌గై ఆళ్వారు అవతరించిన మరుసటినాడు) మహాబలిపురము (తిరుక్కడల్మల్లై) లో బండి గుఱిగింజ పూవులో అవతరించాడు. ‘పూతము’ అనగా యథార్థము, ఆత్మ అని అర్ధాలు. తన పాశురాలలో యథార్థమును చెప్పినందువలనా, సర్వేశ్వరునికి ఆత్మగా ఉన్నందువలన ఇతనికి ‘పూదత్తాళ్వార్’ అన్నపేరు వచ్చింది. భూతాహ్వయుడనీ, మల్లపురాధీశుడనీ     అని కూడా అంటారు. శ్రీ మహా విష్ణువు గదాయుధమైన కౌమోదకికి ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము.

ముక్తగ్రస్త గేయాలు

ముగ్గురు ఆళ్వారులు భగవద్దర్శనము కలిగి పులకించినపుడు పూదత్తాళ్వార్ పాడిన నూరు పాశురములు ‘ఇరణ్డాన్ తిరువందాది’. వీటిని రెండవ వంద ముక్తగ్రస్త గేయాలు  అని పిలుస్తారు. దివ్య ప్రబంధాలలో ఇవి రెండవ భాగము. ప్రతి పాశురమునకు చివరి పదము (అంతము) తరువాతి పాశురమునకు మొదటి పదము (ఆది) గా ఉంటాయి. వలన ఈ పాశురములు “అంత ఆద లేదా అందాది” అనేవారు. ఈ ఇరణ్డాన్ తిరువందాదిలో శ్రీరంగము, తిరుమల, మహాబలిపురము, తిరుక్కోవలూరు, కంచి, అడకసింగరు, తిరుక్కోట్టియూర్, తిరునీర్మలై దివ్య దేశములలోని సర్వేశ్వరుని  స్తుతినారు.  పూదత్తాళ్వార్ తిరుక్కోవలూర్‌లో పరమపదించాడు.ఈ ఆళ్వారు తిరునక్షత్ర తనియన్:

తులా ధనిష్ఠా సంభూతం | భూతం కల్లోలమాలినః ||

తీరే ఫుల్లోత్పలేమల్లా | పుర్యామీడే గదాంశకం ||

మల్లాపుర వరాధీశం | మాధవీ కుసుమోద్భవమ్ ||

భూతం నమాఙియోవిష్ణోః | జ్ఞానదీపమకల్పయత్ ||

3. పేయాళ్వార్

ఆళ్వారులలో మూడో వారు పేయాళ్వార్. మహదాహ్వయుడు, మైలాపురాధీశుడు అని కూడా పిలిచేవారు.(పొయ్‌గై ఆళ్వారు అవతరించిన రెండవనాడు, పూదత్తాళ్వార్ అవతరించిన మరుసటినాడు) సిద్ధార్ధి సంవత్సరము ఆశ్వయుజ మాసము శుద్ధ దశమి గురువారము. జన్మస్థలం, మైలాపూరు. వారిది దైవాంశనందకము. రచన మూన్ఱాన్ తిరువందాది. పేయాళ్వార్ చెన్నపట్టణం సమీపంలోని మైలాపురిలో మణికైరవం అనే బావిలో ఎర్రకలువ పుష్పంలో అవతరించాడు. భగవధ్యానములో మైమరచి పిచ్చివానివలే సంచరించినందున ఇతనికి ‘పేయ్’ (పిచ్చి) ఆళ్వార్ అనే పేరు వచ్చింది. మహదాహ్వయుడనీ, మైలాపురాధీశుడనీ ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు ఖడ్గమైన నందకమునకు అంశావతారమని అంటారు.  పేయాళ్వార్ ఆచార్యుడు నేనముదలియార్ (విష్వక్సేనుడు). తిరువారాధనము ఆళ్వాకళ్‌నైనార్. వారి శిష్యుడు తిరుమళిశయాళ్వార్ (భక్తిసారుడు).

ఒకేసారి భగవంతుడు దర్శించి పులకరించిపోయిన పేయాళ్వార్ పాడిన నూరు పాశురములు ‘మూన్ఱాన్ తిరువందాది’ (మూడవ వంద ముక్తగ్రస్త గేయాలు) అనేవారు. దివ్య ప్రబంధాలలో ఇవి మూడవ భాగము. ప్రతి పాశురమునకు చివరి పదము (అంతము) తరువాతి పాశురమునకు మొదటి పదము (ఆది) గా నుండుట వలన ఈ పాశురములు “అందాది” అనబడ్డాయి. ఈ మూన్ఱాన్ తిరువందాదిలో శ్రీరంగము, తిరువల్లిక్కేణి, కాంచి, తిరుమలై, తిరువెక్కావేళుక్కై, తిరుక్కుడన్‌దై, తిరుక్కోట్టియూర్ దివ్య దేశములలోని సర్వేశ్వరుని స్తుతించినారు.  పేయాళ్వార్ గారు తిరుక్కోవలూర్‌లో పరమపదించాడు.

ఓ వెలుగై అవతరించిన నారాయణుడు ముగ్గురు ఆళ్వారులను చూచిన వాడు

తొలి ముగ్గురు ఆళ్వారుల గొప్పతనాన్ని వివరించే ఒక సంఘటన ఉంది. తిరుక్కోవలూరు గ్రామంలో పేయాళ్వార్ (సరోయోగి) ఒక చిన్నగదిలో శయనించి ఉన్నారు. బయట హోరున వర్షం కురుస్తున్నది. తలదాచుకోవడానికి భూతయోగి లోనికి వచ్చారు. ఒకరు పడుకోవడానికి సరిపోయే చిన్నస్థలం లో ఇద్దరు కూర్చోవచ్చుకదా రండి స్వామీ అని  అని భూతయోగిని సరోయోగి రమ్మన్నారు. మరి కాస్సేపడికి  మూడో ఆళ్వారు మహాయోగి వచ్చారు.వారు కూడా లోపలికి రావలసిన పరిస్థితి. ఫరవాలేదు ఇద్దరు కూర్చునే స్థలంలో ముగ్గురు నిల్చోవచ్చు కదా..అంటూ ఆయన్ను రమ్మన్నారు.

ఆ రాత్రిపూట – కన్ను పొడుచుకున్నా కానరాని ఆ కటిక చీకటిలో – ఈ ముగ్గురూ భగవత్ గుణాన్ని  మైమరచి పోయారు.  శ్రీ హరి ఉన్నట్లుండి అదృశ్యరూపంలో వచ్చి వారినడుమ నిలిచి చిందులు వేయసాగాడు. తమ మధ్య మరొకరు ఉన్నారని ఆళ్వారులు వారు గ్రహించారు.ముగ్గురు యోగిపుంగవులు ఒకచోట చేరుకుని నిలబడి ఉండడం అనేది చాలా గొప్పవిశేషం. ఇంతటి మహాపురుషులు ఒక్కచోట ఉన్న విశేష దృశ్యాన్ని చూద్దాం అని శ్రీమన్నారాయణుడే అక్కడికి నాలుగో వ్యక్తిగా, ఆళ్వారుల స్పర్శాసుఖం అనుభవించేందుకుఒక వెలుగై ఆ అంధకారలో విచ్చేసారని, ఆ వెలుగును బట్టి ఆయన రాకను తెలుసుకున్న ఆ ముగ్గురు ఆళ్వారులు కలసి మంగళం పాడినారు, అప్పుడే ముదల్ తిరువందాది (పేయ్), ఇరండామ్ తిరువందాది, మూన్రామ్ తిరువందాది (పూదత్త) పాశురాలు వెలువడ్డాయి.

అపుడు పొయ్‌గయాళ్వారు ఆ మహామూర్తిని గుర్తించటానికి ఒక దివ్యదీపం వెలిగించాడు. కవిగా ఊహించి భూమిని ప్రమిదగా చేసి, దానిలో సముద్రజలం అనే నెయ్యిపోసి, ఉష్ణకిరణాలతో వెలిగే సూర్యుణ్ణి వత్తిగా వేసిన దీపంతో సుదర్శన చక్రధారియైన స్వామిని అర్చిస్తానన్నాడీ.

వైయం కళియా వార్ కడలే నెయ్యాక

వెయ్యకతిరోన్ విళక్కాక – శెయ్య

శుడరాళియా నిడిక్కే శూట్టినేన్ శొన్మాలై

ఇడలాళి నీంగుక వే యెంగు

తాళ్ళపాక తిరువేంగళనాధుడు రచించిన పరమయోగి విలాసములో ఈ పాశురమునకు ఈ విధంగా మహానుభావులు అనువదించారు.

ధరణి పంతియ సముద్రంబులు నేల

యరుణు దీపము జేసి యరుణాంశ తతుల

గారాబు చక్రంబు కైబూన్చినట్టి

నీరజాక్షునకిత్తు నీరాజనంబు

ఆ తరువాత పూదత్తాళ్వారులు తమ హృదయంలోనే ప్రజ్వలిస్తూ ఉన్న ఙ్ఞానదీపంతో ఆ శ్రీపతి కిట్లా నివాళి పట్టాడు:-

అన్బే తకళియా ఆర్వమే నెయ్యాక

ఇన్బురుకుశిందై ఇడుతిరియా – నన్బురుకి

జానచ్చుడర్విళ క్కేత్తినేన్ నారణ్ర్కు

జానత్తమిళ్ పునిందనాన్

భక్తిని ప్రమిదగా చేసి, ఆర్తిని నెయ్యిగా దానిలో పోసి, భగవత్సందర్శన జనితానందం అందులో వత్తిగావేసి, అఙ్ఞానాంధకారం దూరం అయ్యేటట్లుగా పరభక్తి అనే ఉజ్జ్వల దీపాన్ని నిండుమనస్సుతో అర్పించి ఆ శ్రీ హరిని అర్చిస్తున్నాను అని దీని అర్థం.తాళ్ళపాక తిరువేంగళనాధుడు రచించిన పరమయోగి విలాసములో ఈ విషయాన్ని వర్ణించారు.

…. … … ప్రేమ

పంతియ మితి లేని భక్తియే చమురు

నానంద భరిత హృదబ్జంబె వత్తి

గానొనరించి వికాసమై యాత్మన్

తిరమొందు జ్ఞానంబు దీపంబు జేసి

పెరియ నారాయణార్పితము గావించె

ఈ ఇద్దరు భక్తులూ వెలిగించిన ఙ్ఞానదీపం ఆధారంగా పేయాళ్వారులు ఆ భగవానుని దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కన్నుల కరువు తీరా సందర్శించాడు. ఆ శుభక్షణంలో అయత్నంగా వెలువడిన సుమథుర వాణియే ఇది:-

తిరుక్కండెన్ పొన్మేనికండేన్ తికళుమ్

అరక్కన్ అణినిరముంకండెన్

పొన్నాళికండేన్ పురిశంగం కైక్కండేన్

ఎన్నాళి వణ్ణన్ పొల్ ఇంగు

అహో! శ్రీమహాలక్ష్మితోపాటు శ్రీహరి సువర్ణ శరీరసౌందర్యం ప్రత్యక్షమైంది నాకిప్పుడు. పాపాత్ముల్ని చేధించే సుదర్శనాయుధం కూడా స్వామి చేతిలో ఉంది. అంతేకాదు – ప్రళయకాలాభీల వర్జవ్యగర్జ ననుకరించే పాంచజన్యాన్ని సైతం కాంచగల్గిన సుకృతిని పొందాను. ఇట్టి నాకింకేమి కావాలి!

తాళ్ళపాక తిరువేంగళనాధుడు గారు పరమయోగి విలాసములో ఇంకా ఈవిధంగా విరించారు.

సిరి గంటి చెన్ను మించిన మేను గంటి

కరమొప్పు వదన వికాసంబు గంటి

సల్లలితావనీస్తన కుంభశుంభ

పల్లవంబులబోలు పాదముల్గంటి

సరసీజ హల శంఖ చక్రాంకుశాంక

చరణముల్ జగదేక శరణముల్ గంటి

ధరణీ బింబము చాయ దరళించు కనక

సురుచిరాంశుకము నంశుకము గన్గొంటి

శ్రీ మించు కటితట శ్రీ సతీవరణ

దామముల్ మేఖలా దామముల్గంటి

వాత్సల్య జలధి కైవడి నొప్పుచున్న

వత్సంబు గంటి శ్రీవత్సంబు గంటి

చుట్టు కైదువు వలచుట్టు శంఖంబు

పట్టి చూపట్టిన బాహువుల్గంటి

శీతాంశు మండల శతకోటి కోటి

రీతి జూపట్టు కిరీటంబు గంటి

మలగులై తెల్ల దామరల దామరలన్

గలహించు నిడువాలు గన్నుల గంటి

మకర కుండల బాల మార్తాండ రుచుల

వికసించు వవదనార విందంబు గంటి

ఆ మహనీయుల భగవద్దర్శన కాంక్ష ఒకేమారు నెరవేరింది – అని శ్రీవైష్ణవ సంప్రదాయ గాథలలో చెబుతారు.

(శ్రీ తిరుమంగై ఆళ్వార్, దివ్యదేశ వైభవ ప్రకాశిక – కిడంబి గోపాల కృష్ణమాచార్యుల రచన – ఎన్.వి.ఎల్.ఎన్.రామానుజాచార్యుల ఆంధ్ర వివరణ, దివ్య ప్రబంధ మాధురి – కె.టి.ఎల్.నరసింహాచార్యులు, ద్వాదశ సూరి చరిత్ర – కె.టి.ఎల్.నరసింహాచార్యులు, ఆళ్వారాచార్యుల సంగ్రహ చరిత్ర – పాలవంచ తిరుమల గుదిమెళ్ళ వేంకట లక్ష్మీనృసింహాచార్యులు ఈ విధంగా రచించారు.)

ఆ నారాయణుని వెలుగే తొమ్మిదో పాశురంలో వెలుగని గోదాదేవి ప్రస్తావించినారు. అయితే ఈ పాశురంలో గోద నిద్రలేపే గోప బాలిక నిజానికి తామస నిద్రలో లేదు. నిరంతరం భగవంతుని తలుస్తూ ఆయన గుణాలను అనుభవిస్తూ కళ్లు మూసుకుని మౌనంగా ఉన్నారామె. అది శ్రీ కృష్ణ సంశ్లేషమనే  నిద్ర. ‘‘నీవు మాకు శిరోభూషణురాలివి. నిద్రలోనుంచి ఒక్క ఉదుటున లేవకు తల్లీ, తొట్రుపడతావేమో. కాస్త సంభాళించుకో సర్దుకో,తరువాతే తలుపు తెరుద్దువుగాని’’ అని గోదమ్మ ఆమెకు విన్నవించుకుంటున్నఘట్టం.

Also read: యశోద గోరుముద్దలగోరు నవనీతచోరు విష్ణుమూర్తి

అనువాదం: మాడభూషి శ్రీధర్
Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles