- కృతకమైన ఎత్తుగడలకూ, దూషణలకూ దూరంగా ఉండాలి
- నిజాయితీ, నిబద్ధత ప్రజలకు కనిపించాలి
- పేదలను ప్రేమించాలి, వారి సమస్యల పట్ల అవగాహన కనబరచాలి
- శుక్రవారం, 27న, ప్రారంభం కానున్న ‘యువగళం’ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు శుక్రవారంనాడు సుదీర్ఘమైన పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. దానికి ‘యువగళం’ అని నామకరణం చేశారు. నాలుగువందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు సాగే ఈ మహాపాదయాత్ర కుప్పంలో ఆరంభమై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. ఈ ప్రాంతంలో ఏ తెలుగు నాయకుడు పాదయాత్ర చేసినా, ప్రారంభించే ప్రాంతం ఎక్కడైనా ముగించేది మాత్రం ఇచ్ఛాపురంలోనే. వచ్చే సంవత్సరం 2024లోనే లోక్ సభకూ, అసెంబ్లీకీ ఎన్నికలు జరగున్న కారణంగా లోకేష్ పాదయాత్రకు ప్రాధాన్యం ఉంది. ప్రజల మధ్య నడవడం, మాట్లాడటం, కలిసిపోవడం, సరదాగా, సంతోషంగా కనిపించడం, ప్రజల కష్టనష్టాలను అర్థం చేసుకోవడం పాదయాత్రలో ముఖ్యమైన అంశాలు. గతంలో పాదయాత్రలు సత్ఫలితాలు ఇచ్చాయి. నారా లోకేష్ మాతామహుడు ఎన్ టి రామారావు పార్టీ నెలకొల్పిన తొమ్మిది మాసాలలోనే రాష్ట్రం అంతా చైతన్యరథంలో కలియదిరిగి వేల ఉపన్యాసాలను కోట్లాదిమందికి వినిపించి అధికారం అట్టహాసంగా కైవసం చేసుకున్నారు. మూడున్నర దశాబ్దాలకు పైగా వేళ్లూనుకున్న కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్ళతో పీకివేశారు. ప్రజలతో ఆయన చేసిన సంభాషణ చరిత్రాత్మకమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలు ఫలాలు ఇచ్చాయి. జగన్, షర్మిల పాదయాత్రల లక్ష్యం జగన్ కు అధికార ప్రాప్తి కనుక వారిద్దరి లక్ష్యం నెరవేరినట్టే లెక్క.
వైఎస్ రాజశేఖరరెడ్డి చేవెళ్ళ నుంచి ఇచ్ఛాపురం వరకూ 1600 కిలోమీటర్లు నడిచారు. అనంతరం చంద్రబాబునాయుడు 208 రోజుల్లో 2,840 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అప్పుడే వైఎస్ షర్మిల ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 3000 కిలో మీటర్లు నడిచారు. ఆమెది నిరంతర పాదయాత్ర. తెలంగాణలో రాజకీయ పార్టీ వైఎస్ఆర్ టీపీ నెలకొల్పిన తర్వాత తెలంగాణలో సైతం పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రను నమ్ముకున్న రాజకీయవాదులు చెడిపోరని ఆమెకు గట్టి నమ్మకం. తర్వాత జగన్ మోహన్ రెడ్డి 341 రోజులపాటు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
నర్మదాబచావ్ పేరు మీద మేథాఫాట్కర్ చేసిన పాదయాత్ర మినహా దేశంలో మరో మహిళ ఎవ్వరూ షర్మిల చేసినన్ని రోజులు, అన్నికిలోమీటర్లు నడిచిన దాఖలా లేదు. లోకేష్ తన ప్రత్యర్థి జగన్ కంటే ఎక్కువ రోజులు, ఎక్కువ దూరం నడవాలని సంకల్పించారు.
తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు
పాదయాత్ర చేసేవారికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం, నిబద్ధత, ప్రజలు చెప్పేది వినే సహనం, అధికారపక్షంలోని లోపాలను తెలివిగా ఎండగట్టడం, స్వోత్కర్షను దూరంగా ఉంచడం అవసరం. నారా లోకేష్ వ్యక్తిత్వం ఉన్నతీకరణకు పాదయాత్ర దోహదం చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. నిజానికి పాదయాత్ర ఒకానొక మహదవకాశం.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ నెల 30న ముగుస్తుంది. రాహుల్ గాంధీకీ, లోకేష్ కీ మధ్య పోలికలు పెద్దగా లేవు. ఒకే ఒక్క పోలిక ఏమంటే ఇద్దరినీ ప్రత్యర్థులు ‘పప్పు’ అంటూ ఎద్దేవా చేశారు. అసమర్థుడిగా, దేనికీ పనికిరానివాడిగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూపాదయాత్ర చేసి ఆ అపప్రథను తొలగించుకున్నట్టే కనిపిస్తున్నారు. లోకేష్ సైతం తన మీద ప్రతిపక్షాలు చేసిన ఎద్దేవాను పూర్వపక్షం చేయగలగాలి. అంతా ఆయన నడవడికమీద, వ్యవహరణ తీరుమీద ఆధారపడి ఉంటుంది.
సోషల్ మీడియా చూస్తోంది జాగ్రత్త!
తన తాత జైత్రయాత్ర సమయంలో పత్రికలు మాత్రమే ఉండేవి. తండ్రి చంద్రబాబునాయుడు, ఆయన ప్రత్యర్థి రాజశేఖరరెడ్డి, షర్మిల పాదయాత్రలు చేసినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అందుబాటులో ఉంది. వారికి టీవీ చానళ్ళు ప్రచారం ఇచ్చాయి. జగన్ పాదయాత్ర సమయానికి సోషల్ మీడియా రంగప్రవేశం చేసింది. సామాన్యమానవుడిచేతిలో పాశుపతాస్త్రంలాగా సోషల్ మీడియా పనికి వస్తున్నది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర సమయానికి సోషల్ మీడియా ఆధిపత్యం పెద్ద ఎత్తున నడుస్తోంది. ప్రజలు సోషల్ మీడియా ఒక కంట లోకేష్ ను గమనిస్తుంటారు. శరీరభాషనూ, మాట్లాడే తీరునూ, ప్రజలను ఆలకించే పద్ధతినీ అన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అందుకే ఇదవరకటి పాదయాత్రికుల కంటే లోకేష్ మరింత అప్రమత్తంగా, స్మార్ట్ గా వ్యవహరించాలి. రాహుల్ గాంధీ అనుభవం నుంచి కొన్ని అంశాలు నేర్చుకోవచ్చు. అధికార పక్షాన్ని విమర్శించాలి. ప్రజాస్వామ్యం కొరవడడాన్ని విమర్శించవచ్చు. నియంతృత్వ ధోరణులను ఎండగట్టవచ్చు. కానీ అదొక్కటే సరిపాదు. సమస్యలకు తనదైన పరిష్కార మార్గం చూపించాలి. కొత్తదనం కనిపించాలి. నిర్మాణాత్మకంగా వినిపించాలి. వాట్స్ అప్ లూ, ఫేస్ బుక్ లూ, ట్విట్టర్లూ, టెలిగ్రాంలూ, ఇన్ స్టాగ్రామ్ లూ వెయ్యికళ్ళతో గమనిస్తూ ఉంటాయి.
అడ్డదారులు వద్దు
అడ్డదారుల ద్వారా ప్రచారం కొట్టేయాలని తాపత్రయం వద్దు. డ్రోన్ కెమరాలతోనో, ఇరుకు సందులతోనూ జనసమూహాన్ని లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నం అక్కరలేదు. పార్టీ కార్యకర్తలు లోకేష్ బాబుని అతిగా పొగడటం కూడా మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు సవ్యంగా లేవు. అధికారపక్షం పరపతి తగ్గింది. సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగానే ఉన్నది కానీ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. పరిశ్రమలు రావడం లేదు. జనసామాన్యం అంత సంతోషంగా లేరు. శాసనసభ్యుల అవినీతి పెచ్చరిల్లుతోంది. ఎవ్వరినీ సంప్రతించకుండా ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల మీద జులుం ఎక్కువయింది. వీటన్నిటినీ తెలివిగా ఎత్తి చూపించాలి. జగన్ మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని సంబోధించడమో. సైకో అని పిలవడమో చేస్తే అది లోకేష్ కే మైనస్ అవుతుంది. మర్యాదగా, అర్థవంతంగా, నిశిత విమర్శలు చేస్తూ మాట్లాడాలి, లేనిపోని గాంభీర్యం ప్రదర్శించనక్కరలేదు. సహజంగా, తనదైన తీరులో హాయిగా వ్యవహరించాలి. పేదల పట్ల ప్రేమ కనబడాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన ధ్వనించాలి. నాయకుల అంతరంగాన్నీ, సంస్కారాన్నీ వారి మాటలు, చేతల ద్వారా ప్రజలు గ్రహిస్తారు. ఊకదంపుడు ఉపన్యాసాల కంటే మనసు నుంచి నేరుగా వచ్చిన మాటకు ఎక్కువ విలువ ఇస్తారు.
నాలుగు వందల రోజులు ప్రజల మధ్య ఉంటూ నాలుగువేల కిలోమీటర్లు నడవడం అంటే అదొక మహాయజ్ఞం. యజ్ఞఫలం తప్పనిసరిగా ఉంటుంది. నారా లోకేష్ కు శుభాకాంక్షలు చెబుదాం.