హైదరాబాద్ : పండిత పాత్రికేయులూ, సంగీత పరిశోధకులూ నండూరి పార్థసారథిని గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ నాగరత్నమ్మ పురస్కారంతో సత్కరించారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో నండూరివారి స్వగృహం ‘శ్రుతి’ లో ఈ కార్యక్రమం ఆదివారం (జనవరి 31వ తేదీన) జరిగింది. ఇందులో ‘సకలం’ సంపాదకులూ కె. రామచంద్రమూర్తి, సీఎల్ ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ వాసిరెడ్డి విక్రాంత్, అన్నమయ్య గ్రంధాలయం స్థాపకులు లంకా సూర్యనారాయణ, వారి కుమారులూ, హర్షవర్థన్, తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ అధ్యాపకులు రవికృష్ణ ఈ సన్మాన కార్యక్రమానికి వ్యాఖ్యాతగా, నిర్వాహకుడిగా వ్యవహరించారు.
వెంకటేశ్వరరావు అనే మిత్రులు గుంటూరులో ఉండేవారనీ, ఆయన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి తిరిగి ఇంటికి రాలేదనీ, ఆయన అభీష్టం మేరకు విశ్వనాథ సాహిత్య అకాడమీని స్థాపించి గత అయిదేళ్ళుగా సాహిత్యం, సంగీత, కళారంగాలలో పురస్కారాలు ఇస్తూ వచ్చామనీ చెప్పారు. బెంగుళూరు నాగరత్నమ్మ పేరు మీద సంగీత, సాహిత్య రంగాలలో ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని వెంకటేశ్వరరావు కోరిక మేరకు ఈ పురస్కారం ఈ సంవత్సరం నండూరి పార్థసారధిగారికి ఇవ్వాలని నిర్ణయించామనీ, అందుకోవడానికి నండూరివారు సహృదయంతో అంగీకరించారనీ రవికృష్ణ తెలియజేశారు.
నండూరి పార్థసారథితో తనకు నలభై ఏళ్ళకు పైగా కొనసాగుతున్న అనుబంధాన్ని కె. రామచంద్రమూర్తి గుర్తు తెచ్చుకున్నారు. బెంగళూరులో 1975 ప్రాంతంలో పని చేస్తున్న రోజులలో అప్పటికే సీనియర్ జర్నలిస్టు అయిన పార్థసారధితో పరచియమై అది స్నేహంగా మారిందనీ, తమ రెండు కుటుంబాల మధ్య బలమైన మైత్రీబంధం ఉన్నదని రామచంద్రమూర్తి తెలియజేశారు.
Also Read : కథారచయిత శ్రీరమణకు విశ్వనాథ అకాడెమీ పురస్కారం
నండూరి పార్థసారధి సుమారు ఎనిమిదేళ్ళు నడిపిన ‘రసమయి’ పత్రిక తన సంగీత పరిజ్ఞానాన్ని విస్తరించిందనీ, సంగీత ప్రపంచానికి ఆ పత్రిక ఎనలేని సేవ చేసిందనీ రవికృష్ణ గుర్తు చేసుకున్నారు. సత్కారానికి స్పందిస్తూ పార్థసారథి, ‘రసమయి’ పత్రిక నిర్వహణ వల్ల తాను నష్టబోయాననే అభిప్రాయం తనకు లేదనీ, ఆ పత్రిక కారణంగా సంగీత, సాహిత్యాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం దక్కిందనీ అన్నారు. అమెరికాలో నివసిస్తున్న తన కుమారుడు మధుతో కలసి ప్రతిరోజూ పాతవ్యాసాలను వెలుగులోకి తెచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామనీ, తాను 1960ల నుంచి రాసిన సినిమా సమీక్షలనూ, సంగీత విద్వాంసుల పరచయాలనీ, కచేరీల సమీక్షలనూ పరిష్కరించి నండూరి.కామ్ లో (nanduri.com) ప్రచురిస్తున్నామని ఆనందంగా చెప్పారు. ఇప్పటి వరకూ 150 సమీక్షల వరకూ ఈ వెబ్ సైట్ లో ప్రచురించామనీ, ఇంకా అనేకం ప్రచురించవలసి ఉన్నదనీ అన్నారు.
తనను ‘ఆంధ్రప్రభ’ యాజమాన్యం శిక్షాత్మకంగా అనేక మహానగరాలకు బదిలీ చేసిందనీ, ఆ విధంగా మద్రాసు, బొంబాయ్, భువనేశ్వర్, బెంగళూరు వంటి నగరాలలో పని చేసే అవకాశం కలిగిందనీ, అప్పుడు ఆయా నగరాలలోని సంగీత విద్వాంసులను కలుసుకోవడం, అక్కడి సంగీత సంస్కృతిని అధ్యయనం చేయడం గొప్ప అనుభూతి కలిగించిందనీ వివరించారు. సంగీక కచేరీకి వెళ్ళినా, సినిమా చూసినా నోట్స్ రాసుకోవడం తనకు అలవాటనీ, నోట్స్ సహకారంతో వ్యాసాలూ, సమీక్షలూ రాసేవాడిననీ, ఉద్యోగ విరమణ తర్వాత తాను రాసిన వ్యాసాలు చూస్తే ఇన్ని వ్యాసాలు రాశానా అనే ఆశ్చర్యం కలిగిందనీ చెప్పారు. తన శైలీ, తన అగ్రజుడు నండూరి రామమోహన్ రావు శైలీ ఒకటేననీ, అప్పటికీ, ఇప్పటికీ తన రచనాసంవిధానంలో ఎటువంటి మార్పూ రాలేదనీ పార్థసారథి వ్యాఖ్యానించారు.