మాడభూషి శ్రీధర్ తిరుప్పావై 16
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్
తెలుగు భావార్థ గీతిక
నాయకులకెల్ల నాయకుడు నందగోపుని భవ్యభవన
ధ్వజతోరణోజ్వల ద్వారములగాచు రక్షకోత్తమా
మణిరత్నఖచితతలుపుగడియలు తెరచి రానిమ్ము
నీలవర్ణుడు పరమునిచ్చెదనని మాట ఇచ్చినాడు
వైకుంఠపథము జేరు మార్గమ్ము మాకు జెప్పునోయి
మాయలెరుగము గోపాలగోపికా భక్తులము మేము
ద్వారపాలకా మున్ముందె కాదనక గడియ తీయవయ్య
శుచులమై వచ్చితిమి శ్రీకృష్ణదర్శనమ్మీయవయ్య.
భగవంతుడిని దుష్టుల కంటపడకుండా కాపాడిన వాడు. ఆచార్యుడు అదే పని చేస్తాడు.నేపథ్యం:
నందగోపుని భవనమే మంత్రము. అది నమః శబ్దానికి భావన. నందగోపుడనే ఆచార్యుడు ఆనందరూపుడైన భగవంతుడు అనర్హుల చేతిలో పడకుండా కాపాడే వాడని కందాడై రామానుజాచార్యులు భావార్థాన్ని వివరించారు. గురుపరంపర అనుసంధానంలో నమఃతో ముగుస్తుంది.
Also read: తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగానూ చెప్పగల నేర్పరి
ప్రతిపదార్థాలు
నాయగన్ ఆయ్ నిన్ఱ = మాకందరికీ నాయకుడైన, నందగోపన్ ఉడైయ=నందగోపుని యొక్క,కోయిల్ = భవనాన్ని, కాప్పానే! =కాపాడే వాడా, కొడిత్తోన్ఱుం ప్రకాశించే ధ్వజాలతో, తోరణవాశల్ = తోరణాలతో అలంకరించిన ద్వారాన్ని, కాప్పానే= కాపాడేవాడా, మణిక్కదవం మణులతో తాపడం చేసిన తలుపులు, తాళ్ = గడియను, తిఱవాయ్= తీయవలెను, ఆయర్ శిఱుమియరోముక్కు =గోపబాలికలమైన మాకు,అఱై పఱై = మ్రోగే పరై అనే వాయిద్యాన్ని, మాయన్ =ఆశ్చర్యకరమైన మాయలు చేసిన వాడు, మణివణ్ణన్ నీలమణుల వంటి మేనిఛాయగలవాడు, నెన్నలే =నిన్ననే, వాయ్-నేరుందాన్ =వాగ్దానం చేశాడుతూయోమాయ్ వందోం =పరిశుద్ధులమై వచ్చినాము, తుయిలెర ప్పాడువాన్= మేలుకొల్పడానికి వచ్చాము,వాయాల్ = నీ నోటితో, మున్నం మున్నం = ముందే కాదనకమ్మా, మాత్తాదే అమ్మానీ నేశనిలైక్కదమ్ = శ్రీకృష్ణునిపై ప్రేమాభిమానాలతో నిండిన తలుపును, నీక్కు=తెరువుము.
భావార్థము
గత పది రోజుల పాశురాలగానంలో పదిమంది మహాజ్ఞానులను మేల్కొల్పి తన వెంట నందగోపుని భవనానికి తీసుకువచ్చింది గోదమ్మ. నందగోపుడే ఆచార్యుడు. భగవంతుడిని తలచుకుంటూ ఆయనను తనలోనే కల్గి ఉన్నవాడు నందుడు. భగవంతుడిని దుష్టుల కంటపడకుండా కాపాడిన వాడు. ఆచార్యుడు అదే పని చేస్తాడు. కనుక ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకే. ఈ పాశురంలో ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తున్నది. తోరణం ధ్వజం కట్టి ఉన్న నందగోపభవనాన్ని అసురుల ఆపదలనుంచి కాపాడుకోవడమే కాపలావారి పని. గోపికలు రాగానే కాపలాదారులు అప్రమత్నమైనారు. గోదమ్మ వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మా నాయకుడైన నందగోపుని దివ్యభవనాన్ని రక్షించే వాడా మణిమయద్వారాన్ని తెరువుము. పరమపదంలోని దివ్యభవనం నుంచి లోకాలను పాలించి పాలించి విసిగిపోయిన శ్రీహరి నందగోపాలుని ఇంటికి వెళ్లి పరతంత్రుడుగా ఉన్నాడు. తమ కుమారుడు రాజుగా చూసుకునే భాగ్యం దశరథుడికీ వసుదేవుడికీ కలగలేదు. ఆ భాగ్యం కేవలం నందుడికే దక్కింది. సర్వలోకాలకు తండ్రి అయిన వాడు తనకు తండ్రి నందగోపుడని సంభావించి, తండ్రిపేరనే భవనాన్ని పిలుచుకుంటున్నాడు. రాముడు వనవాసానంతరం తిరిగివస్తూ విమానం ద్వారా సీతకు అయోధ్యను చూపించి రాజధానీ పితుర్మమ = ఇది నాతండ్రి రాజధాని అని చెప్పాడు.
Also read: కెందామరనేత్రుడు శంఖచక్రధరుడు ఆజానుబాహుడు
భగవంతుడుండే భవనాన్ని, ఆయన తండ్రిపేరనున్న దివ్యభవనాన్ని కాపలా కాస్తున్నవాడిని ఆ వృత్తి కర్మబంధాన్ని అనుసరించి సంభోధిస్తున్నారు గోపికలు. భగవత్సంబంధం తెలిపే పేరుతో చేతనుని పిలవడం గౌరవం. కులాన్ని బట్టి కాకుండా భగవంతుడి సంబంధమే భాగవతులకు ప్రీతిప్రాతం కదా. మొదట క్షేత్రపాలకుని పేరు చెప్పి ఆ తరువాత వాయిల్ కాప్పానే అంటూ ద్వారపాలకుడిని సంబోధిస్తున్నారు. శ్రీకృష్ణుడిని దర్శించాలనే ఆతృతతో అందరినీ బతిమాలి ఆటంకాలను తొలగించుకుంటున్నారు.
సర్వాదేవాన్ నమస్యంతి రామస్యార్థే రాముని కాపాడాలని సకలదేవతలనూ అయోధ్య ప్రజలు కోరుకునే వారట.
గోకులంలో అన్ని ఇళ్లూ సుసంపన్నంగా నందగోపుని భవనాలవలెనే ఉంటాయట. గోపికలు గుర్తు బట్టడానికి శ్రీకృష్ణుడే ధ్వజాన్ని, తోరణాలను కట్టి ఉంచినాడట. రాముని వెదుక్కుంటే వెళ్లిన భరతుడు, నారవస్త్రాలతో అలరుతున్న రామాశ్రమాన్ని గుర్తించి తరించినట్టు, గోపికలు ఈ ధ్వజతోరణాలను చూసిధన్యులైనారట. అచేతనములైన ధ్వజాలు తోరణాలు ద్వారాలు మమ్ము స్వాగతించలేవు. నీవు సచేతనుడివి కనుక మా ఆర్తి నీకు అర్థమవుతుంది. లోపలికి అనుమతించు. శ్రీకృష్ణుడి అనుమతి తీసుకుని సుభద్రను అర్జునుడు తీసుకుపోయినట్టు నీవు మాకు సాయం చేయాలి అంటున్నారు. ఆ భవన మణినిర్మిత ద్వారం అసమానంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. రాముడిని ఆహ్వానించడానికి సుమంతుడు వెళ్లినప్పుడు ఆయన భవన మణిద్వారాన్ని చూసి మైమరిచాడట. ఆ ద్వార సౌందర్యాన్ని చూసి మా కళ్లు చెదిరిపోకముందే మమ్మల్ని లోనికి అనుమతించండి. ఆత్మస్వరూపం మణికవాటం వంటిదట. ఆ ఆత్మసౌందర్యానికి అబ్బురపడి దాన్నే అనుభవిస్తూ అక్కడే ఉండిపోతారట. కాని పరమాత్మస్వరూపాన్ని చేరాలంటే ఆత్మసౌందర్యానుభవాన్ని దాటి వెళ్లాలి. ద్వారపాలకుడై నిలబడ్డ ఆచార్యుడే ఆతలపులు తెరుస్తాడు. తలుపులూ తెరుస్తాడు.
Also read:రాకాసిరాజు రావణు పదితలలు గిల్లివేసె రామమూర్తి
అంతరార్థం
“నాయగనాయ్ నిన్ఱ” నాయకుడవై ఉండే “నందగోపనుడైయ”నందగోపుడి “కోయిల్ కాప్పానే!” భవనాన్ని కాపాడేవాడా! నందగోపుడెందుకు మాకు, అసలు నీవే మానాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు. అక్కడ ఇంకో ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ “కొడిత్తోన్ఱుమ్” ఒక గరుడ ద్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉండేది ఇక్కడే అని తేల్చుకున్నారు. అందరి ఇళ్లు ఒకేవిధంగా ఉండడం వల్ల తన ఇల్లు గుర్తు పట్టడం కోసం గరుడ ధ్వజంతోపాటు “తోరణ వాశల్ ” మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణిచూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అది నిజమైన భక్తుడికి పరీక్ష. శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అదే ఏర్పాటు చేశాడు. అలాంటి ద్వారాన్ని “కాప్పానే” కాపాడేవాడా అని నమస్కరించారు. “మణిక్కదవం ” మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం “తాళ్ తిఱవా”తాళ్ళం తీయవయ్యా.
Also read: రాముడు ‘‘నేడు పోయి రేపురా’’ అని, రావణుడుతో బతికించి పోయాడు
ద్వారపాలకుడు: ఇంత భయంకరమైన అర్థరాత్రి వచ్చిన మీరెవరు?
గోపికలు: భయసంకోచాలను తొలగించే పరమాత్మ మామనసుల్లో ఉండగా భయమెక్కడిది?
ద్వా: కలియుగాన్ని స్వాగతించే ద్వాపరయుగాంత సమయం, తండ్రి పరమసాధువు నందుడు. ఊరు గోకులం, శత్రువు కంసుడు దగ్గర్లోనే ఉన్నాడు. కంసుని పరివారమంతా రాక్షసులతోనిండింది. ఇక భయం లేకుండా ఉండడమా?
గో: మేము సాధారణ గోపబాలికలం కనుక భయపడేపనే లేదు.
ద్వా: శూర్పణఖ కూడా ఆడదే కదా.
గో: మేం రాక్షసస్త్రీలం కాదయ్యా, గోపికలం.
ద్వా: పూతన కూడా గోపబాలిక రూపంలోనే వచ్చింది కదా. “ఆయర్ శిఱుమియరోముక్కు’’ అప్పట్నించి గోపబాలికలన్నా భయమే కదా.
గో: మా వయసు చూడగానే కపటవేషధారులం కాదని తెలియడం లేదా? ఒంటరిగా రాలేదు. 5 లక్షల మందిని కలిసి వచ్చాం. శ్రీకృష్ణుడికి ఏ ఆపద వస్తుందోఅని నిత్యం భయపడే గోపవంశజులం మేము, మా ఆకారం చూస్తే అర్ధం కావడం లేదా?
ద్వా: చిన్నవయసు కనుక నమ్మాలా? వృత్రాసురుడు చిన్న దూడరూపంలోనే కదా వచ్చింది. సరే మీరొచ్చిన పనేమిటి?
గో: మాకు అఱై పఱై మ్రోగే భేరిని మావ్రతం కోసం అడిగితే ఇస్తానన్నాడు. అందుకోసం వచ్చాం.
ద్వా: అయితే శ్రీ కృష్ణుడు మేలుకొన్నప్పుడు తీసుకోవచ్చుకదా.
గో: ” నెన్నలే వాయ్-నేరుందాన్” నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మన్ని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం అయనచుట్టు తిరగాల్సొస్తుంది. శ్రీకృష్ణుడే రావలసి ఉండగా రాలేదు. అతన్ని వెతుక్కుంటూ మేమే వచ్చాం. మమ్ము ఆటంకపరచడం న్యాయమా? శ్రీకృష్ణుడు మాకు నిన్ననే వాగ్దానం చేసాడు. మాట ఇస్తే తప్పడు. రామోద్విర్నాభిభాషతే.. రాముడు రెండు విధాలుగా మాట్లాడడు. వాగ్మీశ్రీమాన్ అందంగా మాట్లాడే వాడు, మాట్లాడేటప్పుడు అందంగా ఉండే వాడు. అతని వచో రామణీయకతను వాల్మీకి ఆళ్వారులూ వర్ణించారు కదా.
ద్వా: శ్రీకృష్ణుడు వాగ్దానం చేసి ఉండవచ్చు. కాని ఆయన రక్షణ బాధ్యత మాది కనుక మీ ఉద్దేశ్యం తెలుసుకోకుండా వదల లేము. మీరేదో ప్రయోజనాన్ని ఆశించినట్టు మీరే చెప్పారు కనుక నమ్మడం కష్టం.
గో: పఱై అనే నెపంతో వచ్చాం కాని మా ఉద్దేశ్యం ఆపరమాత్ముడికి మంగళాశాసనం చేయడమే. “తూయోమాయ్ వందోమ్” చాలా పవిత్రులమై వచ్చాం.
పరమపురుషుని పొందడానికి భావశుధ్ధి కావాలి. దేహశుధ్ది అవసరం లేదు. రాముని శరణువేడిన విభీషణుడు మునక వేయాల్సిన పని లేదు. అర్జునుడు కూడా చరమశ్లోకాన్ని రణార్థులైన ధూర్తుల మధ్య విన్నాడు. ద్రౌపది శ్రీకృష్ణుని శరణువేడినప్పుడు రజస్వల. ఆర్తినిండిన స్వరంతో గోపికలు ద్వారపాలకుడికి నమ్మకం కలిగిస్తున్నారు.
ద్వా: మీరు అనన్య ప్రయోజనంతో వచ్చారనడానికి ఒక దృష్టాంతం చెప్పండి.
గో: “మాయన్” ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అయనని అంటె “మణివణ్ణన్” ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటమం లేదయా. ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది “తుయిలెర ప్పాడువాన్” ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని, తెల్లవారుజామున. వేరే పని ఉంటే పగలు సభతీర్చినప్పుడు వచ్చేవాళ్లం కదా. మేం వచ్చిన సమయం చూడు. సమయాభోధితః సుఖసుప్తః పరంతపః చక్కగా నిద్రిస్తాడు. అందువలన అందంగా ఉంటాడు. శత్రువులను తపింప చేసేవాడు. ఆ రామచంద్రుడిని నేను మేల్కొల్పాను అని సీత సంతోషంతో రాముని శయన సౌందర్యాన్నివర్ణించింది. ఉత్తిష్ఠ నరశార్దూలా అని విశ్వామిత్రుడు సుప్రభాతం పాడాడు. ఆళ్వారులు కూడా అరంగత్తమా పళ్లి ఎజుందిరుళాయే అని శ్రీ మహావిష్ణువుకు సుప్రభాతం పాడారు. మేమూ తిరుప్పళ్లియోచ్చి పాడదామని వచ్చాం, అని గోపికలు మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటే మరింతసేపు వినాలనిపించి ద్వారపాలకుడు సంభాషణలో దింపి మరింత సేపు అక్కడే ఆపాలనుకుంటున్నాడు. గోపికలు ఆ భావాన్ని గమనించారు. మున్నం మున్నం మాట్రాదే ముందుముందే వద్దని చెప్పకయ్యా. నీవు మాకు స్వామివి. మాకు అతని దర్శన భాగ్యం కలిగించేవాడివి కనుక నీవు అతని కంటే గొప్పవాడివి. పరమాత్మనే ఉపదేశించే గురువు కనుక గురువు అతనికంటే సమున్నతుడు. మమ్ములను ఇక ఆపకు.
Also read: ఆమె మరో సీత – గోదాదేవి
ద్వా: నేను మిమ్ము ఆపను. మీరే తలుపు తోసుకుని లోపలికి వెళ్లండి.
గో: నీ నేయ నిలైక్కదవమ్ నీక్కు = శ్రీకృష్ణునిపై అత్యంత ప్రేమాభిమానాలు కలిగినదీ తలుపు. నీకన్న సేవాతర్పత కలిగినట్టుంది. “వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా” అమ్మా స్వామీ ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, “నీ నేశనిలైక్కదవం” శ్రీకృష్ణ ప్రేమచే సుదృడంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు, ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, అందరంతోసినా తెరుచుకోవడం లేదు. “నీక్కు” నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.
విశేషార్థం
ఆచార్యప్రాధాన్యతను తెలిపే మరో పాశురం ఇది. విష్ణువు కంటే కూడా అతని దర్శన భాగ్యాన్నికలిగించే ఆచార్యుడు నమస్కరించతగిన వాడు. తన శిష్యుడు నంజీయరుకు, భట్టరులు ‘‘శ్రీమహావిష్ణువును ఎవరు గతి అని భావిస్తారో వాళ్లను గతిగా ఆశ్రయించిన వారిని గతిగా భావించి ప్రవర్తించు’’ అని ఉపదేశించారు. అంటే మొదట ఆచార్యుల ప్రేమానురాగాలు సాధించాలి. అందుకు వారి అంతరంగ శిష్యులను ఆశ్రయించాలి అని డాక్టర్ శ్రీపాద జయప్రకాశ్ వివరించారు.
ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు. ఆనందరూపుడైన భగవానుడు అనర్హులచేతిలో పడకుండా కాపాడే వాడు. నందగోపుని భవనమంటే మంత్రం. దానిలోని ఆకారం జెండా. ద్వారమునకు తోరణం కట్టడం అంటే నమశ్శబ్దార్థమును భావనచేయడం. తలుపులు ఆత్మస్వరూప జ్ఞానము, దానివలననే స్వసాతంత్ర్యము కలుగుతుంది. వీటిని ఆచార్యుడే తెరచి లోనికి పంపాలి. గోపబాలికలు అంటే అనన్యగతిత్వము అజ్ఞానము కలిగిన శిష్యులు, పఱ అంటే కైంకర్యం. పరిశుధ్దులు అంటే మరో ప్రయోజనము ఉపాయమూ లేని వారు. భగవద్ధ్యానమున ఉన్న ఆచార్యులను తమకు అభిముఖులుగా చేయటమే నిద్ర మేల్కొల్పుట. ఆచార్యుని వాక్కే భగవంతుని దయచూపడానికి ఆధారమని కందాడై రామానుజాచార్య వివరించారు. అసలు గురువులు ఎవరనే ప్రశ్నకు ఈ పాశురంలో సమాధానం లభిస్తుంది. ఆచార్యులు మానవులే కానవసరం లేదు. అనవసరంగా కూడబెట్టింది పరుల పాలవుతుందని చెప్పే తేనెటీగలు, తనకు లభించేదే చాలుననే కొండచిలువ అజగరము కూడా గురువులే నని ఒక ముని చెప్పారు. ఇక్కడ కృష్ణ భక్తి యే గోపికలకు గురువు, గోపికలే ఆచార్యులు ఆళ్వారులు అని దాశరథి రంగాచార్యులు వివరించారు.