Sunday, December 22, 2024

నందుని భవనమే మంత్రము, నందుడే ఆచార్యుడు

గోదా గోవింద గీతమ్ 16

నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ

కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ

వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్

ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై

మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్

తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్

వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా

నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

నాయకులకెల్ల నాయకుడు నందగోపుని  భవ్యభవన

ధ్వజతోరణోజ్వల ద్వారములగాచు రక్షకోత్తమా,

మణిరత్నఖచిత కవాటములన్ తెరచి, రానిమ్ము

నీలవర్ణుడు పరమునిచ్చెదనని మాట ఇచ్చినాడు

వైకుంఠపథము జేరు మార్గమ్ము మాకు జెప్పునోయి

మాయలెరుగము గోపాలగోపికా భక్తులము మేము

ద్వారపాలకా, మున్ముందె కాదనక, గడియ తీయవయ్య

శుచులమై వచ్చితిమి శ్రీకృష్ణదర్శనమ్మీయవయ్య.

 ప్రతిపదార్థాలు
నాయగన్ ఆయ్ నిన్ఱ = మాకందరికీ నాయకుడైన, నందగోపన్ ఉడైయ=నందగోపుని యొక్క,కోయిల్ = భవనాన్ని, కాప్పానే! =కాపాడే వాడా, కొడిత్తోన్ఱుం ప్రకాశించే ధ్వజాలతో, తోరణవాశల్ = తోరణాలతో అలంకరించిన ద్వారాన్ని, కాప్పానే= కాపాడేవాడా, మణిక్కదవం మణులతో తాపడం చేసిన తలుపులు, తాళ్ = గడియను, తిఱవాయ్= తీయవలెను, ఆయర్ శిఱుమియరోముక్కు =గోపబాలికలమైన మాకు,అఱై పఱై = మ్రోగే పరై అనే వాయిద్యాన్ని, మాయన్ =ఆశ్చర్యకరమైన మాయలు చేసిన వాడు, మణివణ్ణన్ నీలమణుల వంటి మేనిఛాయగలవాడు, నెన్నలే =నిన్ననే, వాయ్-నేరుందాన్ =వాగ్దానం చేశాడుతూయోమాయ్ వందోం =పరిశుద్ధులమై వచ్చినాము, తుయిలెర ప్పాడువాన్= మేలుకొల్పడానికి వచ్చాము,వాయాల్ = నీ నోటితో, మున్నం మున్నం = ముందే కాదనకమ్మా, మాత్తాదే అమ్మానీ నేశనిలైక్కదమ్ = శ్రీకృష్ణునిపై ప్రేమాభిమానాలతో నిండిన తలుపును, నీక్కు=తెఱువుము.

భావార్థము
నందగోపుని భవనమే మంత్రము. అది నమః శబ్దానికి భావన. నందగోపుడనే ఆచార్యుడు ఆనందరూపుడైన భగవంతుడు అనర్హుల చేతిలో పడకుండా కాపాడే వాడు. గురుపరంపర అనుసంధానంలో ‘నమః’తో ముగుస్తుంది.తలుపులు ఆత్మస్వరూప జ్ఞానము, దానివలననే స్వాతంత్ర్యము కలుగుతుంది. వీటిని ఆచార్యుడే తెరచి లోనికి పంపాలి. గోపబాలికలు అంటే అనన్యగతిత్వము అజ్ఞానము కలిగిన శిష్యులు, పఱ అంటే కైంకర్యం. పరిశుధ్దులు అంటే మరో ప్రయోజనము ఉపాయమూ లేని వారు. భగవద్ధ్యానమున ఉన్న ఆచార్యులను తమకు అభిముఖులుగా చేయటమే నిద్ర మేల్కొల్పుట. ఆచార్యుని వాక్కే భగవంతుని దయచూపడానికి ఆధారమని కందాడై రామానుజాచార్య వివరించారు.

పది రోజుల పాశురాలగానంలో పదిమంది మహాజ్ఞానులను మేల్కొల్పి తన వెంట నందగోపుని భవనానికి తీసుకువచ్చింది గోదమ్మ. నందగోపుడే ఆచార్యుడు. భగవంతుడిని తలచుకుంటూ ఆయనను తనలోనే కల్గి ఉన్నవాడు నందుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకే. ఈ పాశురంలో ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తున్నది. తోరణం ధ్వజం కట్టి ఉన్న నందగోపభవనాన్ని అసురుల ఆపదలనుంచి కాపాడుకోవడమే కాపలావారి పని. గోపికలు రాగానే కాపలాదారులు అప్రమత్తమైనారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి గోదమ్మ ప్రయత్నిస్తున్నారు.

నందగోపుడెందుకు మాకు, అసలు నీవే మానాయకుడివి అని ఒక ద్వార పాలకుడితో అన్నారు. చిన్నపిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు. అక్కడ ఇంకో ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడి గరుడ ద్వజంగుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉండేది ఇక్కడే అని తేల్చుకున్నారు. అందరి ఇళ్లు ఒకేవిధంగా ఉండడం వల్ల తన ఇల్లు గుర్తు పట్టడం కోసం గరుడ ధ్వజంతోపాటు మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణిచూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అది నిజమైన భక్తుడికి పరీక్ష. శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అదే ఏర్పాటు చేశాడు. అలాంటి ద్వారాన్ని కాపాడేవాడా అని నమస్కరించారు. మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం తాళ్ళం తీయవయ్యా అనడిగారు. వారి సంభాషణ:

ద్వారపాలకుడు: ఇంత భయంకరమైన అర్థరాత్రి వచ్చిన మీరెవరు?

గోపికలు: భయసంకోచాలను తొలగించే పరమాత్మ మామనసుల్లో ఉండగా భయమెక్కడిది?
ద్వా: కలియుగాన్ని స్వాగతించే ద్వాపరయుగాంత సమయం, తండ్రి పరమసాధువు నందుడు. ఊరు గోకులం, శత్రువు కంసుడు దగ్గర్లోనే ఉన్నాడు. కంసుని పరివారమంతా రాక్షసులతోనిండింది. ఇక భయం లేకుండా ఉండడమా?

గో: మేము సాధారణ గోపబాలికలం కనుక భయపడేపనే లేదు.

ద్వా: శూర్పణఖ కూడా ఆడదే కదా.

గో: మేం రాక్షసస్త్రీలం కాదయ్యా, గోపికలం.

ద్వా: పూతన కూడా గోపబాలిక రూపంలోనే వచ్చింది కదా. అప్పట్నించి గోపబాలికలన్నా భయమే కదా.

గో: మా వయసు చూడగానే కపటవేషధారులం కాదని తెలియడం లేదా? ఒంటరిగా రాలేదు. 5 లక్షల మందిని కలిసి వచ్చాం. శ్రీకృష్ణుడికి ఏ ఆపద వస్తుందోఅని నిత్యం భయపడే గోపవంశజులం మేము, మా ఆకారం చూస్తే అర్ధం కావడం లేదా?

ద్వా: చిన్నవయసు కనుక నమ్మాలా? వృత్రాసురుడు చిన్న దూడరూపంలోనే కదా వచ్చింది. సరే మీరొచ్చిన పనేమిటి?

గో: మాకు అఱై పఱై మ్రోగే భేరిని మావ్రతం కోసం అడిగితే ఇస్తానన్నాడు. అందుకోసం వచ్చాం.
ద్వా: అయితే శ్రీ కృష్ణుడు మేలుకొన్నప్పుడు తీసుకోవచ్చుకదా.

గో: నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం ఆయనచుట్టు తిరగాల్సొస్తుంది. శ్రీకృష్ణుడే రావలసి ఉండగా రాలేదు. అతన్ని వెతుక్కుంటూ మేమే వచ్చాం. మమ్ము ఆటంకపరచడం న్యాయమా? శ్రీకృష్ణుడు మాకు నిన్ననే వాగ్దానం చేసాడు. మాట ఇస్తే తప్పడు.

ద్వా: శ్రీకృష్ణుడు వాగ్దానం చేసి ఉండవచ్చు. కాని ఆయన రక్షణ బాధ్యత మాది కనుక మీ ఉద్దేశ్యం తెలుసుకోకుండా వదల లేము. మీరేదో ప్రయోజనాన్ని ఆశించినట్టు మీరే చెప్పారు కనుక నమ్మడం కష్టం.

గో: పఱై అనే నెపంతో వచ్చాం కాని మా ఉద్దేశ్యం ఆపరమాత్ముడికి మంగళాశాసనం చేయడమే. చాలా పవిత్రులమై వచ్చాం.

ద్వా: మీరు అనన్య ప్రయోజనంతో వచ్చారనడానికి ఒక దృష్టాంతం చెప్పండి.

గో: ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అంటె “మణివణ్ణన్” ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటం లేదే. ఎడబాటుని తట్టుకోలేము. ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నామే, కాని మేం వచ్చింది. ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని, తెల్లవారుజామున. వేరే పని ఉంటే పగలు సభతీర్చినప్పుడు వచ్చేవాళ్లం కదా. మేం వచ్చిన సమయం చూడు.

‘సమయాభోధితః సుఖసుప్తః పరంతపః’ చక్కగా నిద్రిస్తాడు. అందువలన అందంగా ఉంటాడు. శత్రువులను తపింప చేసేవాడు. ఆ రామచంద్రుడిని నేను మేల్కొల్పాను అని సీత సంతోషంతో రాముని శయన సౌందర్యాన్నివర్ణించింది. ఉత్తిష్ఠ నరశార్దూలా అని విశ్వామిత్రుడు సుప్రభాతం పాడాడు. ఆళ్వారులు కూడా అరంగత్తమా పళ్లి ఎజుందిరుళాయే అని శ్రీ మహావిష్ణువుకు సుప్రభాతం పాడారు. మేమూ తిరుప్పళ్లియోచ్చి పాడదామని వచ్చాం, అని గోపికలు మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటే మరింతసేపు వినాలనిపించి ద్వారపాలకుడు సంభాషణలో దింపి మరింత సేపు అక్కడే ఆపాలనుకుంటున్నాడు. గోపికలు ఆ భావాన్ని గమనించారు. ముందుముందే వద్దని చెప్పకయ్యా. నీవు మాకు స్వామివి. మాకు అతని దర్శన భాగ్యం కలిగించేవాడివి కనుక నీవు అతని కంటే గొప్పవాడివి. పరమాత్మనే ఉపదేశించే గురువు కనుక గురువు అతనికంటే సమున్నతుడు. మమ్ములను ఇక ఆపకు.

ద్వా: నేను మిమ్ము ఆపను. మీరే తలుపు తోసుకుని లోపలికి వెళ్లండి.
గో: శ్రీకృష్ణునిపై అత్యంత ప్రేమాభిమానాలు కలిగినదీ తలుపు. నీకన్న సేవాతర్పత కలిగినట్టుంది. అమ్మా స్వామీ ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, శ్రీకృష్ణ ప్రేమచే సుదృడంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెఱువు, ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెఱిస్తే తెఱుచుకోవు, అందరంతోసినా తెఱుచుకోవడం లేదు. నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.

విశేషార్థం
ఆచార్యప్రాధాన్యతను తెలిపే మరో పాశురం ఇది. విష్ణువు కంటే కూడా అతని దర్శన భాగ్యాన్నికలిగించే ఆచార్యుడు నమస్కరించతగిన వాడు. తన శిష్యుడు నంజీయరుకు, భట్టరులు ‘‘శ్రీమహావిష్ణువును ఎవరు గతి అని భావిస్తారో వాళ్లను గతిగా ఆశ్రయించిన వారిని గతిగా భావించి ప్రవర్తించు’’ అని ఉపదేశించారు.

ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు. ఆనందరూపుడైన భగవానుడు అనర్హులచేతిలో పడకుండా కాపాడే వాడు. నందగోపుని భవనమంటే మంత్రం. దానిలోని ఆకారం జెండా. ద్వారమునకు తోరణం కట్టడం అంటే నమశ్శబ్దార్థమును భావనచేయడం..  అసలు గురువులు ఎవరనే ప్రశ్నకు ఈ పాశురంలో సమాధానం లభిస్తుంది. ఆచార్యులు మానవులే కానవసరం లేదు. అనవసరంగా కూడబెట్టింది పరుల పాలవుతుందని చెప్పే తేనెటీగలు, తనకు లభించేదే చాలుననే కొండచిలువ అజగరము కూడా గురువులే నని ఒక ముని చెప్పారు.  ఇక్కడ కృష్ణ భక్తి యే గోపికలకు గురువు, గోపికలే ఆచార్యులు ఆళ్వారులు అని దాశరథి రంగాచార్యులు వివరించారు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles