- త్యాగాలు చేస్తామంటున్న బాబు …. సిద్ధంగా లేమంటున్న బిజెపి !
- ఓలేటి దివాకర్
పవన్ కోసం తెలుగుదేశం పార్టీ త్యాగాలు చేస్తుందా? తెలుగుతమ్ముళ్లు తమ సీట్లు వదులుకుంటారా ? పవన్ కల్యాణ్ ను గద్దెనెక్కించేందుకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేస్తారా అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది . జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని , తమ కూటమి అధికారంలోకి వస్తే . తానే సిఎం పదవిని స్వీకరిస్తానని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
Also read: పవన్ ఆశ అడియాసేనా? టీడీపీతో వియ్యానికి బీజేపీ కలసిరాదా?!
ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల అన్నవరంలో జరిగిన టిడిపి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అవ సరమైతే త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం గమనార్హం. 70 ఏళ్లకు పైగా వయస్సున్న చంద్రబాబు నాయుడు త్యాగాలకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబునాయుడు 2029 లో సిఎం అభ్యర్థిగా పోటీలో ఉండకపోవచ్చు. అయినా వైసిపిని గద్దె దించడమే లక్ష్యంగా తన సిఎం అభ్యర్థిత్వాన్ని త్యాగం చేసేందుకు కూడా ఆయన సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు.
తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ అధికార వైసిపి ఓట్లు చీలిపోకుండా చూస్తామని పునరుద్ఘాటించారు . పొత్తుల విషయంలో వైసిపి చెప్పినట్లు నడుచుకోవాలా అని కూడా ఆయన నిలదీశారు. తద్వారా ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు . దీంతో రాష్ట్రంలో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి.
Also read: జిల్లా అధ్యక్షుడినైతే నియమించారు ….కానీ.. నగర కోఆర్డినేటర్ ను నియమించలేకపోతున్నారు?
పొత్తులుంటే పవన్..ఒంటరైతే జగన్
వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు పవన్ పొత్తుల ప్రకటన ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది . అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలిపోతే జగన్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి . వ్యతిరేక పక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే మళ్లీ వైసిపి అధికారంలోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే సింహం సింగిల్ గా వస్తుంది అంటూ పొత్తులను విచ్చిన్నం చేసేందుకు అధికార పార్టీ పవన్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది.
Also read: అసంతృప్తులందరికీ పదవులు … మళ్లీ అధికారంలోకి తెస్తారా?!
బిజెపికి పవన్ బైబై …
వైసిపి వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలన్న పవన్ కల్యాణ్ పిలుపు వినడానికి బాగానే ఉన్నా … ఆయన మిత్రపక్షం బిజెపి ఇందుకు అంగీకరిస్తుందా లేదా అన్నదే పెద్ద చర్చనీయాంశం . ఈ మధ్య ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని కుటుంబ పార్టీతో కలిసి నడవకూడదని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే తాజాగా సోము వీర్రాజు కూడా స్పందించారు. చంద్రబాబు చేసే త్యాగాలకు బిజెపి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కుటుంబ, అవినీతి పార్టీల కోసం బిజెపి త్యాగాలు చేయదని సోము స్పష్టం చేయడం గమనార్హం. బిజెపి ఇప్పటికే ఎన్నో త్యాగాలు చేసిందని కూడా సోము పరోక్షంగా గత పొత్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, జనసేన మధ్య పొత్తు విచ్చన్నమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక పవన్ టిడిపితో కలిసి నడవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also read: మరో రాష్ట్రానికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూడండి: ఉండవల్లి