వోలేటి దివాకర్
రాజధాని అమరావతికోసం తెలుగుదేశం పార్టీ రైతులు అరసవిల్లి వరకు చేపట్టిన పాదయాత్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, టిడిపి అధినేత చంద్రబాబునాయుడును ఒక విధంగా జత చేసిందని చెప్పవచ్చు. గత పంచాయితీ ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో ఈరెండు పార్టీలు కలిసే పనిచేశాయి. పవన్, బాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసే పనిచేస్తాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ పాదయాత్ర ద్వారా చంద్రబాబుకు పవన్ ను బహిరంగంగా కలిసే అవకాశాన్ని కల్పించింది. ఇకపై వైఎస్సార్సీపీ నాయకులకు పవన్ బాబు దత్త పుత్రుడు అన్న విమర్శలు చేసే అవకాశం ఉండదు. అమరావతి రైతుల పాదయాత్ర అసలు ఉద్దేశం వేరైనా చంద్రబాబుకు రాజకీయంగా మాత్రం కాస్తంత మేలు చేసినట్లు కనిపిస్తోంది. రాజకీయ భవిష్యత్ బాగుండి మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే తెలుగుదేశం రైతులు, టిడిపి నాయకులు కోరిన విధంగా అమరావతినే రాజధానిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా టిడిపికి ఆర్థికంగా కూడా తాజా పరిణామాలు పరోక్షంగా కలిసి వచ్చినట్టే. అయితే ఈ పరిణామాలు అధికార పైసీపీకి ఇబ్బందికరమే. అందుకే వైసిపి నాయకులు ఇప్పటికీ పవన్ ను ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసురుతూ కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు.
Also read: త్వరలో విజయసాయిరెడ్డి సొంత మీడియా!
పరోక్షంగా కలిపిన పాదయాత్ర
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలను కూడా ఈ విషయమై ఒప్పించేందుకు అమరావతి రైతులు అరసవిల్లి వరకు చుట్టుతిరుగుడు పాదయాత్ర చేపట్టారు. రాజధాని వికేంద్రీకరణకు కట్టుబడిన అధికార వైఎస్సార్ సీపీ విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించి, దానికి మద్దతుగా ఈనెల 16న విశాఖ గర్జన పేరిట భారీ ర్యాలీని, సభను నిర్వహించింది. ఆమరుసటి రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి పేరిట ప్రజాసమస్యలను వినాల్సిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విశాఖ గర్జన సభ పూర్తయిన వెంటనే అందులో పాల్గొన్న మంత్రులు రోజా, రజని తదితరులు విజయవాడకు వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకోవడం, అదే సమయంలో పవన్ కూడా విమానంలో విశాఖకు చేరుకోవడంతో విమానాశ్రయంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పవన్ ను పోలీసులు హోటల్ నిర్బంధం చేశారు. విజయవాడకు చేరుకున్న పవన్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిందని, ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్సీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపై చూస్తూ ఊరుకోనని, చెప్పుతోనే సమాధానం చెబుతానని చెప్పు చూపించి హెచ్చరించారు. ఇదే అదనుగా చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట పవన్ ను కలిసి పరామర్శించి, సంఘీభావం ప్రకటించడంతో పవన్ – బాబుల కలయికకు జనాంతికంగా అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇకపై ఇద్దరం కలిసి పనిచేస్తామని బహిరంగంగా ప్రకటించారు.
Also read: అనపర్తిలో అసైన్డ్ భూములపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రుణాలు: అనపర్తి ఎంఎల్ఏ ఆరోపణ
బిజెపికి ఒంటరి పోరేనా?
బిజెపితో తెగతెంపులపై గతంలోనే పవన్ కల్యాణ్ పలుసార్లు సంకేతాలు ఇచ్చారు. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ ను కలిసి పరామర్శించిన మరునాడే టిడిపి అధినేతతో కలిసి పనిచేయనున్నట్లు పవన్ ప్రకటించడం గమనార్హం. ఈసందర్భంగా రాష్ట్రంలో బిజెపి – జన సేన ఉమ్మడిపోరుపై రోడ్డు మ్యాప్ పై బిజెపిని ఎన్నిసార్లు అభ్యర్థించినా ఫలితం లేదని, పదేపదే డిల్లీ వెళ్లి అడుక్కోవాలా అంటూ పవన్ నిష్టూరమడారు.
Also read: కరవు కాటకాలకు ఆనకట్ట…కాటన్ బ్యారేజీకీ అంతర్జాతీయ గౌరవం!
గతంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ విముక్తి కి వచ్చే ఎన్నికల్లో పోటీకి తమ ముందు మూడు మార్గాలను ప్రకటించారు. బిజెపితో కలిసి లేదా, బిజెపి, టిడిపితో కలిసి, లేదా ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. తాజా పరిణామాలతో టీడీపీతో కలిసి నడుస్తానని స్పష్టత ఇచ్చినట్లుగా ఉంది.
మరోవైపు చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా టీడీపీతో కలిసి పనిచేసేందుకు బీజేపీ నాయకత్వం ససేమిరా ఇష్టపడటం లేదు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఒక సందర్భంలో మాట్లాడుతూ టిడిపి బస్సు మిస్సయ్యిందని వ్యాఖ్యానించి, టిడిపితో పొత్తుకు సిద్ధంగా లేమని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార వైసీపీ ఎలాగూ ఒంటరిపోరుకు సిద్ధమైంది. బిజెపీకి మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిపోరుకు సిద్ధం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు టిడిపి కూటమికి ఖచ్చితంగా కలిసి వస్తాయనే అంచనాలు వినిపిస్తున్నాయి.
Also read: అమరావతా? అధికార వికేంద్రీకరణా? ఏది రైటు?