వోలేటి దివాకర్
న్యాయస్థానాల్లో దోషులుగా తేలేంత వరకు ఎవరూ నేరస్తులు కాదని, దీని ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో జైలుకు వెళ్లిన టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అమాయకుడేనని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయినా ఇలాంటి వ్యవహారాల్లో చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉంటారని వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై హైకోర్టు సిబిఐ విచారణకు స్వీకరించిన తరువాత తొలిసారిగా శనివారం రాత్రి ఆయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా రాజకీయ కక్షతోనే ప్రత్యర్థి పార్టీ నాయకులను ఇరికిస్తుందని, దీంట్లో ఆశ్చర్యం లేదన్నారు. ఇదే తరహాలో చంద్రబాబును అరెస్టు చేసి ఉండవచ్చన్నారు. అయితే చంద్రబాబు బెయిల్ కోసం కాకుండా కేసునే కొట్టివేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల జైలు నుంచి ఇప్పటి వరకు బయటకు రాలేదన్నారు. ఈ కేసులో నేరం రుజువైనా చంద్రబాబుపై పెద్దగా చర్యలు ఉండకపోవచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరస్తులను అరెస్టు చేయడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని, ఇలాంటి కేసుల్లో దోషులకు భారీగా జరిమానాలు విధించాలన్నారు.
Also read: 2039 మంది ఖైదీల్లో చంద్రబాబు ఒకరు, సకల జాగ్రత్తలూ తీసుకుంటున్నాం, డీఐజీ రవికిరణ్
సెంట్రల్ జైలు జీవితం బాగుంటుంది
చిట్ ఫండ్ కేసులో జైలుకు వెళ్లిన టిడిపి యువ నాయకుడు ఆదిరెడ్డి వాసును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు గురించి ఆరా తీయగా అక్కడ అంతా టైమ్ ప్రకారం భోజనం పెడతారనిీ, ఇబ్బందులేమీ ఉండవనిీ చెప్పారని ఉండవల్లి గుర్తు చేశారు. ఆ ప్రకారం చూస్తే వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు మినహా చంద్రబాబుకు జైల్లో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చన్నారు. అయితే జైల్లో చంద్రబాబుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఉండవల్లి స్పష్టం చేశారు. అలాగే ఆయన కోరితే గృహనిర్బంధం, ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కల్పించే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఎన్నికల్లో ఏ పార్టీ నాయకుడైనా జేబులో సొమ్ములు ఖర్చు పెట్టరని, ఇలాంటి వ్యవహారాల్లో వచ్చిన సొమ్ములనే ఓటర్లకు పంచుతారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
Also read: 17ఏపై సుప్రీం న్యాయమూర్తి గత ఉత్తర్వులు పరిశీలిస్తే… చంద్రబాబుకు భంగపాటు తప్పదా?
స్కామ్ ఫైల్స్ మాయం
ఈ కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్ మాయం చేశారని ఉండవల్లి వెల్లడించారు. ఈ కేసులో ఆధారాలు దొరకకుండా ఫైల్స్ మాయం చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. సిబిఐ విచారణ కోరిన నాటి నుంచి అటు అధికార వైసిపి, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో తనపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారని, అయితే ఎంత తిడితే తనకు అంత ఉత్తేజం లభిస్తుందని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రాధాన్యత ఉన్న ఈకేసును సిబిఐ విచారణ కోరి తప్పు చేశానా అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గుజరాత్ మోడల్ ఏమిటో కూడా ఈవిచారణ ద్వారా బయపడుతుందన్నారు. చంద్రబాబు హయాంలోనే పూణేలోని జిఎస్టీ విజిలెన్స్ విభాగం అడిషనల్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ను బహిర్గతం చేశారని, నిధులు దారిమళ్లినట్లు గుర్తించారన్నారన్నారు. చంద్రబాబు హయాంలోనే వెలుగుచూసిన ఈస్కామ్ లో దోషులను అప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్మెంట్ పధకంతో తమకు సంబంధం లేదని ఇప్పటికే సీమెన్స్ సంస్థ స్పష్టం చేసిందని ఉండవల్లి గుర్తు చేశారు. ఒకవైపు సిఐడిది తప్పుడు విచారణ అంటూనే…టిడిపి నాయకులు సిబిఐ విచారణ కోరిన తనను తీవ్రస్థాయిలో విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే, సిఐడి విచారణ సక్రమంగానే సాగుతోందనిీ, రాజకీయంగానే టిడిపి విమర్శలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుందనీ అన్నారు. సిబిఐ విచారణ కోరిన తనను మద్యం, ఇసుక అక్రమాలపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరనిీ, కేసులు వేయరనిీ టిడిపి నాయకులు నిలదీస్తున్నారనిీ, ఆధారాలు ఉంటే వారే కేసులు వేయవచ్చు కదా అనిీ ఉండవల్లి సలహా ఇచ్చారు. వారిని ఎవరు అవుతున్నారన్నారు.
Also read: త్వరలో భువనేశ్వరి ఓదార్పు యాత్ర!
పొత్తుల విషయంలో పవన్ తొందరపడ్డారు
బిజెపి పక్షాన చేరిన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనతో టచ్ లో లేరని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. లేకపోతే చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో పొత్తు ప్రకటన చేయకుండా వారించేవాడినని తెలిపారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ తొందరపడ్డట్లు కనిపిస్తోందన్నారు. జనసేనతో పొత్తు టిడిపికే ఎంతో ప్రయోజనమని అభిప్రాయపడ్డారు. టిడిపి వారు ఎవరినీ తటస్తంగా ఉండనివ్వరని, అదే తరహాలో పవన్ టిడిపి పంచన చేరేలా చేశారన్నారు. తటస్తంగా ఉన్న తనపై కూడా మాటల దాడి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తనకు వచ్చిన లాభనష్టాలు ఏం లేవని స్పష్టం చేశారు.
Also read: త్యాగులు ఎవరు ?…. తిరుగుబాటుదారులెవరు?!
అలాగైతే జగన్ పై ఏ కేసూ నిలవదు
కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించకూడదన్న టిడిపి వాదనను కోర్టులు ఆమోదిస్తే అక్రమాస్తుల కేసులతో పాటు, భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ కేసూ నిలవదన్నారు. అలాగే సెక్షన్ 17ఏ కూడా ఆయనకు వర్తిస్తుందన్నారు.
Also read: చంద్రబాబు అరెస్టు తరువాత….!