నాగార్జునసాగర్ : శాసనసభ్యుడు నోముల నర్శింహయ్య గుండెపోటుతో ఈ ఉదయం మరణించారు. ఆయన కొంతకాలంగా అస్వస్థతో బాధపడుతూ హైరదాబాద్ అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1956 జనవరి 9వ తేదీన జన్మించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 1999, 2004 ఎన్నికలలో నకిరికల్ నుంచి సీపీఎం తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆ పార్టీ శాసనసభపక్ష నేతగా వ్యవహరించారు.
రాష్ట్ర విభజన తరువాత 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత కె.జనారెడ్డిపై విజయం సాధించారు. నోముల మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని అన్నారు.
నోముల నర్శింహయ్య సీపీఎం పార్టీ నాయకుడుగా నకిరికెల్ నియోజకవర్గంలో ప్రభావవంతంగా పని చేశారు. రైతాంగ సాయుధపోరాటం జరిగిన నల్లగొండ జిల్లాలలో భాగమైన నకిరికెల్ సీపీఎం అభ్యర్థులను 2004 వరకూ ఎన్నుకున్న అతికొద్ది నియోజకవర్గాలలో ఒకటి. రాష్ట్ర విభజన తర్వాత సీపీఎం ఒంటరిగా ఎన్నికలలో గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఆయన కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగుండటం లేదంటూ వదంతులు కొంతకాలంగా నియోజకవర్గంలో ఉన్నాయి. అవి కేవలం వదంతులేనని నిరూపించే ప్రయత్నంలో నియోజకవర్గంలో చాలా చురుకుగా అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. గుండెనెప్పి కారణంగా మరణించారు.