Sunday, December 22, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ

  • రంగంలోకి దిగిన కృష్ణ రివర్ బోర్డ్ బృందం
  • ఇంజరినీరింగ్ ఇన్ చీఫ్ బృందం జోక్యం
  • పోలీస్ పహారాలో... సాగర్ డ్యామ్

నాగార్జునసాగర్ డ్యామ్ పై శుక్రవారం రెండో రోజు కూడా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో సాగర్ డ్యామ్ పరిసరాల్లో అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. నాగార్జునసాగర్ డ్యామ్ లోని కొంత భాగాన్ని ఏపీ అధికారులు, పోలీసులు ఆక్రమించారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన బోర్డు సంఘటనపై వీడియో కాన్ఫరన్స్ ద్వారా విచారణ చేపట్టింది. కాగా శుక్రవారం ఉదయం ఈఎన్సీ సభ్యులు నాగార్జునసాగర్ చేరుకున్నారు. సభ్యులు నేరుగా ఏపీ అధికారుల వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. కానీ బోర్డు సభ్యులు ఏపీ అధికారులతో జరిపిన చర్చల సారాంశం వివరాలు ఇంకా బయటకు రాలేదు. గురువారం తెల్లవారుజామున ఏపీ ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసం కుడి కాలువ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు. తాగునీటి కోసమే నీటి విడుదల చేసుకున్నట్లు ఏపీ ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే కృష్ణ రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రా ప్రాంతం వైపు పలనాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, తెలంగాణ వైపు జిల్లా ఎస్పీ అపూర్వ రావు నాగార్జునసాగర్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో డ్యాం వద్ద ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

నాగార్జున సాగర్ డ్యాం వద్ద పోలీసుల పహరా

ఇది ఇలా ఉంటే, పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం  అంటూ విమర్శలు వచ్చాయి. గత రెండు రోజులుగా నిరాటంకంగా చేపడున్న సాగర్ నుంచి నీటి విడుదలతో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విభజన  వివాదం కలకలం సృష్టించింది.  ప్రాజెక్టులోని 26 గేట్లలో 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వస్తాయని ఏపీ పోలీసులు పేర్కొన్నారు. డ్యామ్‌ని ఏపీ అధికారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు.

13వ గేటు వద్ద సాగర్ నీటిని విడుదల చేసేందుకు కంచెను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రాజెక్టులో  సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు  చేసారు.

ఏపీ అధికారులు పోలీసుల సహకారంతో నాగార్జునసాగర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ, ఏపీ అధికారులు వారిని నివారించారు. గురువారం నాటకీయ పరిణామాల మధ్య ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆదేశాల మేరకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనతో నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం రాజుకుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఏపీ అధికారులు మాత్రం తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తోందని… తమ నీటి వాటా కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఏపీ పోలీసులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇరిగేషన్ అధికారులు మాట్లాడి ఈ వివాదాన్ని పరిష్కరిస్తారని… ముళ్ల కంచెను తొలగించి వెనక్కి వెళ్లాలని ఏపీ పోలీసులకు సూచించారు. అయినా ఏపీ పోలీసులు స్పందించకపోవడంతో ఉద్రిక్తత కొనసాగింది.

ఆంధ్ర ఇరిగేషన్ పోలీస్ శాఖ అధికారులపై  తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌  నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఏపీ ఇరిగేషన్‌ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్‌ నుంచి డ్యామ్‌పైకి ప్రవేశించారు.

నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి

బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్‌ నుంచి డ్యామ్‌పైకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆంధ్రా పోలీసులు డ్యామ్‌ సెక్యూరిటీ గేట్‌పైనుంచి దూకి, గేట్‌ మోటర్‌ను ధ్వంసం చేసి గేట్‌ను తెరుచుకొని లోపలికి ప్రవేశించారు. వారిని నియంత్రిస్తున్న ఎస్‌పీఎఫ్‌ సిబ్బందిపై దాడిచేశారు. ఆంధ్ర ఇరిగేషన్ పోలీస్ శాఖ అధికారులు సాగర్ డ్యాం పై విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొడక్షన్ కోర్స్ అధికారులు దాడి చేశారని నీటిపారుదల శాఖ తెలంగాణ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు సెక్షన్ 441, 448, 427 ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కుడి కెనాల్ కు తక్షణమే నీటి విడుదల ఆపివేయాలి

కుడి కాల్వ ద్వారా నీటి విడుదలను వెంటనే నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు ఆదేశించింది.  నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 15 టీఎంసీల నీటిని విడుదలకు ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ముందు అడగకుండా ఎలా నీటిని విడుదల చేస్తారని కేఆర్ఎంబీ అధికారులు ప్రశ్నించారు. అక్టోబర్ 10 నుంచి 20 వరకు ఐదు టీఎంసీలు, జనవరి 8 నుంచి 18 వరకు 5 టీఎంసీలు ఏప్రిల్ 8 నుంచి 24 వరకు ఐదు టీఎంసీలు వాడుకునే విధంగా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాల కోసం మిగిలిన నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని, కానీ ఏపీ పరిమితికి మించి ఎక్కువ జలాలను వాడుకుంటోందని కేఆర్ బీఎం  తెలిపింది. తక్షణమే కుడి కాల్వకు నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

Also read: ఏపీది దుందుడుకు చర్య: సాగునీటి  విడుదలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

C.S. Kulasekhar Reddy
C.S. Kulasekhar Reddy
కులశేఖర రెడ్డి 1992 నుంచి ఆంధ్రభూమి లో పనిచేశారు. వ్యవసాయం, నీటి పారుదల, విధ్యుత్ రంగాలపై పలు వ్యాసాలు రాసారు. అనంతపురం, చిత్తూరు, విజయవాడ, కడప, కర్నూల్, హైదరాబాద్ లలో 27 సంవత్సరాలు విలేఖరిగా పని చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles