హేమావతి (శ్రీ సత్య సాయి జిల్లా), మార్చ్ 28: నోలంబ పల్లవ ప్రభువుల రాజధాని హెంజేరు (హేమావతి) లో హొయసల రెండో వీరబల్లాల శాసనం గుర్తించినట్టు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. హేమావతి నొలంబ శిల్ప శైలి పై పరిశోధన చేస్తున్న మైనాస్వామి మంగళవారం నాడు మడకశిరలో విలేకరులతో మాట్లాడుతూ హేమావతిలోని మల్లేశ్వర స్వామి గుడి ప్రవేశ మార్గంలో గండికి అడ్డుగా పెట్టిన శాసన స్తంభాన్ని గుర్తించినట్టు వివరించారు. నోలంబ పల్లవలకు సంబంధించిన ఎన్నో శాసనాలు, చోళులులకు చెందిన రెండు శాసనాలు హేమావతిలో ఉన్నాయి. అయితే హొయసల రాజులకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి శాసనాన్ని గుర్తించలేదు. హొయసల రెండో వీరబల్లాల శాసనం మొదటిసారిగా గుర్తించినట్టు చరిత్రకారుడు తెలిపారు. నోలంబ, హొయసల శాసనాల గురించి బ్రిటిష్ వాళ్లు ముద్రించిన శాసన సంపుటి 9 లో “హేమావతి – హొయసల” శాసనం గురించి ఎటువంటి సమాచారం లేదని మైనాస్వామి పేర్కొన్నారు. హేమావతి నోలంబేశ్వర స్వామి గుడికి మాన్యాన్ని దానం చేసినట్టు శాసనం చెబుతున్నది. శాలివాహన శకవర్షం 1127 క్రోధన నామ సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ అమావాస్య ఆదివారం, ఆ రోజు సూర్యగ్రహణం నాడు రెండో వీరబల్లాల రాజు మాన్యాన్ని ఇచ్చినట్టు శాసనంలో రాశారు. ఆంగ్లమ తేదీ ప్రకారం క్రీస్తుశకం 12 మార్చి 1206.
నోలంబవాడిని చోళ రాజులు జయించిన తరువాత చాళుక్యులకు నోలంబులు సామంతులుగా పనిచేశారు. ఆ తరువాత నోలంబ వాడి హొయసల రాజ్యంలో కలిసిపోయింది. నోలంబ వాడి – 32,000, గంగ వాడి -96,000, కంపిలి, తదితర ప్రాంతాలను ద్వార సముద్రం రాజ్య కేంద్రంగా రెండో వీరబల్లాల రాజు రాజ్యం చేస్తున్నట్టు శాసనాలు ఉన్నాయి.
కాగా హేమావతిలోని శాసనాలకు ఒక మార్గదర్శిని లేదా సూచికను తయారుచేసి ముద్రించి వాటిని సందర్శకులకు అందించాలని భారత పురావస్తు శాఖకు మైనాస్వామి విజ్ఞప్తి చేశారు. హేమావతి సిద్దేశ్వర, నోలంబేశ్వర ఆలయాలు మరియు పురావస్తు ప్రదర్శనశాలలో సుమారు 20 వరకు ఉన్నటువంటి శాసనాల్లోని అంశాలను సందర్శకులకు తెలియజేయాలని ఆయన కోరారు.