నాన్న మాట వినడం కష్టం
అందుకే రాముడంటే నాకయిష్టం.
మంచివారికి మంచిచేయడం
అబ్బో మనవల్లకాదు.
అందుకే కృష్ణుడి పై వేస్తా అపవాదు.
ఉపవాసాలు, సహనాలు, శాంతాలు,
అహింసా వ్రతాలూ… చేతకాని మతాలు.
అందుకే గాంధీ అంటే వెటకారాలు.
రావణుడు రంభనే ధర్షించిన రమ్య రసరాజు
రారాజు … అసూయా విషాన్ని
అమృతంలా తాగిన ఘనుడు
సైన్ధవుడు… సిగ్గుమాలిన పనులకు
సిల్కు చీరలు పెట్టిన షోగ్గాడు!
వాళ్లే నాకు ఆదర్శ పురుషులు, వాళ్లే నా ఆత్మీయులు
వాళ్లే నేను ఆరాధించే విజేతలు,
వీరోచిత కార్య సమర్థులు!
నన్ననేది ఎవరు?
ఎంతమంది లేరు నాల్లాంటి వాళ్ళు, నావాళ్ళు
వాళ్లదే నేడు ప్రాబల్యం, వాళ్ళ మాటకే ప్రాచుర్యం,
వాళ్ళ రాతకే చలామణి, వాళ్ళ చేతలకే గండపెండేరం!
అయినా అవతారం ఎత్తేందుకు
దేవుడి కెక్కడుంది సమయం!
అంతవరకు మా అసురీ శక్తులదే
ఈ భూమిపై అధికారం, ఆధిపత్యం.
Also read: మా రైతు
Also read: కొందరు అంతే
Also read: రాజకీయం
Also read: ద్వంద్వాలు
Also read: కాలం