కోటి వెలుగుల బంగారు కొండ క్రింద
పరచుకొన్నట్టి సరసు లోపల వసించి
ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయు
నా తెలంగాణ తల్లి కంజాత వల్లి!
ఎల్లొరా గుహలందున పల్లవించి
వేయి స్తంభాల గుడి లోన విరులు పూచి
శిల్పి ఉలి ముక్కుతో వికసించి నట్టి
నా తెలంగాణ కోటి అందాల జాణ!
మూడు కోటుల దేవతా మూర్తులందు
కోటి మంది వసించెడు హాటకావ
నీ మహాఖండమీ రమణీయ భూమి
నా తెలంగాణ లేమ! సౌందర్య సీమ
మూగవోయిన కోటి తమ్ముల గళాల
పాట పలికించి కవితా జవమ్ము కూర్చి
నా కలానకు బలమిచ్చి నడిపి నట్టి
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!
దాశరథి
మహాకవి దాశరథి కవితల్లో అత్యంత మనోహరము, నిసర్గ రమణీయమూ ఈ కవిత. అరవై నాలుగేళ్ల క్రిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా మూడుకోట్లు. అందులో తెలంగాణా కోటి గొంతుల సముదాయం. ఆ కోటి వెలుగుల బంగారు కొండ క్రింద పరచుకొన్న సరస్సులో, అందాల తామరలు విరిసే కంజాత వల్లి, తెలంగాణా తల్లి అంటాడు కవి, పులకితస్వాంతంతో.
Also read: ఉత్తరాభిమన్యుల వివాహంలో తెలుగుదనం
ఒకప్పుడు, ఔరంగాబాద్ దగ్గరి అజంతా, ఎల్లోరా గుహలు విశాల హైదరాబాదు రాష్ట్రం లోనివి. ఈ ఎల్లోరా మొదలుకొని, ఓరుగల్లు లోని వేయి స్తంభాల గుడిదాకా విస్తరించిన శిల్పకళ, తెలంగాణ వారసత్వం. అందుకే నా తెలంగాణా కోటి అందాల జాణ అంటాడు కవి.
తెలుగునాట గల మూడు కోట్ల మందీ కవి పాలిట దేవతామూర్తులే. ఆ ముక్కోటి దేవతల్లో ఒక కోటి మంది దేవతలు వసించేది తెలగాణ లోనే. అందుకే, తెలంగాణ లేమ, సౌందర్య సీమ.
Also read: మనుచరిత్ర అవతారిక – కృష్ణరాయల పరిచయం
పరవశంతో ఈ వారసత్వ సంపదను ఏకరువు పెట్టే కవికి మూగవోయిన కోటి మంది తమ్ముల కంఠాలు స్మృతిపథంలో మెదలుతాయి. తనకు జవసత్వాలిచ్చిన ఆ కోటి మంది దీనుల వర్తమాన దుస్థితి కవి మనస్సును కదిలించి కన్నీరు యేరై పారుతుంది. సానలు తీరిన జాతి రత్నాలు ఈ కోటి మంది ప్రజానీకం. కవి కలానకు బలమిచ్చిన తెలంగాణ ఈ కోటి రత్నాల వీణ.
ఇక్బాల్ మహాకవి “సారే జహాసె అచ్ఛా” గీతంలోని కమ్మదనం, బంకిం వందేమాతర గీతంలోని సౌకుమార్యం, లాలిత్యం దాశరథి ఖండికలో వున్నాయి.
ఇక్బాల్ “సారే జహాసే అచ్ఛా” గీతం రచించినప్పుడు, బంకిం వందేమాతరం గీతికను ఆలపించినప్పుడు, భారతదేశం బ్రిటిష్ పాలనలో కటిక దారిద్ర్యంలో మ్రగ్గుతున్నది. అట్టి దేశాన్ని “సారే జహాసె అచ్ఛా” అనడం కేవలం మాతృవాత్సల్యం చేత. నిరుపేదదైనా తల్లి పాలెప్పుడూ తియ్యగానే వుంటాయి. రెండు శతాబ్దాల నిజాం నిరంకుశ పాలనలో దుర్బర దాస్యంలో మ్రగ్గిన తెలంగాణంలోనూ దాశరథికి తీయని మాతృస్తన్యమే గుండె లోతులను తడుముతుంది. “మహాఖండమీ రమణీయ భూమి” అని దాశరథి అన్నప్పుడొక గద్గదస్వరం ఆయన అంతరాంతరాలలో గోచరించక మానదు.
Also read: తుం గ భ ద్రా న ది
వాస్తుశిల్పి బి ఎన్ రెడ్డి గారి కవితాసంపుటికి ముందుమాట రాస్తూ, దాశరథి ,ఇంజనీర్ కవులను గూర్చి మాత్రమే గాక, సోల్జర్ పోయెట్స్ గురించి ప్రస్తావిస్తాడు. దాశరథియే ఒక సోల్జర్ పోయెట్. నిరంకుశ నిజామ్ పాలనపై తిరుగులేని పోరాటం చేసినవాడు.
“మా తెలగాణమంతయు రమారమి రెండు శతాబ్దముల్ తమః
ప్రేతము చెంతనే గడచె! వెచ్చని యెండయు కాయలేదదే
దో తెరమాటునన్ గడచె! ఉజ్వల కాంతి ఘటాకటాహముల్
పాతర వేసియుండె, తెలవారగలేదు కదా శతాబ్దముల్”
అని కుమిలిపోయిన వాడు దాశరథి.
“మా నిజాము రాజు తరతరాల బూజు” అని జైలు గోడల నిండా రాసిన కవి దాశరథియే!
Also read: సంధ్య
ఉర్దూ నుండి గాలిబ్ ను, మగ్దూమ్ ను తెలుగులోకి అనువదించిన దాశరథిలో ఉరుదూ కవుల “జ్వలత్ ప్రభా దీప్తి జ్వాలలున్నాయి”. వారి ప్రణయంలోని “హిమ శీతల తుహిన మాలలూ” ఉన్నాయి. అటు విప్లవ కాహళీ కలదాయనలో, ఇటు ఝళంజళా రవళీ వున్నది.
ఆయన వలె తెలుగు వృత్తాన్ని, ఉద్యమస్పూర్తితో, దుందుడుకు తనంతో నడపగలిగిన మొనగాడు లేడు:
“వెలుతురు బాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి గుం
డెలు జిలుజిల్లనన్, రుధిర నిర్ఝరి పారె, దిగంగనా ముఖ
మ్ముల నవ కుంకుమప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు,త
ల్పులు తెరువుండు,రండు, పిలువుండు శయించిన వారినెల్లరిన్”
అని దాశరథియే అనగలడు.
కాళోజీ వలె దాశరధీ ప్రజాకవే. ఉన్న పదవి కూడా మధ్యలో లాగేసుకుంటే, తన కన్నీళ్ళు తనలోనే దాచుకొన్న సుకుమార హృదయుడు. ప్రజల హృదయాలలో శాశ్వతంగా జీవించడమే ఆయనకు దక్కిన ఒకే ఒక అవార్డు. ఆయన రచన ఎంత మనోహరమైనదో, నిష్కల్మషంగా ఆయన జీవించిన పద్ధతీ, అణువణువునా ఉద్వేగంతో సభావేదికపై ఆయన కవితాగానం చేసే పద్ధతి సైతం అంతే ఆకర్షనీయమైనవి.
“ఐదు రేకుల దీప కళికను
ఆర్పజూచెదరెవ్వరే
తారకా నవ తైలబిందువు
లార నిచ్చునె బ్రతుకు దివ్వెను?”
మహాకవి దాశరథికి నిండు నివాళి
Also read: అమృతోత్సవ వేళ ఆప్తవాక్యం
నివర్తి మోహన్ కుమార్