నాకంత బాస రాదు సాములో…
ఎదో సెపుతా, అరదం సేసుకో.
కలుపు మొక్కలా తీసి పారేయకు.
నా ఎర్రి యాస నా కవితం అనుకో…
నా పిచ్చి ఆశ దాని అరదం అనుకో
అయినా ఎదో సెప్పాలని ఉంటది గంద.
నాకూ ఉళ్లే నీకు లాగ ఓ గుండె
లోన బయట కొట్టుకుంటా.
ఎంత లేదు మా సేల కాడ…
నా మట్టి కత, నా నాగలి కత,
ఎండ కత, ఎండిన పంట కాలవ కత.
నా ఎడ్ల కత, గొడ్ల కత, వడ్ల కత,
వంగి లేచే ఏతాము కత.
మా నాట్ల పాట, కోతల పాట,
వర్సం పాట, మేగం పాట.
మద్దియాన్నం తాటి సెట్టు కింద కల్లు ఊట,
సాయంత్రం సోకు సుక్కమ్మ అంగట్ల
సారాయి లోటా, సీకుల సాట…
ఉండదో లేదో రాగం,
పాడతాం, ఆడతాం.
ఇంక ఇంటి కాడ…
ముక్కు పుడక కొనకపోతే
నా రత్తమ్మ చేసిన ఆగం…
మా యమ్మ కొచ్చిన దిక్కుమాలిన రోగం…
ఎన్ని లేవు సాములో సెప్పుకుంటా పోతే.
వడ్లంటే గుర్తుకొస్తణ్డాది,
ఎన్ని రకాలు ఏసినా…
నంబర్లు, నల్లొక్కులు, కేసర్లు, మొలగొలుకులు,
మాసూరాలు, బాసుమతులు…
ఏందో… నాకు మాత్ర రాగి సంకటి, ఎర్ర గడ్డ,
అయ్యోరమ్మ ఇస్తే నిమ్మ ఊరగాయ…
సెప్పడానికి ఎన్ని లేవు సామీ…
గుండె ఇప్పితే.
మీరుండేది సలవ గదుల సల్లని మేడ..
మీ కతలు మీకుండాయి సామీ
రాజు, రాణి, రాజ్యాలు, యుద్ధాలు, నగలు, నాణాలు
దగ దగ లాడే కాసిని సీమ కతలు.
మేముండేది
మురికి, మట్టి పెట్టి కట్టిన కట్టాల పుట్ట లో!
ఈ పుట్ట సీమలకు పొట్టనిండా కతలే సామీ…
సెప్పనీ నన్ను…
నాకంత బాస రాదు సాములో…
ఎదో సెపుతా, అరదం సేసుకో.
Also read: సుదీర్ఘ ప్రయాణం
Also read: అట, అకటా
Also read: మందల
Also read: లోహ(క)పు బిందె
Also read: ఇల్లు