రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
నువ్వున్నావు స్వర్గంలో
నాకంటే దేవుడే నిన్ను
ఎక్కువగా ఇష్టపడ్డాడేమో
త్వరగా తీసుకెళ్ళి పోయాడు
నువ్వు అయిష్టంగానే వెళ్ళావు
నేను మిగిలిపోయాను అనాధ ప్రేతంలా.
నేను ‘హందం మిల్ గయా’ అన్నాను
నువ్వు నీలి మేఘాల్లో నా పాట విన్నావు
ఇద్దరం ఒకే రయిలెక్కాo
అయినా గమ్యాలు వేరుగా ఉండిపోయాయి
కళ్ల భాష అర్థం కాలేదేమోనని
అర్థంలేని అనుమానం
రాయబారిని రుక్మిణి పంపించలేదు
కృష్ణుడే పంపినా రావలసిన జవాబు రాలేదు
హృదయాలు శిలలుగా మారాయి
వాటికి నాశం లేదుగా
అంతరాలెన్ని ఉన్నా
అంతరాన ఆరాధన తరగ లేదు
దూరాలు ఎంతైనా మనసులు మారలేదు
వ్యక్తీకరణ లేకపోయినా అంతరాంతరాల్లో
అదే ధ్యానం, అదే జపం
కోపం లేదు, ద్వేషం లేదు
అపార్థం అసలే లేదు
ఆలోచనలు, అనుభూతులు
రాగ రాగాలు దాచుకోవడం
ఐనవాళ్ళ కోసం త్యాగమే
‘స్వ’ కన్నా ‘మన’ ముఖ్యం కావడమే
ఇది కోరుకో తగిందా? తగిందేనా!
అన్నీ వదలుకుని
ఆనందాన్ని పరాయిని చేసి
నవ్వును దానమిచ్చేసి
బతుకే చేదు గుళికైపోతే
విధి ఆడే విచిత్ర నాటకం
ఈ జీవితం అనుకుంటూ
అదే లోక సత్యమని భావిస్తూ
అరుణారుణ సంధ్యా కాంతుల్ని
వెన్నెల జలపాతాలని
నీలి మబ్బుల చినుకులని
వాసంతాగమన చిరుమావిళ్ళను
సకల జీవన మాధుర్యాలను
మన సమాజానికి వదిలేసి
సన్యాసుల్లా బ్రతికి
నిట్టూర్పుల జీవితానికి తెర దించుతూ
బాధ్యతలు పూర్తిచేసేసి
మరి ఈ లోకంతో పని లేదని
నన్ను వదలి
నాకం చేరిపోయావా
ఋణానుబంధాలు వదులు కున్నా
అక్కడ నా కోసం ఎదురు చూస్తావని తెలుసు
నేనూ ఎదురు చూస్తూనే ఉన్నాను
‘అప్పుడైనా కలవనిస్తారా’
అన్న నీ మాటను గుర్తు చేసుకుంటూ.
నాకు వీసా దొరకగానే వచ్చేస్తా
అంతవరకు సాగుతూనే ఉంటుంది
ఈ తమస్సులో నా తపస్సు.
Also read: గీత
Also read: నీవే