రాయలసీమ ముద్దుబిడ్డ, ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎంవి రమణారెడ్డి బుధవారం ఉదయం గం.6.30లకు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. కర్నూలు ఆస్పత్రిలో చాలా రోజులుగా వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. రాయలసీమ హక్కుల కోసం మొట్టమొదట గళమెత్తిన పోరాటయోధుడు రమణారెడ్డి. వైద్యం చదువుకున్నా, రాజకీయాలలోనూ, సాహిత్యంలోనూ రాణించిన ఎంవిఆర్ ఆఖరి శ్వాసవరకూ రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు పది మాసాలుగా ఆక్సిజన్ పెట్టుకొని జీవిస్తున్నప్పటికీ ప్రపంచ చరిత్ర చివరి భాగాన్ని ఇటీవలే పూర్తి చేశారు.
ఎంవి రమణారెడ్డి వయస్సు 78 సంవత్సరాలు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదివి పొద్దుటూరులో కొంతకాలం వైద్యం చేసిన తర్వాత రాజకీయాలలో దిగారు. 1983లో ఎన్ టి రామారావు ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. పొద్దుటూరు నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందారు. తెలుగుగంగ ద్వారా కృష్ణా జలాలను మద్రాసుకు తరలిస్తున్న సమయంలో రాయలసీమకు న్యాయం చేయాలనీ, రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలనీ ఉద్యమం చేశారు. ఎన్ టిఆర్ పైన తిరగబడి తెలుగుదేశం పార్టీ నుంచి నిష్క్రమించారు. రాయలసీమ విమోచన సమితిని నెలకొల్పారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో 21 రోజులపాటు నిరాహారదీక్ష చేశారు. తాజాగా ఆయన వైఎస్ఆర్ సీపీలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ ఎంవి రమణారెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
రాజకీయనాయకుడిగా ఎంత పేరుప్రతిష్ఠలు సంపాదించారో సాహిత్యకారుడిగా కూడా వైవిఆర్ అంత మంచిపేరు తెచ్చుకున్నారు. రాయలసీమ కన్నీటి గాథ గ్రంథాన్ని రాశారు. రాయలసీమ వెతలనూ, సమస్యలనూ ఏకరవు పెడుతూ, పరిష్కారాలు సూచిస్తూ రచించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఒక్కటే అంతిమ పరిష్కారమని ఆయన అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవీఆర్ పైన పెట్టిన కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది.
Also Read: బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంవీఆర్
విద్యార్థి దశలోనే ‘కవిత’ అనే మాసపత్రికను నడిపారు. అనంతరం ‘ప్రభంజనం’ అనే పత్రికను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. విప్లవరచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. మహాకవి శ్రీశ్రీకి సన్నిహితుడు. మాక్సిం గోర్కీ రచించిన ‘మదర్’ ను ‘కడుపుతీపి’ పేరుతో అనువదించారు. ‘చివరికి మిగిలింది?’ అనే నవల రాశారు. ‘తెలుగు సినిమా స్వర్ణయుగం’ పుస్తకం రాశారు. ‘ప్రిజనర్ ఆఫ్ ది న్యూక్లియర్ డ్రీమ్’ ప్రచురించారు. ఆర్ కె నారాయణ గ్రంథాలను ‘పెద్దపులి ఆత్మకథ,’ ‘మాటకారి’ పేరుతో అనువదించారు. ప్రపంచ చరిత్ర తొలిభాగం సాక్షి దినపత్రికలో సీరియల్ గా ప్రచురితమైంది.