మునుగోడు ఉపఎన్నికలకు ఎన్నికల కమిషన్ కార్యక్రమం విడుదల చేసింది. అక్టోబర్ 7న షెడ్యూల్ విడుదల అవుతుంది. 14వ తేదీన నామినేషన్లకు గడువు ముగుస్తుంది. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువు 17 వ తేదీ వరకూ ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్ జరుగుతుంది. 6వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితం ప్రకటన ఉంటుంది.
కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేయవలసి ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగతనేత పాల్వాయిగోవర్థనరెడ్డి కుమార్తె స్రవంతి, బీజేపీ తరఫున కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మునుగోడు అభ్యర్థి విషయంలో కొంత కసరత్తు చేశారు. పేరు ప్రకటించవలసి ఉన్నది.
మూడు పార్టీలకూ ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన ఎన్నిక. ఈ స్థానంలో లోగడ అయిదు సార్లు గెలిచిన సీపీఐ, దానికి తోడు సీపీఎం అధికార టీఆర్ఎస్ ను సమర్థిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఒంటరిగానే తలబడుతున్నాయి. 2018 ఎన్నికలలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ టిక్కెట్టు మీద ఈ స్థానం గెలుచుకున్నారు. ఆయన బీజేపీలో చేరడం వల్లనే ఉపఎన్నికల అవసరమైంది.