- ఉత్తరప్రదేశ్ తో సూపర్ సండే టైటిల్ ఫైట్
- వరుస సెంచరీలతో పృథ్వీ షా రికార్డు
దేశవాళీ క్రికెట్లో జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్స్ కు మాజీ చాంపియన్ ముంబై, ఉత్తరప్రదేశ్ జట్లు చేరుకొన్నాయి.ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈటోర్నీ తొలిసెమీస్ లో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక పైన ముంబై, రెండో సెమీస్ లో గుజరాత్ పైన ఉత్తరప్రదేశ్ జట్లు నెగ్గి ఆదివారం జరిగే టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి.
రికార్డుల మోత:
Also Read: విజయ్ హజారే టోర్నీలో కుర్రోళ్ల జోరు
ప్రస్తుత చాంపియన్ కర్ణాటకతో జరిగిన తొలిసెమీఫైనల్లో ముంబై కెప్టెన్ కమ్ ఓపెనర్ పృథ్వీ షా భారీసెంచరీతో చెలరేగిపోయాడు. తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించడంతో పాటు రికార్డుల మోత మోగించాడు.క్వార్టర్ ఫైనల్స్ వరకూ ఓ డబుల్ సెంచరీతో సహా మొత్తం మూడుశతకాలు బాదిన పృథ్వీ సెమీస్ లో సైతం మూడంకెల స్కోరుతో అజేయంగా నిలిచాడు.మొత్తం 122 బంతుల్లో 17 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 165 పరుగులు సాధించాడు. పృథ్వీబ్యాటింగ్ జోరుతో ముంబై 72 పరుగుల భారీవిజయం నమోదు చేసింది.ప్రస్తుత ఈటోర్నీలో పృథ్వీ ఇప్పటికే 754 పరుగులతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. పృథ్వీ సాధించిన నాలుగు సెంచరీల్లో మూడుసార్లు 150కి పైగా స్కోరు నమోదు చేయడం విశేషం.
అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు:
విజయ్ హజారే టోర్నీలో 227 నాటౌట్ తో అత్యధిక వ్యక్తిగతస్కోరు సాధించిన ఆటగాడి ఘనతను సైతం పృథ్వీ దక్కించుకొన్నాడు.మొత్తం నాలుగు శతకాలలో రెండు మ్యాచ్‌ల్లో 227 నాటౌట్, 185 పరుగులు నాటౌట్‌తో మిగిలాడు. మూడుమ్యాచ్ ల్లో 150కి పైగా స్కోర్లు సాధించడం కూడా మరో రికార్డుగా నిలిచిపోతుంది. కర్ణాటకతో ముగిసిన సెమీఫైనల్ మ్యాచ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన పృథ్వీ షా ఆ తర్వాత గేరు మార్చి వేగం పెంచాడు.కేవలం 79 బంతుల్లోనే టోర్నీలో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో విఫలం కావడంతో భారతజట్టులో చోటు కోల్పోయాడు. అయితే విజయ్ హజారే ట్రోపీమ్యాచ్ ల్లో నాలుగు శతకాలు బాదడం ద్వారా మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
Also Read: శిక్షకుల్లో మహాశిక్షకుడు రవిశాస్త్రి
విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటి వరకూ మయాంక్ అగర్వాల్ పేరుతో ఉన్న రికార్డు ను పృథ్వీ తిరగరాశాడు. 723 పరుగులతో మయాంక్ అగర్వాల్ పేరిట ఉన్న రికార్డును 754 పరుగులతో పృథ్వీ అధిగమించాడు.ఆదివారం జరిగే ఫైనల్లో ఉత్తరప్రదేశ్ తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. విజయ్ హజారే టోర్నీని సైతం బీసీసీఐ బయోబబుల్ వాతావరణంలోనే నిర్వహిస్తోంది.