తెలుగు సినిమాల్లో పరిపూర్ణమైన హాస్యానికి పెద్ద పీట వేసిన రచయితల్లో ముళ్ళపూడి ఒకరు. ఆయన పండించిన అనేక మధురమైన హాస్య గుళికలు ఆయన సాహిత్యంలోనూ, సినిమా రచనల్లోనూ మనకు కళ్ళముందు కదలాడుతుంటాయి. సాక్షి, బంగారుపిచ్చుక, బుద్ధిమంతుడు, అందాలరాముడు, గోరంతదీపం, ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, పెళ్ళి పుస్తకం.. ఇలా కొన్ని హిట్లు మరికొన్ని ఫట్లు అయినా, రెంటినీ సమానంగా భావించిన స్థితప్రజ్ఞుడాయన.
Also read: నాన్నంటే బాధ్యత…
ముళ్ళపూడి వెంకట రమణ పేరు వినగానే వెంటనే బాపూ కూడా గుర్తొస్తారు. వీళ్లద్దరూ తీసిన చిత్రాలు అప్పటి తరాన్ని నవ్వుల లోకంలో ముంచెత్తాయి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ నటించిన పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీకాంత్ నటించిన రాధాగోపాలం, చంద్రమోహన్ నటించిన బంగారు పిచ్చుక ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాటి సంపూర్ణ రామాయణం నుంచి ఈనాటి శ్రీరామరాజ్యం వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు ముళ్లపూడి కలం నుంచే పురుడు పోసుకున్నాయి.
ముళ్ళపూడి చేసిన చిత్రాలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆయన చిత్ర కథల్లో సహజత్వం ఉట్టిపడుతుంది.
Also read: నవ్వుల పూదోట మహా దర్శకుడు.. జంధ్యాల
సంగీతాన్ని దృష్టిలో పెట్టుకుని సీన్స్ రాసిన మహా రచయిత ముళ్ళపూడి. అందుకే, ఆయన సినిమాల్లో కథ – సంగీతం ఒకదానితో ఒకటి కలిసి పోయి ప్రేక్షకుల గుండెల్ని తట్టిలేపుతాయి.
ముళ్ళపూడి వెంకటరమణ 28 జూన్ 1931 న ధవళేశ్వరంలో జన్మించారు. ఆయన అసలుపేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం . గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవారు. రమణ చిన్నతనంలోనే ఆయన తండ్రి మరణించారు. దీంతో కుటుంబం ఇబ్బందుల్లో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల దగ్గర చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివారు. 7, 8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివారు.
Also read: అందానికి , అద్భుత నటనకు చిరునామా….
1945లో “బాల” పత్రికలో రమణ మొదటి కథ “అమ్మ మాట వినకపోతే” అచ్చయ్యింది. అందులోనే “బాల శతకం” పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే “ఉదయభాను” అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయారు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, వచ్చిన డబ్బులతో సైక్లోస్టైల్ మెషిన్ కొన్నారు. ఆ పత్రికకు రమణ ఎడిటర్. చిత్రకారుడు బాపు. విషయ రచయిత మండలీకశాస్త్రి. ఆర్థిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. 1954లో ఆంధ్ర పత్రిక డైలీలో సబ్ ఎడిటర్‌గా చేరారు. ఈ క్రమంలో ఆయన తన కలానికి పదును పెట్టి వందలాది కథలు, రాజకీయ బేతాళ పంచవింశతి లాంటి రాజకీయ వ్యంగ్యాస్త్రాల రచనలు, విక్రమార్కుడి మార్కు సింహాసనం వంటి సినీరంగ ధోరణులపై విసుర్లు, ఋణానందలహరితో అప్పారావు పాత్రను పరిచయం చేయడం, చిచ్చరపిడుగులాంటి బుడుగు రచనలు చేశారు.
ఆంధ్రపత్రికలో సినిమా వార్తలు రాస్తున్న సమయంలో రమణ సమీక్షలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు రమణ సినీ సమీక్షలను ఆసక్తికరంగా చదివేవారు. ఈ క్రమంలో సినీ నిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న దాగుడు మూతలు సినిమాకు రచన చేయమని ముళ్లపూడిని కోరారు. చాలాకాలం తప్పించుకు తిరిగిన రమణ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే, దాగుడుమూతలు షూటింగ్ కారణాంతరాల వల్ల ఆలస్యం కావడంతో, డూండీ ఎన్టీ రామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీ రచన అయింది. రెండో చిత్రం కూడా ఎనీఆ్టర్ నటించిన గుడిగంటలు, మూడో చిత్రం అక్కినేని నటించిన క్లాసిక్ మూగమనసులు. మూడూ సూపర్ హిట్ చిత్రాలే కావడంతో రమణ సినీ జీవితం ఊపందుకుంది.
Also read: గానకోకిల గొంతు మూగబోయింది, అందనంత దూరాలకు అద్భుత గాయని లత వెళ్ళిపోయింది
అయితే, ఆయన ధ్యాస, శ్వాస, యాస గోదావరి మాండలికమే. ఆయన రచనల్లో కనిపించే బుడుగు, సీగాన పెసూనాంబ, రెండు జెళ్లసీత, అప్పారావు, లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడు (అంటే మొగుడు లావని కాదు, పిన్నిగారే లావు).. అందరూ గోదావరి మాండలికమే మాట్లాడారు. సినిమాల్లో ఆమ్యామ్యా రామలింగాలు, ‘తీతా’లు (తీసేసిన తాసిల్దార్లు) అచ్చంగా ఇక్కడి మనుషులే… గోదావరి ‘మా ఫిలిం స్టూడియో’ అని ప్రకటించుకున్న ముళ్లపూడి తన నేస్తం బాపుతో కలసి తీసిన సినిమాలు అన్నీ ఆ గోదారమ్మ ఒడిలోనే పురుడు పోసుకున్నాయి. సినీ రచన చేయడానికి గోదావరిపై లాంచి మాట్లాడుకుని, భద్రాద్రి రాముడి దర్శనం చేసుకోవడానికి వెళుతూ ఆ రచన పూర్తి చేసేవారు.
హాస్యరచనలతో ప్రసిద్ధుడైన ముళ్ళపూడి రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది.
Also read: తెలుగు చిత్రసీమ గర్వించదగిన మహానటుడు అక్కినేని
బాపు మొట్టమొదటి చిత్రం సాక్షి నుంచి పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి చిత్రాల వరకు ఆయన రచన చేసినవే.
అలాగే, సీతా కళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్, రాజకీయ బేతాళ పంచవింశతి, ఋణానంద లహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ-ఆనందరావు, విమానం కథ, బుడుగు, నవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, గిరీశం లెక్చర్లు, కృష్ణలీలలు, చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపై సమీక్షలు, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109, కోతి కొమ్మచ్చి, ఇద్దరు మిత్రులు (వెండితెర నవల), తిరుప్పావై దివ్య ప్రబంధం, మేలుపలుకుల మేలుకొలుపులు, రమణీయ భాగవత కథలు, రామాయణం (ముళ్ళపూడి, బాపు), శ్రీకృష్ణ లీలలు సినిమా కథ, మాటలు, సాక్షి లాంటి రచనలు ముళ్ళపూడికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాయి.
నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కోరికపై విద్యార్థులకు వీడియో పాఠాలు తీశారు. రామాయణాన్ని అమితంగా ప్రేమించే రమణ చివరి రచన కూడా శ్రీరామరాజ్యం కావడం విశేషం. ముళ్ళపూడి 2011లో ఫిబ్రవరి 24న చెన్నయ్‌లో కన్ను మూశారు. ముళ్లపూడి లేని లోటు చిత్ర రంగంతో పాటు సాహితీ రంగాన ఎన్నటికీ తీర్చలేనిది.
Also read: జాతి గర్వించే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
(జూన్ 28న ముళ్ళపూడి వెంకట రమణ జయంతి సందర్భంగా ప్రత్యేకం)
–దాసరి దుర్గా ప్రసాద్