నిస్పాక్షికంగా పత్రిక వస్తుందని జస్టిస్ సుభాష్ రెడ్డి ఆశాభావం
జర్నలిస్టులు స్వయంగా పత్రిక పెట్టుకోవడం మంచి ప్రయోగం
జర్నలిస్టులు నెలకొల్పిన తెలుగు పత్రిక ‘ముద్ర’ ఆదివారంనాడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి చేతుల మీదుగా విడుదల అయింది. ప్రజల ఆశలనూ, ఆశయాలనూ ప్రతిబింబించడంలో ప్రధాన స్రవంతి వార్తాపత్రికలు విఫలమైనాయని ప్రజలు అనుకుంటున్న సమయంలో, ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్తంభం వంటి పత్రికావ్యవస్థ సమర్థంగా పని చేయలేకపోతోందని భావిస్తున్న తరుణంలో పాత్రికేయులే డబ్బులు సమీకరించి చిన్న స్థాయిలో ఒక స్వతంత్ర పత్రికను నెలకొల్పడం చరిత్రాత్మకం.
నిజానికి ఇది నలభై ఏళ కల. 1995 మేలో ‘ఉదయం’ దినపత్రికను యాజమాన్యం మూసివేసినప్పుడు ఉద్యోగులు కోర్టు గుమ్మం ఎక్కితే నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘యాజమాన్యం మూసివేసిన పత్రికను పాత్రికేయులు నడుపుకోవచ్చు కదా’ అని ఉద్యోగుల తరఫున వాదించిన అడ్వకేట్ తో అన్నారు. అనేక కారణాల వల్ల ఆ సలహాను అమలు చేయలేకపోయారు. జర్నలిస్టులు పత్రిక నడుపుకోవడం అన్నది ఒక కలగానే మిగిలిపోయింది.
ఇప్పుడు డిజిటల్ మీడియా వ్యవస్థ సుస్థిరంగా వేళ్ళూనుకుంటున్నది. తక్కువ పెట్టబడితో డిజటల్ వెబ్ సైట్లనూ, డిజిటల్ పత్రికలనూ జర్నలిస్టులు స్వయంగా నడుపుకుంటున్నారు. వీటిలో కొన్ని మాత్రమే బాగా నడుస్తున్నాయి.
పత్రికరచయితలు ‘ముద్ర’ ను స్వాగతించాలి. యాభై మంది జర్నలిస్టులు తమ సొంత డబ్బులు సమీకరించి పెట్టుబడిగా పెట్టి పత్రికను నెలకొల్పారు. నిస్పక్షపాతంగా పత్రిక వస్తుందని ఆశిస్తున్నారు.
ముద్రను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జర్నలిస్టులు ఈ విధంగా ప్రయోగం చేయడం మంచిపనేననీ, ముద్రలో వార్తలు నిస్పక్షఫాతంగా వస్తాయని విశ్వసిస్తున్నాననీ అన్నారు.
సీనియర్ జర్నలిస్టులు కె. శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, ఆలపాటి సురేష్, డి. కృష్ణారెడ్డి, కె. రామనారాయణ, విరాహత్ అలీ, నరేంద్రరెడ్డి, వనం వెంకటేశ్వర్లు, తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.