డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి:
- భర్త కారణంగానే వెలుగుతున్నానని ఆమె విశ్వాసం
- అన్ని పురస్కారాలూ భర్త పాదపద్మాలకే అంకితం
- వైష్ణవ జనతో….అడిగి పాడించుకునేవారు గాంధీజీ
ఆమె సంగీత సామ్రాజ్ఞి. సామాన్యుల నుంచి కంచి పీఠాధిపతి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి లాంటి అసామాన్యులు, దేశాధినేతల మన్ననలు, శుభాశీస్సులు, అంతర్జాతీయ వేదికలపై విశిష్ట పురస్కారాలు అందుకున్న విదుషీమణి. కర్ణాటక సంగీతాన్ని సంప్రదాయబద్ధంగా ఆలపించగల మేటి విద్వన్ముణులలో ముందు వరుసలో అగ్రస్థానంలోని వారు. దేశ అత్యున్నత పురస్కారం `భారతరత్న` గ్రహీత. ఆసియా నోబెల్ బహుమానంగా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం అందుకున్నతొలి భారతీయ సంగీత కళాకారిణి. ఐక్యరాజ్యసమితిలో పాడిన తొలి గాయని. ఆమే ఎంఎస్ సుబ్బులక్ష్మి. తెలుగువారికి `సుబ్బలక్ష్మి`.
సంగీతంలో సందేశం వినిపించే ప్రతిభ:
`న్యూయార్క్ టైమ్స్`ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ,సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొంది. లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో చేసిన కచేరితో ఇంగ్లండ్ రాణి ప్రశంసలు అందుకున్నారు. గాంధీజీకి తనకు ఎంతో ఇష్టమైన ` వైష్ణవ జనతో….`లాంటి గీతాలను అడిగి మరీ పాడించుకునేవారట. లెక్కకు మిక్కిలి పురస్కారాలు, సన్మానాలు. సత్కారాలు వీటన్నిటికి ఆలంబన భర్తేనని ఆరాధనపూర్వకంగా చెప్పేవారు. భర్త త్యాగరాజు సదాశివన్ పేరు చెబితేనే తన జీవితం పరిపూర్ణమని భావించేవారామె.
అపూర్వ దాంపత్యం:
సంగీతరంగంలో అపూర్వ, అపురూప జంట సుబ్బులక్ష్మి, సదాశివన్ (ఎమ్మెస్సెస్). విరితావుల్లాంటి అనుబంధం. వారిద్దరి ఉచ్ఛాశనిశ్వాసాలు సంగీతం. జానుమద్ది వారన్నట్లు `అత్యుత్తమ హృదయాల సమ్మేళనం వారి దాంపత్యం`. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందనే నానుడి నిజమైతే, ప్రతి స్త్రీ ఉన్నతికి పురుషుడు కారకుడై ఉంటాడనేందుకు సదాశివన్ నిలువెత్తు నిదర్శనం. ’ఒక మామూలు గృహిణిగా ఉండిపోవడమే నా లక్ష్యం. కానీ ఆయనలోని నిబద్ధత, పట్టుదల నేను ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కారణాలయ్యాయి. నేను పాడాలని, పాడగలనని ఏనాడూ అనుకోలేదు. కానీ నా గాత్రాన్ని ఆశించింది ఆయనే. నేనీ స్థితిలో ఉన్నానంటే నా భర్తే కారణం. ఆయనే లేకపోతే నేనెక్కడ ఉండేదానినో. అందుకే నాకు లభించిన పురస్కారాలు, గౌరవాలన్నీ ఆయన పాద పద్మాలకే అంకితం` అనేవారు సుబ్బులక్ష్మి. `నువ్వు మలచిన ఈ బ్రతుకు నీకే నైవేద్యం`అని ఆత్రేయ అన్నట్లు ఒక సినీ గీతంలో అన్నట్లు భర్త భౌతికంగా దూరమైన తర్వాత ఆమె మళ్లీ కచేరి చేయలేదు.
బ్రిటిష్ చక్రవర్తితో పోల్చుకున్న సదాశివన్
ఎంఎస్ ను పెళ్లాడిన ఫలితంగా సదాశివన్ ఉద్యోగం కోల్పోయారట. ఆ సమయంలో సానుభూతి ప్రకటించిన మిత్రుడితో `తనకు నచ్చిన సామాన్యురాలిని పెళ్లాడేందుకు బ్రిటీష్ చక్రవర్తి సామ్రాజ్యాన్నే వదులుకున్నాడు. నాకు ఉద్యోగం మాత్రమే ఊడి పోయింది. ఆయనతో పోల్చుకుంటే నాకు కలిగిన నష్టం ఏ పాటిది?`అని ఎదురు ప్రశ్నించారు. ఇద్దరు పిల్లలు కలిగి భార్యను కోల్పోయిన తనను చేపట్టి, వారిద్దరికి తల్లిప్రేమను పంచిన ఆమె అంటే ఆయనకు మరింత గౌరవాభిమానాలు.
నిత్యవిద్యార్థిని
సుబ్బులక్ష్మి తనను తాను నిత్య విద్యార్థినిగా భావించేవారు. వేలాది కచేరీలు చేసినా ప్రతిసారీ పరీక్షగానే పరిగణించవారు.`సంగీతం మహాసాగరం. నేనొక నిత్య విద్యార్థిని. కచేరీ చేయాలంటే సాధన ఎంతో అవసరం. ఏ భాషలో పాడినా ప్రతి మాటకు అర్థం కచ్చితంగా తెలిసి పలకవలసి ఉంటుంది. అర్థం తెలుసుకొని పాడితేనే మనసు భగవంతుడిపై లగ్నమయ్యేది. అది స్వానుభవం. ఎన్నోసార్లు వేదికపై పాడుతున్నప్పుడు గొంతు ఆర్ద్రమయ్యేది` అని ఒక సందర్భంలో చెప్పారు.
సంగీతంతోనూ సమాజ సేవ
కళ కళ కోసం కాదు. మానవ వికాసం, సమాజ హితం కోసం అని నమ్మిన, మానవసేవే మాధవసేవే అని పరిపూర్ణంగా విశ్వసించిన జంట. కళను కాసుల కోసం కుదువ పెట్టలేదు. కానీ, సంగీత విభావరుల ద్వారా వచ్చిన ఆదాయంలో అత్యధిక భాగం సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అనాథ సేవకు అర్పించారు. కారణాంతరాల వల్ల అద్దె ఇంటికి మారినప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు తమిళనాడు ప్రభుత్వం సకల హంగులతో భవనం ఇవ్వజూపగా మృదువుగా తిరస్కరించారు.
సప్తగిరి విద్వన్మణి
తిరులేశుని `ఆస్థాన`సేవలో `సప్తగిరి విద్వన్మణి` బిరుదు పొందారు సుబ్బులక్ష్మి. పదవ ఏట (1926) ఆలయంలో తొలి సంగీత ప్రదర్శనతో మొదలైన సంగీత ప్రస్థానం దశాబ్దాల పాటు సాగి ఖండాంతరాలకు వ్యాపించింది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, అభంగాలను దేశభక్తి గేయాలు ఆలపించారు.ఆయా భాషల నుడికారంతో మాతృభాష అన్నంత భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత. విశేష గాన సంపదను ప్రసాదించిన సంగీత `లక్ష్మి` గొంతు 88 వ ఏట 2004లో మూగవోయింది.