అక్టోబర్ 3 నుంచి 2023 నుంచి శతాబ్ది మొదలు
జనధర్మ,వరంగల్ వాణిపత్రికల సంపాదకుడు
నాలుగు దశాబ్దాలకుపైగా జరల్నిస్టుగా కొనసాగటం అంతసులువు కాదు. తెలంగాణలో జిల్లాకేంద్రం వరంగల్ వంటి పట్టణంలో ఒక పత్రికా సంపాదకుడిగా, నిర్వాహకుడుగా కీర్తిశేషులు యం.యస్. ఆచార్య అనేక ఆటుపోటులను తట్టుకుంటూ, పత్రికావ్యాసంగాన్నినిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారంటే, దానివెనుక ఎంతటి ప్రతిభావ్యుత్పత్తులున్నాయో, పత్రికానిర్వహణపట్ల ఎంతటిదృఢదీక్షఉన్నదో విశ్లేషించ బూనటం ఎంతటివారికైనా సాధ్యంకాకపోవచ్చు.
ఆచార్య ఈ వృత్తిలోకి ఈ రంగంలోనివారు సమకాలీన ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రభావ, ప్రభవాలకుగురయ్యేవ్యక్తుల `వ్యవస్థలపట్ల సందర్భోచితంగా వ్యవహరించడంవల్ల అనేక చిక్కులు వస్తాయి. అనేక సందర్భాలలో అనేకులను విమర్శించవలసివస్తుంది. పరిమితమైన సాధన సంపత్తులతో నడిచే పత్రిక దానికున్న హంగులు ఆలంభనలవల్ల మాత్రమే గాక దాని ప్రతిభావ్యుత్పత్తుల వల్లనే మనగలుతుందనడానికి ‘జనధర్మ,’ ‘వరంగల్ వాణి’ పత్రికలే ఉదాహరణ.
హంగుల వార్తలకు, రంగుల బొమ్మలకు తప్ప అమ్మకాల విలువలు లేవన్న స్థాయికి చేరిన పత్రికారంగాన్ని అసలే వనరులు లేని పత్రికలు తట్టుకోవడం చాలాకష్టం. ఐతే, అలా తట్టుకోవడంమాత్రం, సైద్ధాంతికత, నిష్ఠ స్థాయిని బట్టేనని గట్టిగా చెప్పవచ్చు. ఈ కోణం నుంచి పత్రికారంగాన్ని, ‘జనధర్మ,’ ‘వరంగల్‌వాణి’ పత్రికలను విశ్లేషించినపడు ఆ పత్రికల రూపురేఖల్లో అక్షర నిక్షేపంలో దర్శనమయ్యే అపురూప రేఖాచిత్రం ఆ పత్రికల సంపాదకుడు. నిర్వాహకుడూ ఐన యం.యస్.ఆచార్య. నివురుగప్పిన నిప్పులా కనపడే శ్రీ ఆచార్య గారి జీవితవిశేషాలు తెలియనివారు అయన్ని చూసి అర్ధంచేసుకోవడం కన్నాఅపార్ధంచేసుకోవడమే తరుచు
జరిగేది.
యం.యస్. ఆచార్య గారికి డిగ్రీలు లేవు. కాని చదువులతల్లి వారింటి ఇలవేలుపు. వారిది పండితుల కుటుంబం. శ్రమతోఅధ్యయంచేసి, విద్యావిజ్ఞానాన్ని ఆర్జించి వాటిని పదిమందికి పంచిపెట్టిన విజ్ఞాన దాతలు పరమ పూజనీయులు వారి పూర్వీకులు.
ముత్తాత మాడభూషి
శ్రీరంగాచార్యులు
ఉభయ వేదాంత విద్వాంసులైన శ్రీమాడభూషి (మాడభూషణం) శ్రీరంగాచార్యులు గారు. వీరి తాతగారు వరంగల్లు జిల్లా మానుకోట తాలూకాలోని నెల్లికుదురు గ్రామంలోని నాయిని వారింట్లో వంట వండి అక్కడ ప్రసాదం వెంట తీసుకొని అమ్మాపురం గ్రామం కొండమీది శ్రీసీతారామస్వామికి ఆరగింపు పెట్టి అక్కడి నుండి మాటేడు గ్రామానికి వెళ్లి ఆ గ్రామవాసి జులిజాల నరసయ్యగారి వద్ద పాఠాలు చదువుకొని, సాయంత్రానికి తిరిగి స్వగ్రామం చేరడం తాతగారి దినచర్య. ఇంత కష్టపడి చదివిన చదువు, భక్తితోకూడిన ప్రభుసేవ తర్వాతి కాలంలో వారిని ఆచార్య పురుషులను చేసింది. దాదాపు 14 గ్రామాలలో ఆచార్యగారికి శిష్యగణం ఉండేది. అనేక గ్రామాలలో సంప్రదాయ ధర్మప్రబోధాల ద్వారా ఆచార్యత్వం నెరపి పల్లకీ సేవలను పొందారు శ్రీశ్రీ రంగాచార్యులుగారు. 14 గ్రామాలలో భూములను సంపాదించారు. తాను వంటచేసిన గ్రామంలో వంట అయ్యవారుగా గుర్తింపు పొందిన శ్రీరంగాచార్యులుగారు ఆ గ్రామంలోనే పెద్ద అయ్యవారుగా కీర్తింపబడ్డారు. ఇప్పటికీ వీరి కుటుంబీలకులకు ఈ పేరుతోనే ఆ గ్రామంలో గుర్తింపు ఉన్నది.
రామానుజరహస్యత్రయవివరణం అనే విశిష్టాద్వైత సంప్రదాయ తమిళ భాషా గ్రంథాన్ని ప్రసన్నజనజీవాతువు అనే మణిప్రణి తమిళ రచనల గ్రంథాన్నివారు రచించారు. మొదటిది ముద్రణకు నోచుకున్నా రెండవ గ్రంథం తాటాకు గ్రంథ రూపంలోనే ఉన్నది.(తిరుపతి వేద విశ్వవిద్యాలయము పరిష్కారించి ప్రచురణకు తీసుకుంటున్నారు.)
తాతగారు ప్రసన్న రాఘవాచార్యులు
శ్రీరంగాచార్యులుగారి ముగ్గురు సంతానంలో రెండవ వారు శ్రీప్రసన్న రాఘవాచార్యులు. వీరు కూడా సంస్కృత విద్యాపారంగతులు. బహుముఖ ప్రజ్ఞాశాలురు. స్వయంసాధనతో గడియాల రిపేరు వంటి సున్నితమైన పనులు మొదలు ఆయుర్వేద వైద్యవృత్తి వరకు కొనసాగించారు.
తండ్రిగారు ఎం ఎస్ ఆచార్య
శ్రీ ఆచార్య గారు సూర్యాపేటలో ని వారి మేనమామల స్వగృహంలో రక్షాక్షి ఆశ్వయుజ శుద్ద షష్టినాడు అనగా 3 అక్టోబర్ 1924వ సంవత్సరంలోజన్మించారు. బాల్యంతమస్వస్థానం నెల్లికుదురులో గడిచింది. తాతగారి కాలంనుండి కొనసాగుతున్న ఆచారం తండ్రిగారు పాటించి భోజనాలుపెట్టి విద్యార్థులకు విద్యనేర్పే పద్ధతి కొనసాగించేవారు.
ఉర్దూమీడియంలోచదువు
అక్కడే మరదరిసేతహతానియా (ప్రైమరీ)లో 4వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివారు. అప్పట్లో అక్కడ (హెడ్ మాస్టర్) సదర్ ముదిరిస్ మౌల్వీ హయాత్‌బేగ్` మహమ్మద్ జకీరియా. వేలాద్రి, లక్ష్మికాంతం, వానమామలై గోపాలాచార్యులుగారలు ముదిరిసులు (టీచర్లు) ములసయ్య, అబ్బులు ప్యూనులు. ఈ స్కూలు చదువు తరువాత నాన్నగారు ప్రసన్నరాఘవాచార్యులుగారి వద్దనే వీరు సంస్కృతం నేర్చుకున్నారు. శబ్దమంజరి, బాలరామాయణం, ధాతుమంజరి, రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం. (పూర్వమేఘం 57 శ్లోకాలవరకు) మరియు పంచోపనిషత్తులు, తిరుప్పావు, తిరువాయ్ మొదటి పది కూడా అధ్యయనం చేశారు. కొన్నాళ్లకు కుటుంబం గడవటం కష్టమైంది. సంస్కృత పాఠాలు తిండి పెట్టేస్థితి లేదు. శ్రీనారయ్యశాస్త్రి వద్ద నేర్చుకున్న వైద్యం, స్వయంకృషి వల్ల అబ్బిన జ్యోతిష మంత్రశాస్త్రాలు కొంత కాలం ఆర్జనకు పనికివచ్చినా కొన్నాళ్లు సంగీతం మృదంగవాద్యం, తబలా, హర్మోనియం, నాటకరచనలు, ఆర్జనకు సాధనాలైనవి.
–రచయిత స్వర్గీయ ఇందుర్తి ప్రభాకర్ తో మాడభూషి శ్రీధర్