• స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేపట్టనున్న విజయ సాయి రెడ్డి
• రాజకీయాలతో సంబంధం లేదని ప్రకటన
• అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపు
విశాఖ ఉక్కు ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామంటూ ఒకరికి మించి ఒకరు శపథాలు చేస్తున్నారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంటును క్యాష్ చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఉక్కు ఉద్యమం రోజు రోజుకు కొత్తరూపు సంతరించుకుంటూ ఉధృతమవుతోంది. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల (ఫిబ్రవరి) 20 న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఉదయం 9 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుండి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు సుమారు 25 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాదయాత్ర అనంతరం కూర్మన్మపాలెం బహిరంగ సభ లో విజయసాయిరెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.
Also Read: విశాఖ ఉక్కుపై నాయకుల తుప్పు రాజకీయాలు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్ లోపల, వెలుపలా వైసీపీ పోరాడుతూనే ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు 56 కంపెనీలను ప్రైవేటీకరించాలని చూస్తే ఆనాడు వైఎస్ఆర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా 13 కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని అన్నారు. అంతే కాకుండా ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు.
Also Read: “ఆంధ్రుల” హక్కులంటే అందరికీ “అంత” అలుసా…?
తాము చేపట్టే పాదయాత్రకు రాజకీయాలతో సంబంధం లేదని విజయసాయి స్పష్టం చేశారు. పాదయాత్రను రాజకీయాలతో ముడిపెట్టొద్దన్న ఆయన అన్ని పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు.